అత్యధికం నర్సంపేట.. అత్యల్పం యాకుత్‌పురా:ఈసీ

The Polling Is Peaceful Said By Telangana EC Rajath Kumar  - Sakshi

హైదరాబాద్‌: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ ముగిసిన అనంతరం రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ రజత్‌ కుమార్‌ విలేకరులతో మాట్లాడుతూ.. ఈ సారి ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయని తెలిపారు. కొన్ని చోట్ల చెదురుమదురు ఘటనలు మినహా పోలింగ్‌ ప్రశాంతంగా ముగిసిందని వెల్లడించారు. ఎన్నికలకు సంబంధించి న్యూస్‌ కవరేజీ చేసినందుకు, ప్రశాంతంగా జరగడానికి దోహదపడినందుకు మీడియాకు కృతజ్ఞతలు తెలిపారు. 2014లో తెలంగాణాలో 69.5 శాతం ఓటింగ్‌ నమోదైందని, కానీ సాయంత్ర 5 గంటల వరకు అందిన రిపోర్టు ప్రకారం ఈ సారి 67 శాతం ఓటింగ్‌ జరిగినట్లు వివరించారు. మరో రెండు మూడు శాతం  పోలింగ్‌ ముగిసేనాటికి పెరగవచ్చునని వ్యాఖ్యానించారు.

అన్ని పోలింగ్‌ స్టేషన్లలో దాదాపుగా ఉదయం ఏడున్నర గంటలకు పోలింగ్‌ ప్రారంభమైందని తెలిపారు.  కొన్ని చోట్ల ఈవీఎం, వీవీపాట్‌లు మొరాయించాయని వాటి స్థానంలో వేరే వాటిని మార్చామని తెలిపారు. 754 బ్యాలెట్‌ యూనిట్లు, 628 కంట్రోల్‌ యూనిట్లు, 1444 వీవీపాట్‌లు పోలింగ్‌ జరుగుతుండగా మార్చినట్లు వివరించారు. ఎన్నికల అధికారులు తమ విధులను సక్రమంగా నిర్వర్తించారని కొనియాడారు.  లెటర్‌, ఈ-మెయిల్స్‌, పర్సనల్‌గా 1042 ఫిర్యాదులు అందాయని, అలాగే నేషనల్‌ గ్రీవెన్స్‌ ద్వారా 3250 ఫిర్యాదులు వచ్చాయని వెల్లడించారు. వీటిలో 3650 ఫిర్యాదులు అప్పటికప్పుడు పరిష్కరించామని, మరో 642 ఫిర్యాదులు పెండింగ్‌లో ఉన్నాయని చెప్పారు.

  గత ఎన్నికల్లో రూ.76 కోట్ల నగదును సీజ్‌ చేయగా ఈసారి 117 కోట్ల నగదు సీజ్‌ చేశారు. 2014లో 2.8 లక్షల లీటర్ల మద్యం సీజ్‌ చేయగా 2018లో 5.5 లక్షల లీటర్ల మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈసారి గుడుంబా సమస్య లేదని పూర్తిగా సమసిపోయిందని వివరించారు. పట్టుబడిన లిక్కర్‌ విలువ రూ.11.6 కోట్లు కాగా మరో రూ 9.6 కోట్లు బంగారం, వెండి, బహుమతుల రూపంలో స్వాధీనం చేసుకున్నారు. మొత్తంగా రూ.138 కోట్ల విలువైన నగదును సీజ్‌ చేసినట్లు రజత్‌ కుమార్‌ వెల్లడించారు. పోలీసులు కూడా లా అండ్‌ ఆర్డర్‌ చక్కగా మేనేజ్‌ చేశారని కితాబిచ్చారు.

ఓటరు లిస్టులో పేరు లేని వారు క్షమించండి
ఓటరు లిస్టులో పేరు లేని వారు క్షమించాలని ,  మరోసారి పొరపాటు జరగకుండా చూసుకుంటామని చెప్పారు. 3 లక్షల చనిపోయిన ఓటర్లు, 2 లక్షల డూప్లికేట్‌ ఓట్లు తొలగించామని, అలాగే 25 లక్షల కొత్త ఓటర్లకు ఓటు హక్కు కల్పించామని వెల్లడించారు. బోగస్‌ ఓట్ల గురించి రాజకీయ పార్టీలు ఫిర్యాదు చేశాయి..ఒకసారి మాక్‌ ఓటర్‌ జాబితా వస్తే దాన్ని మార్చలేమని చెప్పారు. ఓట్లు తొలగించిన వారికి మళ్లీ దరఖాస్తు చేసుకుంటే వచ్చాయని తెలిపారు. దరఖాస్తు చేయని వారికి రాలేదన్నారు. అత్యధికంగా నర్సంపేటలో 84 శాతం, ఆలేరు 83.02 శాతం పోలింగ్‌ నమోదు అయిందని, అత్యల్పంగా యాకుత్‌పురాలో 33 శాతం పోలింగ్‌ నమోదైందని రజత్‌ కుమార్‌ అన్నారు. ఆదిలాబాద్‌లో 76.5 శాతం, వరంగల్‌ రూరల్‌ జిల్లాలో 76 శాతం, హైదరాబాద్‌ జిల్లా 50 శాతం పోలింగ్‌ జరిగిందని వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడా కూడా రీపోలింగ్‌ కోసం అభ్యర్థనలు రాలేదన్నారు. 119 నియోజకవర్గాల్లో కౌంటింగ్‌ సెంటర్లు కూడా ఏర్పాటు చేశామని తెలిపారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top