మీ పార్శిల్‌ ఏ దేశం దాటిందో.. ఇట్టే తెలుసుకోవచ్చు..

Postal Service, which has launched international service with online tracking

     ‘ఆన్‌లైన్‌ ట్రాకింగ్‌’తో అంతర్జాతీయ సర్వీసు ప్రారంభించిన తపాలా శాఖ

     12 దేశాలతో ఒప్పందం... సేవలు మొదలు

సాక్షి, హైదరాబాద్‌:  ఇతర దేశాలకు పార్శిళ్లు పంపేటప్పుడు ఎదురయ్యే సమస్యలను  అధిగమించేందుకు తపాలా శాఖ కొత్త విధానాన్ని ప్రారంభించింది. ‘ఇంటర్నేషనల్‌ ట్రాక్డ్‌ ప్యాకెట్‌ సర్వీసు’ పేరుతో ప్రారంభించిన ఈ సర్వీసు ద్వారా విదేశాలకు తాము పంపిన పార్శిల్‌ ఎక్కడుందో ఆన్‌లైన్‌లో తెలుసుకోవచ్చు. దాన్ని ట్రాక్‌ చేసే వెసులుబాటుతో పాటు, పార్శిల్‌ గల్లంతైనా, అందులోని వస్తువులు పాడైనా నష్టపరిహారం ఇచ్చే వెసులుబాటు కల్పించారు. తొలుత 12 దేశాలకు ఇది అందుబాటులో ఉంటుంది. ఏషియన్‌ పసిఫిక్‌ రీజియన్‌లోని దేశాలతో తపాలా శాఖ ఒప్పందం కుదుర్చుకుంటోంది. 12 దేశాలతో అవగాహన కుదరటంతో ఆయా దేశాలకు ఈ సేవలను ప్రారంభించారు.

రెండు కిలోల వరకే పరిమితం
విదేశాలకు పార్శిళ్లు పంపటం ఖరీదైన వ్యవహారం. దీన్ని చవకగా అందించేందుకు తపాలా శాఖ ముందుకొచ్చింది. తొలి వంద గ్రాముల బరువుకు ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లకైతే రూ.330, ఇతర దేశాలకు రూ.310గా రుసుమును నిర్ధారించింది. ఈ బరువు పెరిగే కొద్దీ రుసుము పెరుగుతుంది. ప్రస్తుతానికి 2 కిలోల బరువు వరకు మాత్రమే పార్శిళ్లు అనుమతిస్తారు. అంతకంటే ఎక్కువ బరువైనవైతే ఈ కొత్త విధానం కాకుండా మామూలు విధానంతో పంపుతారు. మార్గ మధ్యంలో పార్శిల్‌ గల్లంతైనా, అందులోని వస్తువులు డామేజ్‌ అయినా ఆ మేరకు నష్టపరిహారం కూడా అందజేస్తామని తపాలాశాఖ అధికారులు భరోసా ఇస్తున్నారు. అయితే ఇందులో మండే స్వభావం ఉన్నవి, ప్రాణం ఉన్నవి అనుమతించరు. సాధారణంగా విమానాల్లో వస్తువుల తరలింపుపై ఉండే నిబంధనలు దీనికి వర్తిస్తాయన్నారు. ‘ప్రైవేటు సంస్థలు తమకంటే పది రెట్లు ఎక్కువ రుసుము వసూలు చేస్తున్నాయి. చాలా తక్కువ వ్యయంతో పార్శిల్‌ ఎక్కడుందో సులభంగా ట్రాక్‌ చేసుకునే వెసులుబాటుతో కొత్త సేవలు ప్రారంభించాం. ప్రజలు దీనిని ఆదరిస్తే ఇది తమకు లాభాలు తెచ్చిపెడుతుందన్న నమ్మకంతో ఉన్నాం’ అని తపాలా శాఖ ఉన్నతాధికారి ఒకరు సాక్షితో చెప్పారు. తపాలా వారోత్సవాల్లో భాగంగా ఈ కొత్త సేవను ప్రారంభించారు. త్వరలో మరిన్ని దేశాలకు దీన్ని విస్తరించనున్నారు. 

స్పీడ్‌ పోస్ట్‌ తరహాలోనే..
దేశీయంగా పోస్టాఫీసుల్లో స్పీడ్‌ పోస్టు సర్వీసు ఉంది. సంబంధిత పార్శిల్‌ను తపాలా కార్యాలయంలో అందించగానే దానికి నిర్ధారిత రుసుము తీసుకున్న తర్వాత సిబ్బంది దానికి బార్‌కోడ్‌ కేటాయిస్తారు. ఆ నంబరు ఆధారంగా ఆన్‌లైన్‌లో మనం పార్శిల్‌ ఎక్కడి వరకు చేరుకుందో ట్రాక్‌ చేసుకోవచ్చు. ఇప్పుడు అదే విధానాన్ని ఇంటర్నేషనల్‌ పార్శిళ్లకు కూడా వర్తింపజేస్తున్నారు. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, మలేసియా, ఫిలిప్పీన్స్, వియత్నాం, దక్షిణ కొరియా, జపాన్, సింగపూర్, హాంకాంగ్, థాయిలాండ్, కంబోడియాలతో తపాలా శాఖ ఒప్పందం చేసుకుని ఆయా దేశాలకు సర్వీసు ప్రారంభించింది. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top