బడగులు కావడంతోనే ‘దిశ’ నిందితుల ఎన్‌కౌంటర్‌

Police Encountered Disha Accusers Because They Belong To Lower Caste Says Manda Krishna Madiga - Sakshi

శిక్షల్లో వివక్ష ఎందుకు..?

ప్రభుత్వాలు అన్ని కేసులను ఒకేలా పరిష్కరించాలి 

ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపక జాతీయ అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ

సాక్షి, అలంపూర్‌: అత్యాచారాలు, హత్యలు చేసిన నిందితులకు శిక్షల్లో వివక్ష ఎందుకు చూపుతున్నారని ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపక జాతీయ అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ అన్నారు. గుంటూరు నుంచి హైదరాబాద్‌ వెళ్తున్న ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపక జాతీయ అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ మంగళవారం సాయంత్రం అలంపూర్‌ చౌరస్తా చేరుకున్నా రు. ఈ సందర్భంగా ఆయన అలంపూర్‌ చౌరస్తా లోని వ్యవసాయ మార్కెట్‌ యార్డులో కార్యకర్తలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఏర్పా టు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ‘దిశ’ నిందితులది బూటకపు ఎన్‌కౌంటర్‌ అన్నారు. రాజ్యాంగబద్ధంగా వారికి కోర్టు ద్వారా శిక్ష వేయాల్సిన పోలీసులు తమ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి రాజ్యాంగానికి విరుద్ధంగా ఎన్‌కౌంటర్‌ చేశారని ఆరోపించారు. దిశ నిందితుల తల్లిదండ్రులు నిరక్షరాస్యులైనప్పటికీ తమ పిల్లలు తప్పు చేసి ఉంటే కోర్టు ద్వారా శిక్ష పడాలని కోరుకున్నారన్నారు.కోర్టు కంటే ముందే శిక్ష వేశారన్నారు. నిందితులు బలహీన వర్గాలకు చెందిన వారు కావడంతోనే పోలీసులు ఎన్‌కౌంటర్‌ చేశారన్నారు. 

కులం, మతం తేడా చూడొద్దు 
గత 15 ఏళ్లలో 3.41 లక్షల అత్యాచారాలు, హత్యల కేసులు నమోదైనా.. ఎక్కడా ఇలాంటి సంఘటన జరగలేదని మంద కృష్ణ అన్నారు. హాజీపూర్‌ ఘటనలో నలుగురు అమ్మాయిలను అత్యాచారం చేసి హత్య చేసిన శ్రీనివాస్‌రెడ్డిని, జడ్చర్లలో బాలికను హత్య చేసిన నిందితుడిని ఎందుకు శిక్షించలేదన్నారు. కులం, మతం అనే తేడా లేకుండా అందరికీ ఒకే రకమైన శిక్ష పడాలన్నారు. బాధిత కుటుంబాలకు అండగా ఉంటామన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలు ఏకతాటిపైకి రావాల్సిన అవసరం ఉందన్నారు. అందుకే ఈ నెల 24న బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలని కోరుతూ బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top