కరెంట్‌....‘కట్‌’కట! | Sakshi
Sakshi News home page

కరెంట్‌....‘కట్‌’కట!

Published Thu, Jul 26 2018 9:25 AM

Power Employees Strike In Hyderabad Mint Compound - Sakshi

సాక్షి, సిటీబ్యూరో: విద్యుత్‌ శాఖలోని ఆర్టిజన్‌ కార్మికుల సమ్మె కారణంగా వినియోగదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. విద్యుత్‌ బిల్లుల వసూళ్లు, మరమ్మతులు, సాంకేతిక సహకారం తదితర విభాగాలపైనా సమ్మె ప్రభావం తీవ్రంగా ఉంది. సంస్థ నెలవారీ ఆదాయం భారీగా పడిపోయే అవకాశాలు కన్పిస్తున్నాయి. ఆర్జిజన్‌ సహా ఫీస్‌రేట్‌ కార్మికులంతా సమ్మెకు దిగడంతో ఎక్కడి బిల్లులు అక్కడే నిలిచిపోయాయి. చిరుజల్లులకు ఫీడర్లలో పలు సాంకేతిక లోపాలు తలెత్తుతుండటంతో విద్యుత్‌ సరఫరా నిలిచిపోతోంది. మరమ్మతు పనులు నిర్వహించే కార్మికులంతా సమ్మె చేస్తుండటంతో విద్యుత్‌ సరఫరా పునరుద్ధరణలో తీవ్ర జాప్యం జరుగుతోంది. ఫలితంగా ఆయా కాలనీలన్నీ అంధకారంలో మగ్గాల్సి వస్తోంది. 24 గంటల విద్యుత్‌ సరఫరా తర్వాత చాలా మంది ఇంట్లో ఇన్వర్టర్లను వినియోగించడం మానేశారు. జనరేటర్లలో డీజిల్‌ కూడా లేకపోవడం, లాంతర్లు మూలనపడేశారు. అసలే దోమలు..ఆపై ఉక్కపోతకు తోడు ఇంట్లో ఫ్యాన్లు కూడా తిరగకపోవడంతో కంటిమీద కునుకులేకుండా పోతోంది. ఈ సమయంలో రెగ్యులర్‌ డీఈ, ఏఈ, లైన్‌మెన్‌లకు ఫోన్‌ చేసినా ఫలితం ఉండకపోవడంతో వినియోగదారులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు.

మరమ్మతు చేసేవారు లేక..సరఫరాకు బ్రేక్‌
మంగళవారం అర్థరాత్రి ఒంటిగంటకు అకస్మాత్తుగా సైదాబాద్‌ కాలనీలో విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. దీంతో రాత్రంతా కాలనీలో అంధకారం నెలకొంది. సంబంధిత అధికారులకు స్థానికులు ఫిర్యాదు చేసినా ఫలితం లేదు. చివరకు సుమారు 13 గంటల తర్వాత (బుధవారం మధ్యాహ్నం రెండు గంటలకు) కరెంట్‌ సరఫరాను పునరుద్ధరించారు. ఆస్మాన్‌ఘడ్‌ డివిజన్‌ అరుంధతికాలనీ సబ్‌స్టేషన్‌లోని కుమ్మరివాడి ఫీడర్‌లో మంగళవారం సాయంత్రం ఏబీ స్విచ్‌ ఫెయిలైంది. దీంతో ఆ ఫీడర్‌ పరిధిలోని కాలనీల్లో సుమారు రెండు గంటల పాటు విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. చార్మినార్‌ సర్కిల్‌ పరిధి ఫలక్‌నూమా సబ్‌స్టేషన్‌లోని ఛత్రినాక ఫీడర్‌లోని బ్రేకర్‌లో మంగళవారం సాయంత్రం సాంకేతిక లోపం తలెత్తింది. ఫలితంగా ఆ ఫీడర్‌ పరిధిలోని కాలనీలకు మూడు గంటల పాటు విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. కీసర సబ్‌స్టేషన్‌ పరిధి అంకిరెడ్డిపల్లి ఫీడర్‌ పరిధిలో ఇన్సులేటర్‌ ఫెయిలై..సుమారు మూడు గంటలపాటు సరఫరా నిలిచింది. అదే విధంగా సైనిక్‌పురి సర్కిల్‌ ఆర్జీకే ఫీడర్‌లోనూ ఇదే సమస్యతో సుమారు రెండు గంటలు కరెంట్‌ సరఫరా నిలిచిపోయింది. డీఎంఎల్, ఆలియాబాద్, కండ్ల కోయ తదితర ప్రాంతాల్లోనూ ఇదే సమస్య తలెత్తింది. అత్యవసర సమయంలో ఫ్యూజ్‌ ఆఫ్‌ కాల్‌ సెంటర్లకు ఫోన్‌ చేసినా ఫలితం ఉండటం లేదు. కాంట్రాక్ట్‌ కార్మికులంతా సమ్మె చేస్తుండటంతో రెగ్యులర్‌ కార్మికులపై భారం పడుతోంది.

విద్యుత్‌ బిల్లుల వసూళ్లపై తీవ్ర ప్రభావం
మరమ్మతులు, రెవిన్యూ వసూళ్లు, కొత్త కనెక్షన్ల జారీ, మీటర్ల బిగింపు వంటి పనుల్లో తీవ్రజాప్యం జరుగుతుండటంతో వినియోగదారులు అసహనం వ్య క్తం చేస్తున్నారు. గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో సుమారు 50 లక్షల విద్యుత్‌ కనెక్షన్లు ఉండగా, వీటి నుంచి నెలకు సగటున రూ.450 కోట్లకుపైగా బిల్లుల రూపంలో సంస్థకు చేరుతుంది. బిల్లు చెల్లింపు గడువు దాటిన తర్వాత వంద శాతం బిల్లింగ్‌ నమోదు కోసం లైన్‌మెన్‌ సహా కాంట్రాక్ట్‌ మీటర్‌ రీడింగ్‌ కార్మికులు వినియోగదారుల ఇంటికి వెళ్లి వారంతా సకాలంలో బిల్లు చెల్లించే విధంగా చూస్తారు. నెలాఖరులో ఈ కార్మికులంతా సమ్మెలోకి వెళ్లడంతో ఎక్కడి బిల్లులు అక్క డే నిలిచిపోయాయి. సోమవారం వరకు సంస్థ రెవిన్యూ రూ.200 కోట్లు కూడా దాటక పోవడం విశేషం. ఆన్‌లైన్, పేటీఎం చెల్లింపులకు అవకాశం ఉన్నా..ఆశించిన స్థాయిలో ఈ సేవలను వినియోగించకపోవడం కూడా మరోకారణం.

Advertisement
Advertisement