విస్తరిస్తున్న విషం..! | Polluted underground waters | Sakshi
Sakshi News home page

విస్తరిస్తున్న విషం..!

Oct 9 2017 1:45 AM | Updated on Oct 5 2018 8:48 PM

Polluted underground waters - Sakshi

దేశంలో సగానికన్నా ఎక్కువ భూభాగంలో భూగర్భ జలాలు విషతుల్యమయ్యాయి. దేశంలోని మొత్తం 676 జిల్లాల్లో 21 రాష్ట్రాల పరిధిలోని 387 జిల్లాల్లో భూగర్భ జలాల కలుషితం కనిపిస్తోంది. ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌తో పాటు బీహార్, ఉత్తరప్రదేశ్, తమిళనాడు, పశ్చిమ బెంగాల్‌ తదితర 15 రాష్ట్రాల్లోని 113 జిల్లాల్లోని భూగర్భ జలాల్లో మోతాదుకు మించి భారలోహాలు, సీసం, కాడ్మియం, క్రోమియం, ఫ్లోరైడ్, నైట్రేట్‌ ఉన్నాయి.. గత ఏడాది కేంద్ర భూగర్భ జలాల బోర్డు(సీజీడబ్ల్యూ) నివేదిక సారాంశమిదీ.

రాష్ట్రవ్యాప్తంగా భూగర్భ జలాలపై రాష్ట్ర భూగర్భ జలాల విభాగం జరిపిన పరిశీలనలోనూ దాదాపు సీజీడబ్ల్యూబీ నివేదికను బలపరిచే విషయాలే వెల్లడయ్యాయి. రాష్ట్రంలో ఇప్పటి వరకూ మనకు తెలిసిన నల్లగొండ జిల్లాలోనే కాక ఇతర జిల్లాల్లోనూ ఫ్లోరైడ్‌ భూతం వేగంగా విస్తరిస్తున్నట్లు భూగర్భ జల విభాగం అధ్యయనంలో తేలింది. ముఖ్యంగా జనగాం, వరంగల్‌ రూరల్, నిర్మల్, రంగారెడ్డి జిల్లాల్లో సేకరించిన నీటి నమూనాల్లో అంచనాకు మించి ఫ్లోరైడ్‌ శాతాలు నమోదైనట్లుగా తేల్చింది. వీటితో పాటే నైట్రేట్, సల్ఫేట్‌ సైతం పరిమాణానికి మించి ఉన్నట్లుగా వెల్లడైంది.     – సాక్షి, హైదరాబాద్‌


నల్లగొండ తర్వాత ఆసిఫాబాద్‌..
భూగర్భ జల విభాగం ఏటా వర్షాలకు ముందు ఒకమారు, వర్షాల అనంతరం మరోమారు రాష్ట్రంలోని భూగర్భ జల పరిస్థితులపై అధ్యయనం చేస్తుంది. ఈ ఏడాది వర్షాలకు ముందున్న పరిస్థితులపై రాష్ట్రవ్యాప్తంగా 2,670 నీటి నమూనాలను సేకరించి పరిశోధన జరిపింది. వీటిలో నైట్రేట్స్‌ అధికంగా ఉన్న శాంపిల్స్‌ 1,494 వరకు ఉండగా, ఫ్లోరైడ్‌ అధికంగా ఉన్న శాంపిల్స్‌ ఏకంగా 567 వరకు ఉన్నట్లు వెల్లడైంది.

వాస్తవానికి నీటిలో 1 నుంచి 1.5 మిల్లీగ్రామ్‌/లీటర్‌ వరకు ఫ్లోరైడ్‌ ఉండాలి. అంతకుమించితే ప్రమాదమే. ప్రస్తుతం పరిశీలించిన శాంపిల్స్‌లో నల్లగొండలో అధికంగా 7.83 మిల్లీగ్రామ్‌/లీటర్‌ ఉండగా, ఆసిఫాబాద్‌ జిల్లా బెజ్జూర్‌లో 5.98 మిల్లీగ్రామ్‌/లీటర్‌గా ఉన్నట్లు తేలింది. జిల్లాల వారీగా చూస్తే నల్లగొండ తర్వాత జనగాం, వరంగల్‌ రూరల్, రంగారెడ్డి, సిద్ధిపేట, నిర్మల్‌లో సేకరించిన నమూనాల్లో అధికంగా ఫ్లోరైడ్‌ శాతం ఉన్నట్లు తేలింది.

గత వేసవిలో భూగర్భ జలాలు అడుగంటడం.. జలాశయాల్లో తగినంత నీరు లేక సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడటం, ప్రజలు చేతిబోర్ల వైపు మళ్లడంతో ఫ్లోరైడ్‌ శాతం అధికంగా కనిపించినట్లు అధికారులు చెబుతున్నారు.


నైట్రేట్‌ ఎక్కువే..
సేకరించిన నీటి నమూనాల్లో ఫ్లోరైడ్‌తో పాటు అధికంగా నైట్రేట్‌లు ఉన్నట్లు భూగర్భ జల విభాగం తేల్చింది. మొత్తం 2,670 నమూనాల్లో 1,494 నమూనాల్లో నైట్రేట్‌లు అధికంగా ఉన్నాయని గుర్తించింది. వాస్తవానికి నీటిలో నైట్రేట్‌ శాతం 10.16 మిల్లీగ్రామ్‌/లీటర్‌కు మించరాదు. కానీ సూర్యాపేట జిల్లాలో ఏకంగా 445 మిల్లీగ్రామ్‌/లీటర్‌ ఉన్నట్లు గుర్తించారు.

నల్లగొండ, సిద్ధిపేట జిల్లాల్లోనూ ఇదే రీతిన ఫలితాలు వచ్చి నట్లు అధికారులు పేర్కొంటున్నారు. నైట్రేట్‌లు అధికంగా ఉన్న నీటితో రక్త కణాల్లోకి ఆక్సిజన్‌ సరఫరాకు ఆటంకం కలుగుతుందని, దీనిని బ్లూ–బేబీ సిండ్రోమ్‌గా పేర్కొంటారని తెలిపారు. శుద్ధమైన జలాలు తీసుకోవడం, తక్కువ ఎరువుల వాడకం ద్వారా నైట్రేట్‌ను నియంత్రించవచ్చని వెల్లడించారు.


సల్ఫేట్‌ అధికంగా ఉన్న మండలాలు(%)
జిల్లా    మండలం    సల్ఫేట్‌ శాతం (మిల్లీగ్రామ్‌/లీటర్‌)
గద్వాల్‌    మనోపాడ్‌            1,770
గద్వాల్‌    ఇటిక్యాల్‌             1,100
నల్లగొండ    నిడమనూర్‌          620
యాదాద్రి    వలిగొండ             586
నల్లగొండ    అనుముల           542


నైట్రేట్‌ అధికంగా ఉన్న మండలాలు(%)
జిల్లా    మండలం    నెట్రేట్‌శాతం (మిల్లీగ్రామ్‌/లీటర్‌)
సూర్యాపేట    గరిడేపల్లి            445
నల్లగొండ      నిడమనూర్‌        347.5
సూర్యాపేట    హుజూర్‌నగర్‌      283
సిద్ధిపేట        వర్గల్‌               246
సూర్యాపేట    నేరేడుచర్ల          235

2,670  రాష్ట్రవ్యాప్తంగా సేకరించిన నమూనాలు
127  విద్యుత్‌ వాహకత ఎక్కువ ఉన్న నమూనాలు
567 ఫ్లోరైడ్‌ ఎక్కువగా ఉన్నట్టు తేలిన శాంపిల్స్‌
1,494 నైట్రేట్‌ ఎక్కువగా ఉన్నట్టు తేలిన శాంపిల్స్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement