వెన్ను తడితే.. బంగారు భవితే! | Sakshi
Sakshi News home page

Published Wed, May 30 2018 10:31 AM

Poor Family Students Seeking Help For Higher Education At Hyderabad - Sakshi

ప్రతిభకు పేదరికం అడ్డుకాలేదు. పుట్టెడు పేదరికాన్ని జయించి టెన్త్‌లో ఉత్తమ విజేతలుగా నిలిచారు. రెక్కలు ముక్కలు చేసుకుని బతుకీడ్చే కుటుంబాల్లో పుట్టిన ఈ చిన్నారులు ఎన్నో కష్టాలు చుట్టుముట్టినా ఏమాత్రం వెరవకుండా ఆత్మస్థైర్యంతో ముందుకెళ్తున్నారు. ఒకవైపు అడ్డా కూలీలు, ఆటో డ్రైవర్లు, సెక్యురిటీ గార్డులుగా బతుకుబండి నెట్టుకొస్తున్న తల్లిదండ్రులకు పనిలో ఆసరా అవుతూనే.. మరోవైపు చదువులోనూ రాణిస్తున్నారు. సర్కారు బడులను కార్పొరేట్‌ స్కూళ్లకు దీటుగా నిలిపారు. ఉత్తమ ప్రతిభ చూపిన పేదింటి పిల్లలు భవిష్యత్తులో మరిన్ని విజ యాలు సాధించాలంటే వీరి తల్లిదండ్రుల శ్రమ ఒక్కటే సరిపోదు. సమాజం కూడా అండగా నిలవాలి. వారి చదువులకు తమవంతు తోడ్పాటును అందించినప్పుడే మరిన్ని అద్భుతాలు సృష్టిస్తారు. మానవతావాదులు ముందుకొచ్చి ఆర్థిక సాయం అందించి, వారి వెన్ను తట్టినప్పుడే ఇది సాధ్యం.  – సాక్షి, సిటీబ్యూరో 

సెక్యురిటీ గార్డ్‌ కుమారుడు టాపర్‌.. 


తల్లితో నీలకంఠం 

శేరిలింగంపల్లి: పాపిరెడ్డి కాలనీలోని రాజీవ్‌ గృహకల్పకు చెందిన శివన్న నాయుడు (సెక్యూరిటీ గార్డ్‌), దమయంతి దంపతుల కుమారుడు నీలకంఠం 9.2 సాధించి శేరిలింగంపల్లి హైస్కూల్‌ టాపర్‌ టాపర్‌గా నిలిచాడు. తాను భవిష్యత్తులో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ అవుతానని నీలకంఠం చెబుతున్నాడు. ఇప్పటికే పాలిటెక్నిక్‌లో సీటు వచ్చిందని, దాతలు ప్రోత్సహిస్తే మరింత ముందుకు సాగుతానంటున్నాడు.  
దాతలు.. 9573398513 ఫోన్‌ నెంబర్‌లో సంప్రదించవచ్చు.

పుట్టెడు దుఃఖంలోనూ..   


తండ్రి రాములుతో రష్మిత 

ఎల్‌బీనగర్‌: తండ్రి ప్రైవేటు ఉద్యోగి. మంచాన పడిన తల్లి. వీరి కూతురు రష్మిత పట్టుదలతో కష్టపడి 10వ తరగతిలో 9.8 జీపీఏ సాధించింది. తల్లి సుజాత మరణించిన 15 రోజులకే 10వ తరగతి పరీక్షలు ప్రారంభం కావడంతో ఓ వైపు తల్లి లేని బాధ, మరోవైపు పరీక్షలు. అయినా మొక్కవోని దీక్షతో పరీక్ష రాసింది. 9.8 జీపీఏ సాధించింది. తండ్రి రాములు ఆటోనగర్‌లోని ఓ ప్రైవేట్‌ ఫర్టిలైజర్‌ షాపులో చాలీచాలని జీతంతో బతుకుబండి లాగుతున్నాడు. వనస్థలిపురంలో నివాసముంటున్న వీరి ఆర్థిక పరిస్థితి అత్యంత దయనీయంగా ఉంది. ఎవరైనా దాతలు ముందుకొచ్చి ఆదుకుంటే పైచదువులు చదువుతానని రష్మిత చెబుతోంది.  
దాతలు సంప్రదించాల్సిన ఫోన్‌ నెంబర్‌: 94410 66370

విజయ ప్రసాదం..


తల్లిదండ్రులతో పూర్ణకంటి ప్రసాద్‌

ఆల్విన్‌కాలనీ: జగద్గిరిగుట్ట రిక్షాపుల్లర్స్‌ కాలనీ జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో పూర్ణకంటి ప్రసాద్‌ పదో తరగతి ఫలితాల్లో 9.5 జీపీఏ గ్రేడింగ్‌ సాధించాడు. బాలరామ్, కురువమ్మ దంపతుల కుమారుడు ప్రసాద్‌ పేదరికంలోనూ పదో తరగతి ఫలితాల్లో గ్రేడింగ్‌లో విజయం సాధించాడు. తండ్రి బాలరామ్‌ కార్పెంటర్‌గా జీవనం కొనసాగిస్తుంటాడు. ఉన్నత చదువులు చదివి ఇంజనీరింగ్‌లో రాణించాలని ప్రసాద్‌ లక్ష్యంగా ఎంచుకున్నాడు. దాతలు ఎవరైనా ఆదుకొంటే ఉన్నతవిద్య చదువుతానని ప్రసాద్‌ చెబుతున్నాడు.  
దాతలు సంప్రదించాల్సిన ఫోన్‌: 96528 70380 

రాళ్లు కొట్టే ఇంట రతనాల బిడ్డ  


తల్లిదండ్రులతో షేక్‌ సకినాబీ 

ఘట్‌కేసర్‌టౌన్‌: ఘట్‌కేసర్‌ జెడ్పీ బాలికల పాఠశాలలో చదివిన షేక్‌ సకినాబీ 2017– 2018 విద్యా సంవత్సరంలో ఎస్సెస్సీలో మండల టాపర్‌గా నిలిచింది. షేక్‌ సకీనాబీ తల్లితండ్రులు షేక్‌ ఇమాం, లాల్‌బీ రాళ్లు కొట్టుకుని జీవించే కుటుంబం. తమ కూతురు 9.5 పాయింట్లతో మండల టాపర్‌గా రావడంతో ఆనందం వ్యక్తంచేస్తున్నారు. రెక్కాడితే కానీ డొక్కాడని ఈ పేదలు తమ కూతురిని పై చదువులు ఎలా చదివించాలో అర్థం కావడం లేదు. దాతలు  ముందుకొచ్చి చేయూతనిస్తే ఉన్నత చదువులు చదువుతానని విద్యార్థిని షేక్‌ సకినాబీ చెబుతోంది.  
దాతలు సంప్రదించాల్సిన ఫోన్‌ నెంబర్‌ 90101 55941 

ప్లంబర్‌ కూతురు బంపర్‌..  


తల్లిదండ్రులతో అఫ్రీన్‌ 
శేరిలింగంపల్లి: శేరిలింగంపల్లిలోని నెహ్రూనగర్‌ బస్తీలో నివాసం ఉండే ఎస్‌డీ సలీమ్‌ (ప్లంబర్‌), రజియా దంపతుల పెద్ద కుమార్తె అఫ్రీన్‌. టెన్త్‌లో 9.2 సాధించి టాపర్‌గా నిలిచింది. సలీమ్‌ ప్లంబర్‌గా పనిచేస్తూ ఇద్దరు పిల్లలను స్థానికంగా ఉన్న శేరిలింగంపల్లి హైస్కూల్‌లో చదివిస్తున్నాడు. ప్రైవేట్‌ స్కూల్స్‌ ఫీజులు చెల్లించే స్థోమత లేక గవర్నమెంట్‌ స్కూల్‌ చేర్పించినట్లు తెలిపారు. బైపీసీ పూర్తి చేసి డాక్టర్‌ను కావాలని ఉన్నా ఆర్థి«క పరిస్థితుల దృష్ట్యా సాధ్యం కాదని ఎంఈసీ చేయాలనుకుంటున్నానని అఫ్రీన్‌ చెబుతోంది.  
దాతలు సంప్రదించాల్సిన ఫోన్‌ నంబర్‌: 99122 55986

ఈ రాజేశ్వరి.. విజయేశ్వరి.. 


రాజేశ్వరి

సుభాష్‌నగర్‌: సూరారం జిల్లా పరిషత్‌ పాఠశాలలో టి.రాజేశ్వరి 9.7 జీపీఏ సాధించి ప్రభుత్వ పాఠశాలల్లో మండలంలోనే మొదటి స్థానంలో నిలిచింది. సూరారం పారిశ్రామికవాడలో నివాసం ఉంటున్న రాజేశ్వరి తండ్రి విన్నారావు ఓ పరిశ్రమలో వాచ్‌మన్‌గా పని చేస్తున్నాడు. తల్లి భూలక్ష్మి రోజువారీ కూలి. భవిష్యత్తులో తనకు ప్రొఫెసర్‌ కావడమే లక్ష్యమని రాజేశ్వరి పేర్కొంటోంది. దాతలు తనను ఆదుకుకునేందుకు ముందుకు వస్తే రాణిస్తానని చెబుతోంది. 
ఆర్థిక సాయం అందించేవారు 
సంప్రదించాల్సిన ఫోన్‌: 95020 53302

పేదింట్లో పుట్టినా..  


వంశీకృష్ణ
 
వనస్థలిపురం: పేదింటిలో పుట్టినా.. ప్రభుత్వ పాఠశాలలో చదివినా.. ఆ విద్యార్థి పట్టుదలతో ఎస్సెస్సీలో ఉత్తమ ప్రతిభ కనబరిచాడు. 9.7 గ్రేడ్‌తో ప్రథమ స్థానంలో నిలిచాడు ఎల్‌బీనగర్‌ ఎన్‌టీఆర్‌నగర్‌కు చెందిన పబ్బ రాంమోహన్, సంధ్యారాణిల కుమారుడు వంశీకృష్ణ. వనస్థలిపురంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చదివిన వంశీ మొదటి స్థానంలో నిలిచాడు. తండ్రి రాంమోహన్‌ బిగ్‌బజార్‌ గోదాములో వర్కర్‌గా పనిచేస్తుండగా తల్లి గృహిణి. వీరి ఆర్థిక స్థోమత అంతంత మాత్రం కావడంతో వంశీకృష్ణ విద్యాభ్యాసానికి దాతలు సహకరించాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. 
దాతలు సంప్రదించాల్సిన ఫోన్‌: 95423 01731

Advertisement
 

తప్పక చదవండి

Advertisement