నయాఖిల్లాలోని చారిత్రక స్థలాలు పరాధీనం?

Preparations For Giving Golf Course Historic Land Adjacent To Golconda - Sakshi

కొద్ది రోజులుగా ఏఎస్‌ఐ ఆధ్వర్యంలో శాస్త్రీయ పరిశీలన

భూగర్భంలో మొఘల్‌ గార్డెన్‌ తరహా నిర్మాణం

గతంలోనే 14 ఎకరాల్లో వెలికితీసిన అధికారులు

మిగతా స్థలంపై అధ్యయనం

ఆ స్థలాన్ని ఇవ్వాలని కోరుతున్న గోల్ఫ్‌కోర్సు నిర్వాహకులు

సాక్షి, హైదరాబాద్‌ : గోల్కొండ పక్కనే ఉన్న నయాఖిల్లాలో ఉన్న చారిత్రక ప్రాధాన్యమున్న భూములను గోల్ఫ్‌కోర్సుకు ఇచ్చేందుకు సన్నాహాలు జరుగుతున్నట్టు తెలుస్తోంది. ఆ ప్రాంతంలో గతంలో భారీ విస్తీర్ణంలో మొఘల్‌ గార్డెన్‌ తరహా నిర్మాణం ఉండేది. శతాబ్దాల క్రితమే అది భూమిలోకి కూరుకుపోయింది. దాన్ని సరిగ్గా 11 ఏళ్ల క్రితం గుర్తించి తవ్వకాలు ప్రారంభించారు. దాదాపు 14 ఎకరాల విస్తీర్ణంలో అలనాటి అద్భుత ఉద్యానవన నిర్మాణ ఆనవాళ్లు వెలుగు చూశాయి. దాని చుట్టూ ఇంకా మరో 16 ఎకరాల స్థలం ఉంది. అందులోనూ భూగర్భంలో నిర్మాణాలున్నాయి. ఇప్పుడు 14 ఎకరాల స్థలం మా త్రమే భారత పురావస్తు సర్వేక్షణ విభాగం పరిధిలో ఉంచి, మిగతాదాన్ని తెలంగాణ పర్యాటకాభివృద్ధి సంస్థ స్వాధీనం చేసుకోబోతోందని సమాచారం. ఆ ప్రాంతంలో చుట్టూ గోల్ఫ్‌ కోర్సు విస్తరించి ఉంది. మధ్య లో ఉన్న ఈ స్థలాన్ని కూడా తమకు అప్పగిస్తే గోల్ఫ్‌కోర్సును విస్తరిస్తామంటూ దాన్ని నిర్వాహక కమిటీ చాలాకాలంగా కోరుతోంది.

ఖాళీగా ఉన్న 16 ఎకరాల్లో కొన్ని రోజులుగా శాస్త్రీయ పరిశోధనలో భాగంగా ఏఎస్‌ ఐ కందకాలు తవ్వుతోంది. భూగర్భంలో ఉన్న నిర్మాణ అవశేషాలను తెలుసుకుని, అంత ప్రాధాన్యమైనవి లేనట్టు తేలితే పరాధీనం చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇప్పటికే మీటరు నుంచి రెండు మీటర్ల మేర ఈ కందకాలను ప్రతి 30 అడుగుల నుంచి 60 అడుగులకొకటి చొప్పున తవ్వి చూస్తున్నారు. 14 ఎకరాల విస్తీర్ణంలో వెలుగు చూసిన భారీ ఉద్యానవనానికి సంబంధించి నీటి చానళ్లు, ఇతర అనుబంధ నిర్మాణాల అవశేషాలు వాటిల్లో కనిపిస్తున్నాయి. ఇప్పటికిప్పుడు ఆ చానళ్లు వాడే అవసరం లేనందున, ఇతర నిర్మాణాల్లోనూ ముఖ్యమైనవి పెద్దగా లేవన్న ఉద్దేశంతో ఆ స్థలాన్ని తెలంగాణ పర్యాటకాభివృద్ధి సంస్థకు అప్పగిస్తూ, దానితో ఏఎస్‌ఐ ఒప్పందం చేసుకోనుందని విశ్వసనీయంగా తెలిసింది. దీనివల్ల గోల్ఫ్‌కోర్సు విస్తరణకు వీలుకలిగే అవకాశం ఉం టుంది. ఏఎస్‌ఐ రీజినల్‌ డైరెక్టర్‌ మహేశ్వరి ఇటీవలే అక్కడికి వచ్చి సర్వే చేసి వెళ్లారు. త్వరలో ఆమె నివేదిక ఇవ్వనున్నారు.  

క్రీ.శ.1600 పూర్వమే నిర్మాణం 
దేశంలో తాజ్‌మహల్, ఔరంగాబాద్‌లోని బీబీకా మఖ్బారా ముందు మొఘల్‌ గార్డెన్స్‌ ఉన్నాయి. పచ్చికబయళ్లు, ఫౌంటెన్లతో కూడిన ఆ ఉద్యానవనాలు అద్భుతంగా ఉంటాయి. వాటికంటే ముందే అంతకంటే గొప్పగా నయాఖిల్లా వద్ద ఉద్యానవనాన్ని నిర్మించారు. గోల్కొండ కోటకు అనుబంధంగా నయాఖిల్లా నిర్మాణం సమయంలో క్రీ.శ.1600 పూర్వమే ఈ వనం నిర్మించినట్టు హైదరాబాద్‌ స్టేట్‌లో పురావస్తు అధికారిగా పనిచేసిన గులాం యాజ్దానీ పరిశోధించి తేల్చారు. దాదాపు పదేళ్ల క్రితం చేపట్టిన తవ్వకాల్లో ఇవన్నీ వెలుగు చూశాయి. మధ్యలో కొంతకాలం పనులు నిలిపేసినా... గత నాలుగేళ్లుగా మళ్లీ జరుపుతున్నారు. రాష్ట్రం ఉమ్మడిగా ఉన్న సమయంలో ఏఎస్‌ఐ–పర్యాటకశాఖ మధ్య ఈ స్థలం విషయంలో ఒప్పందం జరిగింది. అలనాటి నిర్మాణ జాడలు లేని స్థలాన్ని పర్యాటకశాఖకు అప్పగించాలని, నిర్మాణాలుంటే అక్కడ ఎలాంటి కొత్త పనులు చేపట్టవద్దని నిర్ణయించారు. ఇప్పుడు కందకాలు తవ్వి పరిశీలిస్తుంటే 2 ఎకరాల మేర తప్ప నిర్మాణాలు విస్తరించి ఉన్నట్టు గుర్తించామని ఓ ఏఎస్‌ఐ అధికారి వ్యాఖ్యానించారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top