39 లక్షల టన్నులు.. 3,732 కేంద్రాలు

Preparations of civil supplies department For yasangi grain purchases - Sakshi

యాసంగి ధాన్యం కొనుగోళ్లకు పౌర సరఫరాల శాఖ సన్నాహాలు

ఏర్పాట్లపై అధికారులతో కమిషనర్‌ అకున్‌ సబర్వాల్‌ వీడియో కాన్ఫరెన్స్‌

సాక్షి, హైదరాబాద్‌: వచ్చే నెల ఒకటో తేదీ నుంచి ప్రారంభం కానున్న యాసంగి సీజన్‌ ధాన్యం కొనుగోలు కోసం పౌరసరఫరాల శాఖ అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ధాన్యం విక్రయించేందుకు వచ్చే రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పకడ్బందీగా సన్నద్ధమవుతోంది. 39 లక్షల మెట్రిక్‌ టన్నులు కొనుగోలు చేయాలని ప్రాథమికంగా నిర్ణయించింది. ఇందులో ఏప్రిల్‌లో 14.25 లక్షల టన్నులు, మేలో 20.22 లక్షలు, జూన్‌లో 5.26 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం దిగుబడి అవుతుందని అంచనా వేసింది. ఇందుకోసం రాష్ట్రవ్యాప్తంగా 3,732 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తోంది. వీటిలో ఐకేపీ 1,366, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు (పీఏసీఎస్‌) 2,163, డీసీఎంఎస్, ఐటీడీఏ 203 కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోళ్లను నిర్వహిస్తాయి.  

కనీస వసతులపై దృష్టి పెట్టండి 
యాసంగి ధాన్య సేకరణ ఏర్పాట్లపై పౌరసరఫరాల శాఖ కమిషనర్‌ అకున్‌ సబర్వాల్‌ బుధవారం జాయింట్‌ కలెక్టర్‌లు, డీసీఎస్‌ఓలు, జిల్లా మేనేజర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. వచ్చే నెల మొదటి వారం నుంచి ధాన్యం కొనుగోళ్లు ప్రారంభమవుతున్న నేపథ్యంలో స్థానిక అవసరాలను బట్టి రైతులకు అందుబాటులో ఉండే విధంగా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అవసరమైతే అప్పటికప్పుడు కేంద్రాలను ఏర్పాటు చేసేలా ప్రణాళిక తయారు చేసుకోవాలన్నారు. వర్ష ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకొని ఎగువ ప్రాంతాల్లో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలన్నారు. మిల్లుల సామర్థ్యం మేరకు రైస్‌ మిల్లులకు ధాన్యం కేటాయింపులు జరపాలని, పౌరసరఫరాల శాఖకు కస్టం మిల్లింగ్‌ రైస్‌ (సీఎంఆర్‌)కు సంబంధించి బియ్యం ఎగవేతదారులకు ఎట్టి పరిస్థితుల్లోనూ ధాన్యం కేటాయింపులు జరపకూడదన్నారు. ధాన్యం దిగుబడిని దృష్టిలో పెట్టు కొని ప్రాధాన్యత క్రమంలో జిల్లాల వారీగా గోనె సంచులను కేటాయించడం జరుగుతోందని, స్థానికంగా ఎక్కడైనా అవసరమైతే రేషన్‌ డీలర్ల నుంచి ఒక్కో గోనె సంచి ధర రూ.16 చొప్పున కొనుగోలు చేయాలన్నారు.  

అంతా నిఘా నీడలో.. 
ప్రభుత్వానికి, రైతులకు, మిల్లర్లకు ప్రయోజనకరంగా ఉండేలా ఆన్‌లైన్‌ ప్రొక్యూర్‌మెంట్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టం (ఓపీఎంఎస్‌)ను మరింత అభివృద్ధి చేశామని అకున్‌ సబర్వాల్‌ చెప్పారు.  రైస్‌మిల్లు సీడింగ్‌ సామర్థ్యం తెలుస్తుందని, మిల్లులకు ధాన్యం కేటాయించడానికి వాటి మిల్లింగ్‌/బాయిలింగ్‌ సామర్థ్యం సమాచారం ఉంటుందని తెలిపారు. ధాన్యం కేటాయించిన 7 రోజులకైనా మిల్లుల నుంచి సమాచారం అందకపోతే ఆయా జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారులకు, జిల్లా మేనేజర్లకు హెచ్చరికలు జారీ చేస్తుందన్నారు. ఆన్‌లైన్‌లో రైతుల రిజిస్ట్రేషన్‌ జరుగుతుందని, జియో ట్యాగింగ్‌ ద్వారా కొనుగోలు కేంద్రాలు, మిల్లులపై నిఘా ఉంటుందన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల నుంచి రైసు మిల్లులకు ధాన్యాన్ని తరలించే వాహనాలకు జీపీఎస్‌ యంత్రాలను అమర్చడం జరుగుతుందని తెలిపారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top