రాష్ట్రపతి పర్యటన ఖరారు | President Ram Nath Kovind tour confirmed in telangana | Sakshi
Sakshi News home page

రాష్ట్రపతి పర్యటన ఖరారు

Dec 12 2017 1:59 AM | Updated on Dec 14 2017 12:06 PM

President Ram Nath Kovind tour confirmed in telangana - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ తెలంగాణ రాష్ట్ర పర్యటన అధికారికంగా ఖరారైంది. ఈ మేరకు రాష్ట్రపతిభవన్‌ రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారం అందించింది. ప్రపంచ తెలుగు మహాసభల ముగింపు ఉత్సవంలో పాల్గొనేందుకు రామ్‌నాథ్‌ కోవింద్‌ ఈ నెల 19న రాష్ట్రానికి రానున్నారు. షెడ్యూలు ప్రకారం 19న (మంగళవారం) మధ్యాహ్నం 2.55 గంటలకు ప్రత్యేక విమానంలో ఢిల్లీ నుంచి బేగంపేట ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున గవర్నర్‌ నరసింహన్, ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆయనకు స్వాగతం పలుకుతారు. సాయంత్రం 5 నుంచి 6 గంటల వరకు ఎల్‌బీ స్టేడియంలో జరిగే మహాసభల ముగింపు వేడుకల్లో రాష్ట్రపతి ముఖ్య అతిథిగా పాల్గొంటారు. ఆ రోజు హైదరాబాద్‌లోనే బస చేయనున్న ఆయన మరుసటి రోజు ఉదయం 10.30కు హుస్సేన్‌సాగర్‌లోని బుద్ధ విగ్రహానికి పూలమాల అలంకరిస్తారు. అనంతరం ఢిల్లీకి పయనమవుతారు. దక్షిణాది రాష్ట్రాల శీతాకాల విడిదికి రాష్ట్రపతి మళ్లీ ఈ నెల 23న హైదరాబాద్‌కు వస్తారు. 27 వరకు బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో బస చేస్తారు. ఈ వ్యవధిలో ఇక్కడి నుంచే అధికారిక కార్యకలాపాలు నిర్వహిస్తారు.

రాష్ట్రపతి నిలయానికి కొండముచ్చుల కాపలా
రాష్ట్రపతి నిలయంలో కోతులను అదుపుచేసేందుకు కొండముచ్చులొచ్చాయి.. మరోవైపు జూపార్కు నుంచి ప్రత్యేక సిబ్బంది వచ్చి పాముల వేట మొదలుపెట్టారు. రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ఈనెల 23 నుంచి శీతాకాల విడిది కోసం బొల్లారంలోని రాష్ట్రపతి నిలయానికి వస్తుండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఆయన బాధ్యతలు తీసుకున్న తర్వాత తొలిసారి నగరానికి వస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులుకూడా పెద్దసంఖ్యలో వస్తున్నట్టు అధికారులకు సమాచారం అందింది. దీంతో అప్రమత్తమైన అధికారులు వెంటనే రంగంలోకి దిగారు. విద్యుత్, మంచినీళ్లు, పారిశుధ్యం లాంటి సమస్యలు లేకుండా చూడటంతోపాటు కోతులు, పాముల బెడదపై కూడా దృష్టిసారించారు. ఆ ప్రాంగణంలో పెద్దసంఖ్యలో కోతులు సంచరిస్తుంటాయి.

రాష్ట్రపతి విడిది చేసిన సమయంలో గతంలో కొన్ని కోతులు భవనంలోకి రావటాన్ని దృష్టిలో ఉంచుకుని ఈసారి కోతులు ఎలాంటి ఇబ్బందులు సృష్టించకుండా చర్యలు ప్రారంభించారు. కోతులు ఉన్న ప్రాంతంలోనే వాటికి ఆహారం, నీళ్లు అందిస్తారు. భవనంవైపు రాకుండా కొన్ని కొండముచ్చులను కాపలాగా ఉంచుతారు. గతంలో పాములు వచ్చిన దాఖలాలున్నాయి. ఆ సమస్య పునరావృతం కాకుండా వాటిని పట్టుకునేందుకు సిబ్బంది రంగంలోకి దిగారు. రాష్ట్రపతి ఉదయం, సాయంత్రం వాహ్యాళికి వెళ్లే సమయం, ఆయన, కుటుంబ సభ్యులు తోటలో విహరించే సమయంలో వారివెంట ఇద్దరు సిబ్బంది అందుబాటులో ఉంటారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement