పోలింగ్‌ కేంద్రాలపై నజర్‌ 

Police's Special Eye on Ploing Stations - Sakshi

బైండోవర్లు, అరెస్టులకు రంగం సిద్ధం

సమస్యాత్మక కేంద్రాల గుర్తింపు

నగదు, మద్యం రవాణాకు అడ్డుకట్ట

లోక్‌సభ ఎన్నికల కోసం పోలీసుల చర్యలు

సాక్షి, జనగామ: పార్లమెంట్‌ ఎన్నికల నేపథ్యంలో పోలీసులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నారు. సజావుగా ఎన్నికలు నిర్వహించడం కోసం ముందు జాగ్రత్త చర్యలకు శ్రీకారం చుట్టింది. పోలింగ్‌ కేంద్రాలపై నిఘాను ఏర్పాటు చేయడంతోపాటు ప్రజల్లో ప్రశాంతమైన పోలింగ్‌ నిర్వహణ కోసం అవగాహన సదస్సులను నిర్వహిస్తోంది. జిల్లా పరిధిలోని జనగామ, పాలకుర్తి, స్టేషన్‌ఘన్‌పూర్‌ నియోజకవర్గాల పరిధిలోని పార్లమెంట్‌ ఎన్నికలు ప్రశాంతమైన వాతావరణంలో జరుపడానికి పోలీస్‌శాఖ తమ చర్యలను మొదలు పెట్టింది. 

సమస్యాత్మక కేంద్రాల గుర్తింపు..
రానున్న పార్లమెంట్‌ ఎన్నికల్లో భాగంగా పోలింగ్‌ కేంద్రాలను పరిశీలిస్తున్నారు. జిల్లాలోని మూడు నియోజకవర్గాల పరిధిలో 857 పోలింగ్‌ కేంద్రాలున్నాయి. గతంలో జరిగిన అల్లర్లు, గొడవలు, ఘర్షణల కారణంగా కొన్ని పోలింగ్‌ కేంద్రాలను సమస్యాత్మక కేంద్రాలుగా గుర్తించారు. 857 పోలింగ్‌ కేంద్రాల్లో 102 సమస్యాత్మక కేంద్రాలున్నట్లు పోలీసులు ప్రాథమికంగా అంచనా వేశారు. పూర్తిస్థాయి పరిశీలన తరువాత సాధారణ, సమస్యాత్మక, అతి సమస్యాత్మక కేంద్రాలను విభజన చేయనున్నారు. 

బైండోవర్లకు రంగం సిద్ధం..
శాంతియుత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించడానికి పోలీసులు బైండోవర్లు చేపట్టాడానికి రంగం సిద్ధంచేశారు. బెల్ట్‌ షాపుల నిర్వాహకులు, రౌడీలు, మాజీలు, దౌర్జన్యాలకు పాల్పడిన వ్యక్తులను బైండోవర్‌ చేయనున్నారు. 2018 శాసన సభ ఎన్నికల్లో భాగంగా జిల్లా వ్యాప్తంగా 4,938 మందిని బైండోవర్‌ చేశారు. జనవరి నెలలో జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా మరో 200 మందిని బైండోవర్‌ చేశారు. రెవెన్యూ శాఖను సమన్వయం చేసుకుంటూ బైండోవర్లను మరోమారు చేపట్టనున్నారు. 

నగదు, మద్యం రవాణాకు అడ్డుకట్ట..
ఎన్నికల్లో ఓటర్లను ప్రలోభాలకు గురి చేయకుండా నిరోధించడానికి నగదు, మద్యం అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయడానికి పోలీసులు చెక్‌ పోస్టులను ఏర్పాటు చేశారు. ఒక్కొక్క నియోజకవర్గానికి మూడు చెక్‌ పోస్టుల చొప్పున జిల్లా వ్యాప్తంగా తొమ్మిది చెక్‌ పోస్టులను ఏర్పాటు చేశారు. వరంగల్‌–హైదరాబాద్‌ జాతీయ రహదారి, సిద్దిపేట–సూర్యాపేట రాష్ట్ర రహదారికి అనుసంధానంగా ఉండడంతో తనిఖీలను ముమ్మరం చేశారు. ఇటీవలే జరిగిన శాసనసభ ఎన్నికల్లో కొట్లాది రూపాయల నగదు పట్టుబడింది. ప్రస్తుతం లోక్‌సభ ఎన్నికల్లో అదేస్థాయిలో తనిఖీలు నిర్వహించడానికి ఏర్పాట్లు చేశారు. ప్రతి వాహనాన్ని తనిఖీ చేయడంతోపాటు వీడియో రికార్డింగ్‌ చేయనున్నారు. గ్రామాల్లో మద్యం నిల్వలు లేకుండా చూడడంపై దృష్టి సారించారు. మద్యం షాపుల నుంచి గ్రామాలకు తరలిపోకుండా నిఘాను ఏర్పాటు చేశారు. పార్లమెంట్‌ ఎన్నికల్లో అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లను చేస్తున్నారు. 

రూ.33 లక్షలు  పట్టివేత

పార్లమెంట్‌ ఎన్నికలను పురస్కరించుకుని  పోలీసుల తనిఖీలో భాగంగా జనగామ పట్టణంలోని ఆర్‌ అండ్‌బీ అతిథి గృహం ఆవరణలో శుక్రవారం రాత్రి ఓ వ్యక్తి కారులో తీసుకు వెళుతున్న  రూ.33.03 లక్షలు స్వాధీనం చేసుకున్నట్లు సీఐ మల్లేశం తెలిపారు. ఆంజనేయులు కారులో నగదు తీసుకు వెళుతున్నాడనే సమాచారం పోలీసులకు వచ్చిందన్నారు. నగదుకు సంబంధించిన పూర్తి వివరాలు సమర్పిస్తే.. ఎన్నికల అధికారులు విడుదల చేస్తారన్నారు. డబ్బులను ఫ్లయింగ్‌ స్కాడ్‌ కు అప్పగించినట్లు తెలిపారు.  

నిఘా పెంచుతున్నాం..
ఉన్నతాధికారుల సూచనలకు అనుగుణంగా నిఘాను పెంచుతున్నాం. శాసనసభ, గ్రామ పంచా యతీ ఎన్నికలను శాంతిభద్రతల పరంగా ఇబ్బందులు లేకుండా నిర్వహించగలిగాం. సమస్యాత్మక కేంద్రాల్లోనూ అవాంఛనీయ ఘటనలు తలెత్తలేదు. జనగామ అసెంబ్లీ  భువనగిరి పార్లమెంట్‌ నియోజకవర్గంలో ఉంది. స్టేషన్‌ ఘన్‌పూర్, పాలకుర్తి నియోజకవర్గాలు వరంగల్‌ పార్లమెంట్‌ పరిధిలో ఉన్నాయి. అధికారులతో సమన్వయం చేసుకుంటున్నాం. గతంలో జరిగిన ఎన్నికల మాదిరిగానే ప్రస్తుతం ప్రశాంతంగా నిర్వహించడానికి చర్యలు తీసుకుంటున్నాం. 
- శ్రీనివాసరెడ్డి, డీసీపీ జనగామ

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top