ఓ మై డాగ్‌!

Pet Lovers Celebrate Dogs Birthdays in Hyderabad - Sakshi

నగరంలో నయా ట్రెండ్‌ భౌ..భౌలకు బర్త్‌డే వేడుక

75 శాతం పెట్స్‌ యజమానులు నిర్వహణ

‘లిలీస్‌ కిచెన్‌’ సర్వేలో వెల్లడి

ఇదేదో పిల్లల వేడుకలా కాకుండా పెద్దవాళ్లు సైతం పెద్ద సంఖ్యలోనే పాల్గొంటున్నారు. అతిథులు కూడా తమ ఫ్యామిలీ ఫ్రెండ్‌ కోసం కానుకలు సైతం బహుకరిస్తున్నారు. బంధు మిత్రులు సపరివార సమేతంగా, తమ పెట్స్‌తో సహా అటెండ్‌ అవుతున్నారు. కొన్ని సందర్భాల్లో వేడుకల్లో భాగంగా పెట్స్‌ ర్యాంప్‌వాక్‌ వంటివి కూడా జోడిస్తున్నారు.

సాక్షి, సిటీబ్యూరో: మన హృదయపు సింహాసశనమున శునకము తిష్ట వేసుకుని కూర్చుంది. ఒకప్పుడు కాపలా కాసే విశ్వసనీయ జంతువుగానే ఉన్నా తర్వాత నేస్తంగా మారి.. ఇప్పుడు సమస్తమైపోయింది. అందుకే దాని పుట్టిన రోజు మనకి పండుగ రోజులా చేస్తున్నారు. అందుతగ్గట్టే సిటీలో పెట్‌ బర్త్‌డే ఈవెంట్స్‌ సందడిగా జరుగుతున్నాయి. పెట్‌ ఫుడ్‌ తయారీకి పేరొందిన ‘లిలీస్‌ కిచెన్‌’ వెల్లడించిన సర్వేలో పెట్‌ డాగ్స్‌ బర్త్‌డేల పట్ల పెట్‌ ఓనర్స్‌లో ఆసక్తి బాగా పెరిగిందని తేలింది. దేశవ్యాప్తంగా తాజాగా నిర్వహించిన ఈ సర్వేలో 75 శాతం మంది పెట్స్‌ యజమానులు వాటి పుట్టినరోజు తప్పనిసరిగా జరుపుతున్నారని తేలింది. ఇందులో 58 శాతం మంది ‘హ్యాపీ బర్త్‌డే’ పాట కూడా పాడుతున్నామంటున్నారు. తమ కుటుంబంలో పెట్‌ కూడా ఒక భాగమని 41 శాతం మంది చెప్పగా, 14 శాతం మంద్రి మరింత ముందుకు వెళ్లి కన్నబిడ్డలతో సమానమని చెప్పారు. 

అంతా ఎంతో ప్రత్యేకం
కేక్స్‌ నుంచి డ్రింక్స్‌ దాకా నగరంలో సిటీజనుల బర్త్‌డే వేడుకలు విలాసవంతంగా జరుగుతాయి. అయితే, తాము పెంచుకుంటున్న పెట్స్‌ కోసం కూడా భారీ స్థాయిలో ఖర్చు పెడుతుండడం విశేషం. అచ్చం తమ చిన్నారుల కోసం చేసినట్టే కేక్‌ కటింగ్, బెలూన్‌ డెకరేషన్, ప్రత్యేక థీమ్స్‌ వంటివి ఏర్పాటు చేస్తున్నారు. అంతేకాదు.. ప్రత్యేకంగా రెస్టారెంట్స్, కాఫీషాప్స్‌ వంటి పార్టీ ప్లేస్‌లను ఈ ఈవెంట్స్‌ కోసం ఎంచుకుంటున్నారు. తమ పెట్‌కి ఆ రోజు డిఫరెంట్‌గా, వెరైటీగా వస్త్రధారణ చేస్తున్నారు. మొత్తమ్మీద ఒక పూర్తి ఫన్‌ అండ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ ఈవెంట్స్‌గా పెట్స్‌ బర్త్‌డే పార్టీస్‌ మారాయంటున్నారు గచ్చిబౌలిలో పెట్స్‌ కేఫ్‌ నిర్వహిస్తున్న రుచిర.  

కేక్స్‌ స్పెషల్‌ కూడా..
గతంలో పెట్‌కు పుట్టిన రోజు వేడుక చేయడం చాలా అరుదుగా ఉండేది. ఇప్పుడు బాగా పెరిగాయి. మా కేఫ్‌లోనే వారాని ఒకటైనా ఆ తరహా పార్టీ జరుగుతుంది. వీటిని పెట్స్‌ కూడా బాగా ఎంజాయ్‌ చేస్తున్నాయి. ఆర్టిఫిషియల్‌ ఫ్లేవర్‌ లేకుండా పూర్తిగా ఆర్గానిక్‌ శైలిలో తయారయ్యే కేక్స్‌ వీటికి స్పెషల్‌. ఇక అతిథులుగా వచ్చే పెట్స్‌ కోసం చికెన్, మటన్, ఫిష్‌ వంటి ప్రత్యేక మెనూ ఉంటుంది. అలాగే డ్యాన్స్‌ ఫ్లోర్‌ కూడా రెడీ.– రుచిర, కేఫ్‌ డె లొకొ, పెట్స్‌ కేఫ్‌ 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top