
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలోని ఖమ్మం జిల్లాలోని ఏడు మండలాలను ఒక్క కలంపోటుతో ఏపీలో విలీనం చేశారంటూ హైకోర్టులో వేసిన పిల్‌పై ఇరు పక్షాల వాద ప్రతివాదనలు ముగిశాయి. నియోజకవర్గాల పునర్విభజన చేయకుండా రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించడం చెల్లదని పేర్కొంటూ కాంగ్రెస్ నేత మర్రి శశిధర్‌రెడ్డి ఈ పిల్ వేశారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ టి.రాధాకృష్ణన్, న్యాయమూర్తి జస్టిస్.ఎస్.వి.భట్‌ల ధర్మాసనం బుధవారం ఈ పిల్‌ను మరోసారి విచారించింది.
ఇరుపక్షాల వాద ప్రతివాదనల అనంతరం తీర్పును తర్వాత ప్రకటిస్తామని తెలి పింది. పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు విన్పిస్తూ... ఒక నియోజకవర్గంలోని ఓటర్లను మరో నియోజకవర్గానికి బదిలీ చేసే అధికారం ఎన్నికల సంఘానికి లేదన్నారు. బయటనుంచి వచ్చిన ఒత్తిళ్లకు ఈసీ తలొగ్గిందని ఆరోపించారు. నియోజకవర్గాల పునర్విభజన చట్ట ప్రకారం చేయాలన్నా రు. దీనిపై ఈసీ తరఫు న్యాయవాది ప్రతివాదన చేస్తూ.. ఏపీ పునర్విభజన చట్టం కింద ఏడు మండలాల్ని ఏపీలోని నియోజకవర్గాల్లో కలిపామన్నారు. ఇలా చేయడం వల్ల రెండు రాష్ట్రాల్లోనూ నియోజకవర్గాల సంఖ్య యథాతథంగానే ఉన్నాయన్నారు.