ఫ్యాకల్టీ లేని ‘డైట్‌’ కళాశాల

DIET Colleges Without Faculty - Sakshi

అధ్యాపకులు లేకుండానే  కొనసాగుతున్న డీఎడ్‌ కళాశాలలు 

కాబోయే ఉపాధ్యాయులకు అందని నాణ్యమైన విద్య 

సాక్షి ప్రతినిధి, నిజామాబాద్‌: భవిష్యత్తు ఉపాధ్యాయులను తయారు చేసేందుకు రాష్ట్రంలోని ఉమ్మడి జిల్లాల్లో అనేక ఏళ్ల నుంచి కొనసాగుతున్న ‘డైట్‌’(ప్రభుత్వ జిల్లా విద్యా, శిక్షణ సంస్థ) కళాశాలలు అధ్యాపకులు లేకుండానే కొనసాగుతున్నాయి. పది ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో 1989 నుంచి ఏటా వందల మంది విద్యార్థులు తాము సాధించిన ర్యాంకుల ద్వారా డీఎడ్‌ కోర్సుల్లో చేరుతున్నారు. నల్లగొండ, ఖమ్మం కళాశాలల్లో తెలుగు, ఆంగ్ల మాధ్యమాలు ఉండగా, మిగిలిన వరంగల్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్, హైదరాబాద్, మహబూబ్‌నగర్, మెదక్, వికారాబాద్‌ కళాశాలల్లో తెలుగు, ఆంగ్లంతో పాటు ఉర్దూ మాధ్యమం కూడా ఉంది. అయితే ఇవి గత మూడేళ్లుగా అధ్యాపకులు లేకుండానే నడుస్తున్నాయి. పది చోట్ల 290 మంది టీచింగ్‌ స్టాఫ్‌ ఉండాల్సి ఉంది.

అయితే మొత్తం రాష్ట్రంలోని 10 కళాశాలల్లో కలిపి 300 మందికి గాను కేవలం 17 మంది మాత్రమే ఉన్నారు. ఉర్దూ మీడియం లేని ఖమ్మం, నల్లగొండ కళాశాలల్లో 24 మంది అధ్యాపకులు, మిగిలిన 8 కళాశాలల్లో 29 మంది చొప్పున అధ్యాపకులు ఉండాలి. అయితే ఎక్కడా కూడా సరిపడా అధ్యాపకులు లేకపోగా, ఉన్న అధ్యాపకులు, ప్రిన్సిపపాళ్లు వివిధ జిల్లాలకు ఇన్‌చార్జి జిల్లా విద్యాశాఖ అధికారులుగా వ్యవహరిస్తున్నారు. దీంతో నామమాత్రంగా ఉన్న అధ్యాపకులు సైతం అందుబాటులో లేని దుస్థితి నెలకొంది. దీనివల్ల విద్యార్థులకు నాణ్యమైన విద్య అందడం లేదని విమర్శలు వస్తున్నాయి.  

అంతా అస్తవ్యస్తం.. 
నిజామాబాద్‌ డైట్‌ కళాశాలలో రెగ్యులర్‌ ప్రిన్సిపల్‌ ఉండగా, ఒకే ఒక్క అధ్యాపకుడు ఉన్నారు. ఆ అధ్యాపకుడు కూడా ఆసిఫాబాద్‌ డీఈవోగా వ్యవహరిస్తున్నారు. మెదక్‌ కళాశాలలో రెగ్యులర్‌ ప్రిన్సిపల్, ఒకే ఒక్క అధ్యాపకుడు ఉన్నారు. వరంగల్‌ కళాశాలలో అధ్యాపకులు ఎవరూ లేరు. కళాశాల ప్రిన్సిపల్‌ యాదాద్రి భువనగిరి డీఈవోగా అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్‌ కళాశాలలో అధ్యాపకులు లేరు. రెగ్యులర్‌ ప్రిన్సిపల్‌ ఉన్నారు. వికారాబాద్‌ కళాశాలలో ఇద్దరు అధ్యాపకులు ఉండగా, ప్రిన్సిపల్‌ లేరు. నల్లగొండ కళాశాలలో ఒకే ఒక్క అధ్యాపకుడు ఉండగా, ప్రిన్సిపల్‌ లేరు. కరీంనగర్‌ కళాశాలలో ప్రిన్సిపల్‌ లేకపోగా, ఉన్న ముగ్గురు అధ్యాపకుల్లో ఒకరు జగిత్యాల డీఈవోగా వ్యవహరిస్తున్నారు. ఆదిలాబాద్‌ కళాశాలలో ప్రిన్సిపల్‌ లేకపోగా ఇద్దరు అధ్యాపకులు ఉన్నారు.

వీరిలో ఒకరు నిర్మల్‌ డీఈవోగా ఉన్నారు. ఖమ్మం కళాశాలలో ఇద్దరు అధ్యాపకులు ఉండగా, ఒకరు భద్రాద్రి కొత్తగూడెం డీఈవోగా వ్యవహరిస్తున్నారు. మహబూబ్‌నగర్‌ కళాశాలలో నలుగురు అధ్యాపకులు ఉండగా, అందులో ముగ్గురు వనపర్తి, గద్వాల, నారాయణపేట జిల్లాలకు డీఈవోలుగా వ్యవహరిస్తున్నారు. దీంతో ఆయా కళాశాలల్లో గెస్ట్‌ ఫ్యాకల్టీలు, రిటైర్డ్‌ లెక్చరర్లతో పాఠాలు బోధిస్తున్నప్పటికీ.. అంతంతమాత్రమేనని విమర్శలు ఉన్నాయి. నిజామాబాద్‌ కళాశాలలో పూర్వ విద్యార్థులతో తరగతులు చెప్పిస్తున్నారు
చదవండి: అమృతోత్సాహం.. 76వ స్వాతంత్య్ర దినోత్సవాలకు దేశం సిద్ధం 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top