హైకోర్టు సీజే నియామకానికి రాష్ట్రపతి ఆమోదం 

President Accepted High Court CJ Appointment Telangana - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా (సీజే) జస్టిస్‌ తొట్టతిల్‌ భాస్కరన్‌ నాయర్‌ రాధాకృష్ణన్‌ నియామకానికి రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ఆదివారం ఆమోదముద్ర వేశారు. దీంతో కేంద్ర న్యాయశాఖ జస్టిస్‌ రాధాకృష్ణన్‌ నియామకానికి సంబంధించిన నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఈ నెల 16లోపు బాధ్యతలు చేపట్టాలని ఆయనను కోరింది. జస్టిస్‌ రాధాకృష్ణన్‌ ఇప్పటివరకు ఛత్తీస్‌గఢ్‌ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు నిర్వర్తించారు. రాష్ట్ర హైకోర్టు సీజేగా జస్టిస్‌ రాధాకృష్ణన్‌ను నియమిస్తూ సుప్రీం కోర్టు కొలీజియం ఈ ఏడాది జనవరిలో కేంద్రానికి సిఫారసు చేసింది. అయితే అప్పట్నుంచి ఈ సిఫారసులకు కేంద్రం ఆమోదముద్ర వేయలేదు. దీంతో అందరూ కూడా జస్టిస్‌ రాధాకృష్ణన్‌ నియామకం ఆగినట్లేనని భావించారు. కేంద్రం అనూహ్యంగా జస్టిస్‌ రాధాకృష్ణన్‌ నియామకానికి మూడు రోజుల కింద ఆమోదం తెలుపుతూ సంబంధిత ఫైల్‌ను రాష్ట్రపతికి పంపింది. ఆదివారం రాష్ట్రపతి ఆ ఫైల్‌పై ఆమోదముద్ర వేశారు. ఉమ్మడి హైకోర్టు సీజేగా రాధాకృష్ణన్‌ బుధ లేదా గురువారాల్లో ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉన్నట్లు హైకోర్టు వర్గాలు తెలిపాయి. ఈయన నియామకంతో హైకోర్టు న్యాయమూర్తుల సంఖ్య 30కి చేరనుంది. ఇప్పటి వరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే)గా బాధ్యతలు నిర్వర్తించిన జస్టిస్‌ రమేశ్‌ రంగనాథన్‌ ఇకపై నంబర్‌ 2గా కొనసాగనున్నారు. 

బాల్యం, విద్య.. 
జస్టిస్‌ తొట్టతిల్‌ బి.రాధాకృష్ణన్‌ 1959 ఏప్రిల్‌ 29న కేరళలో జన్మించారు. ఆయన తండ్రి ఎన్‌.భాస్కరన్‌ నాయర్, తల్లి కె.పారుకుట్టి ఇద్దరూ న్యాయవాదులే. కొల్లంలో ప్రాథమిక విద్య పూర్తి చేసి కేరళ యూనివర్సిటీ నుంచి బీఎస్సీ డిగ్రీ, బెంగళూరు యూనివర్సిటీ నుంచి ఎల్‌ఎల్‌బీ పూర్తి చేశారు. 1983లో న్యాయవాదిగా నమోదయ్యారు. తిరువనంతపురంలో 
పి.రామకృష్ణ పిళ్లై వద్ద జూనియర్‌గా వృత్తి జీవితాన్ని ఆరంభించారు. 1988లో తన ప్రాక్టీస్‌ను హైకోర్టుకు మార్చారు. అతి తక్కువ కాలంలోనే సివిల్, రాజ్యాంగపరమైన కేసుల్లో మంచి పట్టు సాధించారు. పలు ప్రభుత్వ రంగ సంస్థలకు, బ్యాంకులకు న్యాయవాదిగా వ్యవహరించారు. 2004 అక్టోబర్‌లో కేరళ హైకోర్టు న్యాయమూర్తిగా, 2015న అదే హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు నిర్వర్తించారు. 2017లోపదోన్నతిపై ఛత్తీస్‌గఢ్‌ ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 

ఏసీజేగా జస్టిస్‌ రమేశ్‌ రంగనాథన్‌ రికార్డు.. 
ఇప్పటి వరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా వ్యవహరించిన జస్టిస్‌ రమేశ్‌ రంగనాథన్‌ అత్యధిక కాలం పాటు ఏసీజేగా పనిచేసిన న్యాయమూర్తిగా రికార్డు సృష్టించారు. 2016 జూలై 30న ఏసీజే బాధ్యతలు చేపట్టిన జస్టిస్‌ రమేశ్‌ రంగనాథన్‌ దాదాపు రెండేళ్ల పాటు అందులో కొనసాగారు. సుదీర్ఘ కాలం ఏసీజేగా పనిచేసిన న్యాయమూర్తి ఎవరూ లేరు. 1992లో జస్టిస్‌ అంబటి లక్ష్మణరావు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా రెండు సంవత్సరాల పాటు ఏసీజేగా కొనసాగినా, ఏక కాలంలో ఆయన ఆ బాధ్యతలను నిర్వర్తించలేదు. మొత్తం ఆరు వేర్వేరు సందర్భాల్లో జస్టిస్‌ లక్ష్మణరావు ఏసీజేగా బాధ్యతలు నిర్వర్తించారు. కానీ జస్టిస్‌ రంగనాథన్‌ నిరాటంకంగా దాదాపు రెండేళ్ల పాటు ఏసీజేగా పనిచేశారు.  

 

 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top