కదిలింది గులాబీ దండు

Pragathi Nivedana Sabha TRS Leaders Nizamabad - Sakshi

నిజామాబాద్‌అర్బన్‌: దారులన్నీ అటు వైపే.. వాహనాలన్నీ ‘ప్రగతి’ సభ వైపే.. దీంతో ఉమ్మడి జిల్లాలోని ప్రధాన రహదారులన్నీ బిజీబిజీగా కనిపించాయి. గులాబీ జెండాల రెపరెపలతో సందడిగా మారాయి. టీఆర్‌ఎస్‌ పార్టీ రంగారెడ్డి జిల్లా కంగరకొలాన్‌లో ఆదివారం నిర్వహించిన ప్రగతి నివేదన సభకు ఉమ్మడి జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు, ప్రజలు తరలివెళ్లారు. వందలాది వాహనాల్లో వారంతా తరలి వెళ్లడంతో ప్రధాన రహదారులన్నీ కిక్కిరిసి పోయాయి.

1.10 లక్షల మంది తరలింపు.. 
ప్రగతి నివేదన సభకు నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల నుంచి సుమారు 1.10 లక్షల మంది తరలి వెళ్లినట్లు అంచనా. నిజామాబాద్‌ జిల్లా నుంచి సుమారు 53 వేల మంది సభకు వెళ్లారు. ప్రభుత్వ, ప్రైవేట్‌ బస్సులతో పాటు ఇతర వాహనాల్లో ఉదయం నుంచే బయల్దేరి వెళ్లారు. నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు, పార్టీ ముఖ్యలు, రాష్ట్ర నాయకులు జన సమీకరణ చేపట్టారు. నిజామాబాద్‌ అర్బన్‌ నియోజకవర్గం నుంచి 88 ఆర్టీసీ బస్సులు, 90 ప్రైవేట్‌ బస్సులు, 240 వరకు కార్లలో 8,700 మంది వరకు తరలివెళ్లారు. బాల్కొండ నుంచి 687 వాహనాల్లో 12,465 మంది, బోధన్‌ నుంచి 450 వాహనాల్లో 9,700 మంది, నిజామాబాద్‌ రూరల్‌ నియోజకవర్గ పరిధిలో 425 వాహనాల్లో 11,400 మంది, ఆర్మూర్‌ నియోజకవర్గ పరిధిలో 750 వాహనాల్లో 12,500 మందిని తరలించారు. కామారెడ్డి నియోజకవర్గం నుంచి 16 వేలు, బాన్సువాడ నుంచి 12 వేలు, ఎల్లారెడ్డి నుంచి 12 వేలు, జుక్కల్‌ నుంచి 11 వేల మంది వరకు ప్రభుత్వ, ప్రైవేట్‌ బస్సులతో పాటు అద్దె వాహనాల్లో తరలి వెళ్లారు. మొత్తం కామారెడ్డి జిల్లా నుంచి 51 వేల మంది వరకు ప్రగతి నివేదన సభకు బయల్దేరి వెళ్లారు.

రహదారులన్నీ గులాబీమయం.. 
జన సమీకరణ బాధ్యతలను ముఖ్యమంత్రి కేసీఆర్‌ స్థానిక ఎమ్మెల్యేలకు అప్పగించారు. దీంతో ఎమ్మెల్యేలు రెండు, మూడ్రోజులుగా తమ నియోజకవర్గాల్లోనే తిష్టవేసి జన సమీకరణకు సర్వశక్తులు ఒడ్డారు. జనాన్ని తరలించేందుకు అవసరమైన వాహనాలను సమకూర్చారు. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో కలిపి 508 ఆర్టీసీ బస్సులను అద్దెకు తీసుకున్నారు. అలాగే, ప్రైవేట్‌ వాహనాలు, ట్రాక్టర్లు, సుమోలు అద్దెకు తీసుకుని జనాలను తరలించారు. 44వ జాతీయ రహదారి గులాబీమయంగా మారింది.

నిజామాబాద్, ఆదిలాబాద్‌ జిల్లాలకు చెందిన వాహనాలతో హైవే కిక్కిరిసింది. మరోవైపు ట్రాఫిక్‌ ఇబ్బందులు తలెత్తకుండా ప్రధాన ప్రాంతాలతో పోలీసులు చర్యలు చేపట్టారు. ఇందల్‌వాయి టోల్‌ప్లాజా వద్ద సీపీ కార్తికేయ ట్రాఫిక్‌ నియంత్రణను పర్యవేక్షించారు. హైవేతో పాటు జిల్లాకు అనుసంధామున్న రాష్ట్ర రహదారులు, వివిధ మండలాల నుంచి జిల్లాకు.. అక్కడి నుంచి జాతీయ రహదారికి వెళ్లేందుకు రూట్‌మ్యాప్‌ను రూపొందించారు. ఒక్కో ప్రధాన ప్రాంతం వద్ద సీఐ స్థాయి అధికారి, ట్రాఫిక్‌ పోలీసులను నియమించారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top