నరేశ్ అగస్త్య, ఫరియా అబ్దుల్లా జంటగా నటించిన చిత్రం ‘గుర్రంపాపిరెడ్డి’. మురళీ మనోహర్ దర్శకత్వంలో డా. సంధ్య గోలీ సమర్పణలో వేణు సద్ది, అమర్ బురా, జయకాంత్ (బాబీ) నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 19న విడుదల కానుంది. శుక్రవారం జరిగిన విలేకరుల సమావేశంలో జయకాంత్ మాట్లాడుతూ– ‘‘కొత్త నిర్మాతలంటే ఏదైనా లవ్‌స్టోరీ, యూత్‌ఫుల్ కంటెంట్‌తో తొలి సినిమా చేస్తుంటారు. కానీ మేం డార్క్ కామెడీ జానర్‌లో ‘గుర్రంపాపిరెడ్డి’ సినిమా చేశాం. ఈ కథ విని, తరుణ్ భాస్కర్ లీడ్ రోల్ చేస్తానని అన్నారు. కానీ ఆయన ఇతర ప్రాజెక్ట్స్‌తో బిజీగా ఉండటం వల్ల కుదరలేదు.
ఆ తర్వాత మరో యంగ్ హీరో కథ విని, ఓకే చెప్పారు. కానీ ఆ హీరో ఈ సినిమా చేయలేదు. ఈ క్రమంలో నరేశ్ అగస్త్యకు ఈ సినిమా కథ వినిపించగా, ఓకే అన్నారు. ‘గుర్రంపాపిరెడ్డి’పాత్రలో నరేశ్ బాగా నటించారు. ఈ చిత్రంలో సౌదామినిపాత్రలో ఫరియా అబ్దుల్లా మంచి రోల్ చేశారు. ‘జాతి రత్నాలు’ సినిమాలో ఉన్నట్లుగా బ్రహ్మానందంగారు–ఫరియాల మధ్య మంచి కామెడీ ట్రాక్ ఉంది. రీసెంట్ టైమ్స్‌లో బ్రహ్మానందంగారు ఓ ఫుల్ లెంగ్త్ రోల్ చేసిన సినిమా ఇదే.
దర్శకుడు మురళీ మనోహర్ బాగా తెరకెక్కించారు. ఓ ఫన్ రైడ్ మూవీలా మా ‘గుర్రంపాపిరెడ్డి’ ప్రేక్షకులను నవ్విస్తుంది’’ అని చెప్పారు. అమర్ బురా మాట్లాడుతూ– ‘‘తెలివిలేని వాళ్లు తెలివైనవాడిని ఎలా ఎదుర్కొన్నారు? అన్నదే ఈ సినిమా ప్రధాన కథాంశం. సందేశాల కోసం ప్రేక్షకులు థియేటర్స్‌కు రారు. ప్రేక్షకులు ఎంటర్‌టైన్ అయ్యే ఫన్, కామెడీ మా సినిమాలో ఉన్నాయి. మా ‘గుర్రంపాపిరెడ్డి’ సినిమాను 140 స్క్రీన్స్‌లో ఓన్‌గా రిలీజ్ చేస్తున్నాం. టికెట్ ధరలను కూడా ప్రేక్షకులకు అందుబాటులో ఉండేలా ΄్లాన్ చేస్తున్నాం’’ అని తెలిపారు.


