ఫ్యామిలీ తోడుగా..  ప్రచారం జోరుగా.. | Sakshi
Sakshi News home page

ఫ్యామిలీ తోడుగా..  ప్రచారం జోరుగా..

Published Mon, Nov 26 2018 11:23 AM

Political Candidates Need Family Backing Before Seeking Outside Support - Sakshi

సాక్షి, యాదాద్రి : ఎన్నికల ప్రచారం తారాస్థాయికి చేరింది. పోలింగ్‌ సమయం దగ్గర పడుతుండడంతో అభ్యర్థులు గెలుపుకోసం శక్తియుక్తులొడ్డుతున్నారు. మరోవైపు అభ్యర్థుల తరఫున వారి కుటుంబ సభ్యులు, బంధుగణం ప్రచారబాట పట్టింది.

గ్రామాలు, పట్టణాల్లో ఇంటింటికీ వెళ్లి విస్తృతంగా ప్రచారం సాగిస్తున్నారు. మహిళలకు బొట్టు పెట్టి ఓటు అడుగుతూ తమ అభ్యర్థిని గెలిపించాలని వేడుకుంటున్నారు.  కొందరు ఎలాంటి హంగూఆర్భాటం లేకుండా ప్రచారం చేస్తుండగా మరికొందరు వినూత్న రీతిలో దూసుకుపోతూ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నారు.

జిల్లాలో టీఆర్‌ఎస్, కాంగ్రెస్, బీజేపీ, బీఎల్‌ఎఫ్‌తో పాటు ఇతర పార్టీల అభ్యర్థుల కుటుంబాలు పోటాపోటీగా ప్రచారం సాగిస్తున్నాయి.జిల్లా పరిధిలోని భువనగిరి, ఆలేరు, మునుగోడు, తుంగతుర్తి, నకిరేకల్‌ నియోజకవర్గాల్లో అభ్యర్థుల తరఫున వారి కుటుంబాలు రంగంలోకి దిగడంతో ప్రచారం మరింత వేడెక్కింది.

అభ్యర్థుల భార్యలు, తనయులు, సోదరులు, అల్లుళ్లు ఇతర బంధువర్గం అంతా రంగంలోకి దిగడంతో ప్రచారం పో టాపోటీగా సాగుతోంది. ప్రధానంగా మహిళా ఓ టర్లను ఆకట్టుకునేందుకు వినూత్నంగా ప్రచారం చేస్తున్నారు. భువనగిరి నియోజకవర్గ టీఆర్‌ఎస్‌ అభ్యర్థి పైళ్ల శేఖర్‌రెడ్డి భార్య వనితారెడ్డి, కుమార్తె మాన్వితారెడ్డి, కాంగ్రెస్‌ అభ్యర్థి కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి తరఫున భార్య కిరణ్‌జ్యోతిరెడ్డి, కుమారుడు శ్రీరామ్‌రెడ్డి, కుమార్తెలు కీర్తిరెడ్డి, స్పూర్తిరెడ్డి విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు.

అదే విధంగా ఆలేరు నియోజకవర్గ టీఆర్‌ఎస్‌ అభ్యర్థి గొంగిడి సునీత తరఫున ఆమె భర్త గొంగిడి మహేందర్‌రెడ్డి, అల్లుడు అక్షయ్‌రెడ్డి, కుమార్తె అంజనీరెడ్డి, కాంగ్రెస్‌ అభ్యర్థి బూడిద భిక్షమయ్యగౌడ్‌ తరపున ఆయన సతీమణి బూడిద సువర్ణ ప్రచారం నిర్వహిస్తున్నారు.

ఇక మునుగోడు నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి గంగిడి మనోహర్‌రెడ్డి సతీమణి అనురాధ, టీఆర్‌ఎస్‌ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి సతీమణి అరుణ, కుమారుడు శ్రీనివాస్‌రెడ్డి, కాంగ్రెస్‌ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి సతీమణి లక్ష్మి ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. తుంగతుర్తి నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి రామచంద్రయ్య సతీమణి సరస్వతి ఇంటింటికి వెళ్లి ప్రచారం నిర్వహిస్తున్నారు. 


బృందాలుగా విడిపోయి..
అభ్యర్థుల తరఫున వారి భార్యలు, కుటుంబంలో ని మహిళలు.. మహిళా ఓటర్లకు బొట్టు పెట్టి, పార్టీ గుర్తులను చూపిస్తూ ఓటు వేయాలని అభ్యర్థిస్తున్నారు. ప్రణాళిక ప్రకారం ప్రచారం సాగిస్తున్నారు. ఉదయం 7 గంటలకే బయటకు వెళ్లి సాయంత్రం వరకు బృందాలుగా ప్రచారంలో పాల్గొంటున్నారు.

ప్రచారానికి మరో పది రోజులే మిగిలి ఉండడంతో  ఎక్కడెక్కడ ప్రచారంలో చేయాలో ప్రణాళిక సిద్ధం చేసుకుని ముందుకు సాగుతున్నారు. మొత్తానికి కుటుంబసభ్యులు, బంధుగణంతో ప్రచారం మరింత వేడెక్కింది. 

Advertisement
Advertisement