
29 నుంచి పీజీ వైద్య విద్య కౌన్సెలింగ్
పీజీ వైద్య విద్య కౌన్సెలింగ్ ఈ నెల 29 నుంచి ప్రారంభం కానుంది. తెలంగాణ విద్యార్థులకు కూడా విజయవాడలోని ఎన్టీఆర్ ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయంలో కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు.
* తెలంగాణ విద్యార్థులకూ విజయవాడలోనే...
* వ్యతిరేకిస్తున్న విద్యార్థులు...
* హైదరాబాద్‌కు మార్చాలని డిమాండ్
సాక్షి, హైదరాబాద్: పీజీ వైద్య విద్య కౌన్సెలింగ్ ఈ నెల 29 నుంచి ప్రారంభం కానుంది. తెలంగాణ విద్యార్థులకు కూడా విజయవాడలోని ఎన్టీఆర్ ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయంలో కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. అయితే 2015-16 సంవత్సరంలో పీజీ వైద్య విద్య కౌన్సెలింగ్ ప్రక్రియను హైదరాబాద్‌లోనే నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం యోచిస్తుండగా... ఎన్టీఆర్ ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం మాత్రం మొదటి నుంచీ ససేమిరా అంటోంది. అన్ని ఏర్పాట్లు ఉన్న విజయవాడలోనే కౌన్సెలింగ్ నిర్వహిస్తామని ఇప్పటికే స్పష్టం చేసింది. హైదరాబాద్‌లోనే కౌన్సెలింగ్ నిర్వహించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని విద్యార్థులు కోరుతున్నారు. దీనిపై జూనియర్ డాక్టర్ల సంఘం కన్వీనర్ శ్రీనివాస్ ఇప్పటికే వైద్య ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి, ముఖ్య కార్యదర్శి సురేష్‌చందాను కలసి ఈ మేరకు డిమాండ్ చేశారు.
రాష్ట్రంలో 1,140 పీజీ వైద్య సీట్లు
రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేటు వైద్య కళాశాలల్లో కలిపి మొత్తం 1,140 పీజీ వైద్య సీట్లు ఉండగా అందులో 515 సీట్లు ప్రభుత్వ, 625 సీట్లు ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో ఉన్నాయి. నిబంధనల ప్రకారం 85 శాతం సీట్లను తెలంగాణ విద్యార్థులతో... 15 శాతం సీట్లను అన్‌రిజర్వ్‌డ్‌గా భర్తీ చేయాలి. గతేడాది ఎన్టీఆర్ ఆరోగ్య వర్సిటీ సహకారంతో ఎంబీబీఎస్, డెంటల్ వైద్య విద్య కౌన్సెలింగ్ ప్రక్రియను హైదరాబాద్, వరంగల్‌లో నిర్వహించగా... పీజీ వైద్య విద్య కౌన్సెలింగ్‌ను మాత్రం విజయవాడలోనే నిర్వహించారు. అయితే అప్పట్లో పీజీ వైద్య విద్య సీట్ల కేటాయింపుల్లో తమకు అన్యాయం జరిగిందంటూ కౌన్సెలింగ్ సమయంలో విద్యార్థులు ఆందోళన చేశారు. అప్రాధాన్యమైన సీట్లను తమకు కేటాయించారంటూ తెలంగాణ విద్యార్థులు నిరసన తెలపడంతో 2 రోజులు కౌన్సెలింగ్ వాయిదా పడింది. ఈ ఏడాది కౌన్సెలింగ్‌ను హైదరాబాద్‌లోనే నిర్వహించాలని ప్రభుత్వం యోచిస్తోంది. సమయం తక్కువగా ఉండటం వల్ల 2 రాష్ట్రాల విద్యార్థులకు కలిపి విజయవాడలోనే కౌన్సెలింగ్ నిర్వహిస్తామని ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ అధికారులు చెబుతున్నారు. కాగా, పీజీ కౌన్సెలింగ్‌పై చర్చించేందుకు వైద్య విద్యా సంచాలకులు పుట్టా శ్రీనివాస్ శుక్రవారం వర్సిటీ అధికారులతో సమావేశమవనున్నట్లు సమాచారం.