ఈ–ఆఫీస్‌.. పేపర్‌ లెస్‌ వర్క్‌.. 

Preparations for Police System Online - Sakshi

పోలీస్‌ వ్యవస్థను ఆన్‌లైన్‌ చేసేందుకు సన్నాహాలు

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర పోలీస్‌ శాఖలో పనులన్నీ ఈ–ఆఫీస్‌ వ్యవస్థ ద్వారానే నిర్వహించాలని ఆ శాఖ ఉన్నతాధికారులు నిర్ణయించారు. ప్రతీ ఫైలును కంప్యూటర్ల ద్వారానే ఆపరేట్‌ చేస్తూ ట్రాకింగ్, ఆమోద నిర్ణయాలు, నోట్‌ ఫైల్‌ తదితరాలన్నింటినీ ఆన్‌లైన్‌లోనే నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. దీంతో పేపర్‌ వినియోగం లేకుండానే పనులు పూర్తవుతాయని శాఖ భావిస్తోంది. ఇప్పటికే పైలట్‌ ప్రాజెక్ట్‌ కింద హైదరాబాద్‌ కమిషనరేట్‌లో ఈ–ఆఫీస్‌ను ప్రారంభించారు. దీనికోసం ఇప్పటికే అన్నీ స్టేషన్ల ఎస్‌హెచ్‌వో, ఏసీపీ, డీసీపీ, అదనపు సీపీలకు శిక్షణనిచ్చారు.

రాష్ట్ర పోలీస్‌ ముఖ్య కార్యాలయంలోని మినిస్టీరియల్‌ స్టాఫ్, ఎగ్జిక్యూటివ్‌ స్టాఫ్‌కు శిక్షణ ఇస్తున్నారు. ఇన్‌వార్డు నుంచే ప్రతీ దరఖాస్తుకు నంబర్‌ ఇవ్వడం, అది ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తోంది, ఏ అధికారి వద్ద ఫైలు ఎన్ని రోజులు పెండింగ్‌లో ఉంది, తదితర వివరాలను ఆన్‌లైన్‌ ద్వారా ట్రాక్‌ చేయవచ్చు. జిల్లా పోలీస్‌ విభాగాల్లోనూ ఈ–ఆఫీస్‌ను అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. గతంలో కేఎం ఆటమ్‌ అనే సాఫ్ట్‌వేర్‌ ద్వారా ప్రవేశపెట్టిన ఆన్‌లైన్‌ విధానం కొన్ని విభాగాలకే పరిమితమైంది.

ఈసారి మాత్రం పోలీస్‌ స్టేషన్‌ నుంచి డీజీపీ కార్యాలయం వరకు అంతా ఆన్‌లైన్‌లోనే కార్యకలాపాలు సాగించేలా ఈ–ఆఫీస్‌ను అందుబాటులోకి తీసుకురానున్నారు. దీనిపై పోలీస్‌ అధికారులందరికీ శిక్షణ ఇవ్వాలని అధికారులను డీజీపీ మహేందర్‌రెడ్డి ఆదేశించారు. దశల వారీగా అన్ని జిల్లాల్లో ఈ–ఆఫీస్‌ అందుబాటులోకి వస్తుందని డీజీపీ కార్యాలయం తెలిపింది.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top