
రాజకీయ విధానంపై కీలక భేటీ
రాబోయే రోజుల్లో జాతీయ, రాష్ట్రస్థాయిల్లో అనుసరించాల్సిన రాజకీయవిధానంపై చర్చించేందుకు ఉద్దేశించిన సీపీఎం కేంద్ర కమిటీ కీలక సమావేశాలు...
- 19 నుంచి 21 వరకు సీపీఎం సమావేశాలు
సాక్షి,హైదరాబాద్: రాబోయే రోజుల్లో జాతీయ, రాష్ట్రస్థాయిల్లో అనుసరించాల్సిన రాజకీయవిధానంపై చర్చించేందుకు ఉద్దేశించిన సీపీఎం కేంద్ర కమిటీ కీలక సమావేశాలు ఈ నెల 19-21 తేదీల మధ్య హైదరాబాద్ ప్రగతినగర్‌లో జరగనున్నాయి. ప్రస్తుత ప్రకాశ్‌కారత్ స్థానంలో కొత్త జాతీయ ప్రధానకార్యదర్శి ఎంపికకు సంబంధించిన ప్రాథమిక కసరత్తు కూడా ఇక్కడే జరగవచ్చునని తెలుస్తోంది. ఏప్రిల్ 14-19 తేదీల మధ్య విశాఖలో జరగనున్న జాతీయమహాసభలకు పూర్వరంగంగా ఈ భేటీ జరగనుంది.
గత పాతికేళ్ల కాలంలో పార్టీ అనుసరించిన రాజకీయవిధానాల కారణంగా బూర్జువా పార్టీలతో పొత్తులు బాగా నష్టపరిచాయనే అభిప్రాయాన్ని పార్టీలోని ఒకవర్గం గట్టిగా వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో భవిష్యత్‌లో ఆ పార్టీలతో ఎలాంటి పొత్తులు, అవగాహనలు కుదుర్చుకోవద్దనే స్పష్టమైన నిర్ణయాన్ని పార్టీ ఇక్కడ ప్రకటించనుంది. పార్టీగా సీపీఎంతో పాటు ఇతర వామపక్షాలకు ఎదురవుతున్న సవాళ్లు, సమస్యలు వాటిని ఏ విధంగా అధిగమించాలనే దానిపై కూడా చర్చ జరగనుంది.
వామపక్షాల మధ్య ఐక్యతను సాధించి, విస్తృతస్థాయిలో దానిని ముందుకు తీసుకుపోవాలనే ఆలోచనకు తుది రూపాన్ని ఇవ్వనుంది. గత మూడేళ్లలో జాతీయస్థాయిలో పార్టీ అనుసరించిన విధానాల వల్ల జరిగిన నష్టం, వైఫల్యాలు కూడా ప్రధానంగా చర్చకు రానున్నాయి. ఈ కాలంలో అన్ని రాష్ట్రాల్లోని కమిటీలు ఏ విధంగా పనిచేశాయి,ఎక్కడెక్కడ పార్టీ వైఫల్యం చెందింది, వెనుకబడింది అన్న దానిని కూడా సమీక్షించనున్నారు.
రాజకీయవిధానం ఖరారులో ప్రధానంగా రాజకీయ తీర్మానం, రాజకీయ, సంస్థాగత నివేదిక, వివిధ ప్రజాసమస్యలపై పార్టీ తీసుకున్న వైఖరిపై చర్చించనున్నారు. భవిష్యత్‌లో ఏ పార్టీతో ఎలా వ్యవహరించాలి, గతంలో బీజేపీని, కాంగ్రెస్‌ను ఓడించండంటూ చేసిన తీర్మానాల వల్ల పార్టీపై పడిన ప్రభావాలను గురించి చర్చించనున్నారు.