నాడు గెలిపించమని.. నేడు ఓడించమని..! | Political Parties Curious Regarding Stategies For Municipal Elections | Sakshi
Sakshi News home page

నాడు గెలిపించమని.. నేడు ఓడించమని..!

Jan 12 2020 10:14 AM | Updated on Jan 12 2020 11:47 AM

Political Parties Curious Regarding Stategies For Municipal Elections  - Sakshi

సాక్షి, కోదాడ : కోదాడ మున్సిపాలిటీకి రెండోసారి జరుగుతున్న ఎన్నికల్లో విచిత్రమైన పరిస్థితిని నాయకులు, పోటీ దారులు ఎదుర్కొంటున్నారు. గత ఎన్నికల్లో ఎవరినైతే గెలిపించాలని గట్టిగా ప్రయత్నించారో వారిని ఈ ఎన్నికల్లో ఓడించాలని, అదే విధంగా గతంలో ఎవరినైతే ఓడించాలని ప్రచారం చేశారో వారిని అధిక మెజార్టీతో ఈ సారి గెలిపించాలని ప్రచారం చే యాల్సిన పరిస్థితి నేతలకు వచ్చింది.

నాడు అధికార టీఆర్‌ఎస్‌ పార్టీ తరపున 30 మంది అభ్యర్థులను నిలబెట్టేందుకు నాటి టీఆర్‌ఎస్‌ ఇన్‌చార్జి శశిధర్‌రెడ్డి నానాతిప్పలు పడ్డారు. ఇపుడు అదే పార్టీలో ప్రతివార్డుకు 10 మంది పోటీ పడుతుండడంతో ఎవరికి టికెట్‌ ఇవ్వాలో తేల్చుకోవడానికి టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే బొల్లం మల్ల య్య తిప్పలు పడుతున్నారు. నాడు కష్టకాలంలో టీఆర్‌ఎస్‌ తరపున పోటీ చేసిన వారు కంటికి కనిపించకుండా పోగా.. ఇతర పార్టీల నుంచి వలసవచ్చిన నేతలతో టీఆర్‌ఎస్‌ కిక్కిరిసిపోయింది.

ముఖాముఖి పోటీ..
2014 ఎన్నికల్లో కోదాడలో కాంగ్రెస్, టీడీపీ ముఖాముఖి తలపడ్డాయి. టీఆర్‌ఎస్‌ నామమాత్రంగా ఉంది. చైర్మన్‌ అభ్యర్థి బీసీ మహిళకు రిజర్వ్‌ చేశారు. ఈ ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ, సీపీఎం ఒక కూటమిగా, కాంగ్రెస్, టీఆర్‌ఎస్‌లు ఒంటరిగా పోటీ చేశాయి. ఈ ఎన్నికలో కాంగ్రెస్‌ పార్టీ నుంచి వంటిపులి నాగలక్ష్మిని చైర్మన్‌గా ప్రకటించి బరిలోకి దిగారు. టీడీపీ నుంచి పారా సత్యవతిని చైర్మన్‌గా ప్రకటించి పోటీలో నిలిచింది.

కాంగ్రెస్‌ తరపున నాటి ఎమ్మెల్యే పద్మావతి, వంటిపులి గోపయ్య అన్నీ తామై నడిపించగా, టీడీపీ తరుపున మాజీ ఎ మ్మెల్యే  చందర్‌రావు, ప్రస్తుత ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్, పారా సీతయ్యలు ప్రచారం చేశారు. కాంగ్రెస్‌ – 14, టీడీపీ – 14, ఇండిపెండెంట్‌ – 1, వైఎస్సార్‌సీపీ – 1 గెలిచింది. ఈ ఎ న్నికల్లో ఇరు పార్టీల చైర్మన్‌ అభ్యర్థులు ఇద్దరు ఓటమిపాలయ్యారు. దీంతో నాటకీయ పరిణా మాల మధ్య కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి వంటిపులి అనిత చైర్మన్‌గా, తెప్పని శ్రీనివాస్‌ వైస్‌చైర్మన్‌గా ఎంపికయ్యారు.

అటువారు ఇటు.. ఇటు వారు అటు..
రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌ అధికారంలోకి రావడంతో కోదాడ పురపాలక సంఘంలో పలు మార్పులు చోటు చేసుకున్నాయి. కాంగ్రెస్‌ పార్టీ తరుపున చైర్మన్‌గా ఉన్న వంటిపులి అనిత కాంగ్రెస్‌ పార్టీ నుంచి ఐదుగురు కౌన్సిలర్లను తీసుకొని టీఆర్‌ఎస్‌లోకి వెళ్లింది. అదే సమయంలో టీడీపీ నుంచి గెలిచిన పారా సీతయ్య వర్గం కూడా టీఆర్‌ఎస్‌లో చేరింది. దీంతో ఎన్నికల సమయంలో ఒక్క కౌన్సిలర్‌ కూడా లేని టీఆర్‌ఎస్‌కు 21 మంది కౌన్సిలర్‌లు తయారయ్యారు.

ఆ తరువాత 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో పారా సీతయ్యవర్గం టీఆర్‌ఎస్‌ నుంచి  కాంగ్రెస్‌ పార్టీలో చేరింది. 2014 ఎన్నికల్లో కాంగ్రెస్‌ తరపున దాదాపు 10 మంది కౌన్సిలర్లు ప్రస్తుతం టీఆర్‌ఎస్‌ నుంచి మళ్లీ పోటీ చేయడానికి సిద్ధమ వుతున్నారు. వీరిని ఎలాగైనా ఓడించాలని కాంగ్రెస్‌ నాయకులు ప్రచారం చేస్తున్నారు. ఇక నాడు టీడీపీలో ఉన్న పార సీతయ్య గెలుపు కోసం పని చేసిన మాజీ ఎమ్మెల్యే చందర్‌రావు, ప్రస్తుత ఎమ్మెల్యే మల్లయ్యయాదవ్‌ కాంగ్రెస్‌లో ఉన్న సీతయ్యతో పాటు ఆయన వర్గాన్ని ఓడించడానికి ముమ్మరంగా పావులు కదుపుతున్నారు. ఇక నాటి నుంచి నేటి వరకు టీఆర్‌ఎస్‌లో, కాంగ్రెస్‌ పార్టీలలో ఉండి పార్టీలు మారని నేతలు మాత్రం ఈ పరిస్ధితిని చూసి ముందు వచ్చిన చెవులకన్నా వెనుకవచ్చిన కొమ్ములు వాడి అంటే ఇదేనేమో అంటూ  వాపోతున్నారు.
చదవండి: రంగు మారిన రాజకీయం

   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement