
సాక్షి, కొత్తగూడెం: ఛత్తీస్‌గఢ్ దండకారణ్యాన్ని షెల్టర్‌జోన్‌గా చేసుకుని కార్యకలాపాలు సాగిస్తున్న మావోయిస్టుల ఉనికి తెలంగాణలో మాత్రం మూడేళ్లుగా నామమాత్రమే. అయితే మూడు నెలలుగా రాష్ట్రంలో ఉనికి చాటుకునేందుకు కార్యకలాపాలు ముమ్మరం చేశారు. భద్రాచలం, ఏటూరునాగారం ఏజెన్సీ పరిధి లోని గోదావరి పరీవాహక ప్రాంతం ద్వారా రాష్ట్రంలోకి చొచ్చుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. దీంతో ఇక్కడ వారి కార్యకలాపాలను ఆదిలోనే అడ్డుకునేందుకు పోలీసు యంత్రాంగం పక్కాగా ప్రతివ్యూహాలను అమలు చేస్తోంది. ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, ఒడిశా రాష్ట్రాల పోలీసులతో కలసి సంయుక్తంగా దండకారణ్యంలో కూంబింగ్ ఆపరేషన్లు నిర్వహిస్తున్నారు. దీనికి ప్రతిగా మావోయిస్టులు సైతం బీజాపూర్, సుక్మా, దంతెవాడ, బస్తర్ జిల్లాల్లో పలు విధ్వంసకర కార్యక్రమాలకు పాల్పడుతున్నారు. గత డిసెంబర్ నుంచి భద్రాద్రి, భూపాలపల్లి జిల్లాల్లోనూ కార్యకలాపాలు సాగిస్తున్నారు. ఈ ప్రభావం వచ్చే ఎన్నికలపై పడే ప్రమాదం ఉందని గ్రహించిన పోలీస్ యంత్రాంగం సీరియస్‌గా తీసుకుంది. మావోయిస్టుల చొరబాట్లను నిరోధించేందుకు సీఆర్‌పీఎఫ్, స్పెషల్‌పార్టీ, గ్రేహౌండ్స్ బలగాలతో కూంబింగ్ నిర్వహిస్తోంది.
షెల్టర్ జోన్‌గా బీజాపూర్ దండకారణ్యం
మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు కొందరు ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ దండకారణ్యాన్ని షెల్టర్‌జోన్‌గా చేసుకుని తెలంగాణలో కార్యకలాపాలను విస్తరించేందుకు ప్రణాళికలు తయారు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో అక్కడికి సమీపంలోని వెంకటాపురం, చర్ల మండలాల్లో ముందుగా ప్రవేశించి తర్వాత ఆ ప్రాంతాల నుంచి గోదావరి దాటి ఇతర జిల్లాల్లోకి చొచ్చుకొ చ్చేందుకు వ్యూహరచన చేసినట్లు సమాచారం. ఈ క్రమంలో నవంబర్ 4న భూపాలపల్లి జిల్లా వెంకటాపురం మం డలం సూర వీడు వద్ద పోస్టర్ అంటించిన మావోయిస్టులు దానికి బాంబులు అటాచ్ చేశా రు. అదే మండలంలోని ప్రధాన రహదారిపై మందుపాతర అమర్చగా, పోలీసులు ఈ రెండింటినీ నిర్వీర్యం చేశారు. జనవరి 24న భద్రాద్రి జిల్లా చర్ల మండలం సుబ్బంపేట పంచాయతీ క్రాంతిపురంలో మడివి రమేష్‌ను హత్య చేశారు. జనవరి 26న పినపాక మండలం జానంపేట పంచా యతీ పరిధిలోని ఉమేష్‌చంద్రనగర్‌లోని ఇసుక క్వారీ వద్దకు 40 మంది మావోయిస్టులు వచ్చి పొడియం జోగయ్యను హత్య చేశారు. అతని కొడుకును కూడా హత్య చేశారు. బీజాపూర్ జిల్లాలో ఇటీవల ఇన్‌ఫార్మర్ల నెపంతో ఐదుగురు ఆదివాసీలను హత్య చేశారు. ఛత్తీస్‌గఢ్‌లో సీఆర్‌పీఎఫ్ బేస్‌క్యాంప్‌లపై పలుమార్లు దాడులకు పాల్పడ్డారు. వెంకటాపురం మండలంలో ఫిబ్రవరి 4న బీఎస్‌ఎన్‌ఎల్ టవర్ పేల్చివేశారు. ఇలా విస్తృతమవుతున్న వారి కార్యకలాపాలను నియంత్రించేందుకు పోలీసులు ముందుకెళ్తున్నారు.
సరిహద్దు మండలాల్లో పోలీస్‌స్టేషన్లు
సరిహద్దు మండలాల్లో మరిన్ని పోలీస్‌స్టేష న్లు ఏర్పాటు చేయాలని పోలీస్ యంత్రాం గం నిర్ణయించినట్లు తెలుస్తోంది. చర్ల, భూపాలపల్లి జిల్లా వెంకటాపురం మండల కేంద్రానికి 55 కిలోమీటర్ల దూరం ఉంది. వీటి మధ్య ఆలుబాకలో పోలీస్‌స్టేషన్ ఏర్పా టుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. చర్ల మండలం దానవాయిపేట, దుమ్ముగూడెం మండలం పర్ణశాలలో పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేయనున్నారు.
అధికార పార్టీ నేతల్లో దడ
భారీ ఎన్‌కౌంటర్ నేపథ్యంలో మావోయిస్టులు ప్రతీకార చర్యలకు పాల్పడే అవకాశమున్నట్లు తెలుస్తోంది. ఆ పార్టీ తెలంగాణ అధికార ప్రతినిధి జగన్ ప్రకటన విడుదల చేయడంతో అధికార పార్టీ నేతల్లో భయం నెలకొంది. ఎన్‌కౌంటర్ వ్యూహాలు భద్రాచలం కేంద్రంగా అమలు చేయడం, ఇందులో తెలంగాణ గ్రేహౌండ్స్ పోలీసులు కీలకపాత్ర పోషించడంతో మావోయిస్టులు టీఆర్‌ఎస్ నేతలపై దృష్టి సారించే అవకాశముందనే ఆందోళన వారిలో వ్యక్తమవుతోంది. దీంతో నేతలు పట్టణాలు, నగరాలబాట పడుతున్నారు.