ప్రజాభిప్రాయ సేకరణ వాయిదా వేయించండి

ప్రజాభిప్రాయ సేకరణ వాయిదా వేయించండి - Sakshi


కాళేశ్వరంపై కేంద్రాన్ని కోరిన మర్రి శశిధర్‌రెడ్డి



సాక్షి, న్యూఢిల్లీ: కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టిన ప్రజాభిప్రాయ సేకరణను వాయిదా వేసేలా చర్యలు తీసుకోవాలని కేంద్ర పర్యావరణ శాఖ కార్యదర్శి అజయ్‌నారాయణ్‌ ఝాను కాంగ్రెస్‌ నేత మర్రి శశిధర్‌రెడ్డి కోరారు. శుక్రవారం అజయ్‌నారాయణ్‌ను ఢిల్లీలో కలుసుకున్న శశిధర్‌రెడ్డి.. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి ప్రజాభిప్రాయ సేకరణలో ప్రభుత్వం ఎలాంటి విధివిధానాలను పాటించడం లేదని వివరించారు.



అనంతరం శశిధర్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ, ఈ ప్రాజెక్టు రాష్ట్ర ఆర్థిక, పర్యావరణ, సామాజిక అభివృద్ధిపై ప్రభావం చూపనున్న నేపథ్యంలో ప్రజాభిప్రాయ సేకరణను హైదరాబాద్‌లో కూడా నిర్వహించాల్సి ఉందని, అయితే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన 15 ప్రాంతాల జాబితాలో హైదరాబాద్‌ లేదని పేర్కొన్నారు. ప్రాజెక్టు ప్రభావానికి సంబంధించిన సమగ్ర నివేదికను ప్రజాభిప్రాయ సేకరణ జాబితాలో ఉన్న ఆయా ప్రాంతాల్లో ప్రజలకు అందుబాటులో ఉంచాలన్నారు.



అయితే రాష్ట్ర ప్రభుత్వం మాత్రం పూర్తి వివరాలు లేని ప్రభావ అంచనా నివేదికను అందుబాటులో ఉంచిందన్నారు. ఈ కారణాల వల్ల అభిప్రాయ సేకరణను వాయిదా వేయించి, ప్రభుత్వం పూర్తిగా నిబంధనలు పాటించేలా ఆదేశాలివ్వాలని కోరారు. కాగా, కాంగ్రెస్‌ పార్టీ అంతర్గత విషయాలు బహిరంగంగా మాట్లాడటం సబబుకాదని కోమటిరెడ్డి సోదరులను ఉద్దేశించి శశిధర్‌రెడ్డి అన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top