ప్రక్షాళన ప్రారంభం


 సాక్షి, మంచిర్యాల : తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం(టీబీజీకేఎస్)ను ప్రక్షాళన చేసేందుకు ఆ సంఘం గౌరవ అధ్యక్షురాలు కవిత ఉపక్రమించారు. క్షేత్రస్థాయిలో బలోపేతం చేసే దిశగా ముందుకు కదులుతున్నారు. ఇందులో భాగంగానే డివిజన్ ఉపాధ్యక్షులను ఎంపిక చేశారు. ఈ విషయంలో టీబీజీకేఎస్ అధ్యక్షుడు మల్లయ్యతోపాటు తాజాగా అంతర్గత ఎన్నికల్లో గెలుపొందిన రాజిరెడ్డి వర్గంలోని కొందరు అసంతృప్తిగా ఉండటం చర్చనీయాంశం అయింది. సింగరేణి కార్మికుల సమస్యల పరిష్కారంలో డివిజన్ ఉపాధ్యక్ష పదవి కీలకమైంది. డివిజన్ ఉపాధ్యక్షుడు ఆరుగురు సభ్యులతో కూడిన కమిటీతో నెలకోసారి సంబంధిత జీఎంతో ఏరియా సమస్యలపై చర్చించే అవకాశం ఉంటుంది.

 

రాజుకుంటున్న నిప్పు

డివిజన్ కమిటీలతో మల్లయ్య, రాజిరెడ్డి వర్గాల మధ్య రచ్చ మళ్లీ రాజుకుంటోంది. మెజార్టీ వర్గం కార్మికులు పాత కమిటీలనే కొనసాగించాలని కోరుతున్నారని మల్లయ్య వర్గం వాదిస్తుండగా.. కోర్టు తీర్పును అనుసరించి, సంఘం శ్రేయస్సురీత్యా కొత్త ఉపాధ్యక్షులను ఎంపిక చేస్తున్నట్లు రాజిరెడ్డి వర్గం పేర్కొంటోంది. ఇదే సమయంలో మల్లయ్య వర్గం సంఘం సభ్యత్వాలు తగ్గించడం ద్వారా రాజిరెడ్డి వర్గాన్ని బలహీనం చేయవచ్చనే ఎత్తుగడను రూపొందించినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా 5 వేల మంది కార్మికులు మల్లయ్య వర్గం డివిజన్ కమిటీలు ఉంటేనే తాము టీబీజీకేఎస్‌లో కొనసాగుతామని లేనిపక్షంలో సంఘం సభ్యత్వం నుంచి వైదొలుగుతామని పేర్కొంటూ లేఖలు రాసినట్లు ప్రచారం జరుగుతోంది. వారు వెనక్కు తగ్గినట్లు తెలుస్తోంది.

 

బెల్లంపల్లి డివిజన్ నియామకం కమిటీ రూపకల్పన జరిగిందనే వార్తల విషయమై సంఘం కీలక నేత ఒకరిని కలిసేందుకు కొందరు బెల్లంపల్లి నాయకులు ప్రయత్నించినట్లు సమాచారం. శ్రీరాంపూర్ డివిజన్ ఉపాధ్యక్ష పదవి విషయంలో తమకు న్యాయం చేయాలని కొందరు సింగరేణీయులు టీబీజీకేఎస్ ఎన్నికల్లో చక్రం తిప్పిన ఓ నాయకుడిని కలిసినట్లు సమాచారం.

 

అధిష్టానం మథనం


టీబీజీకేఎస్ సంఘాన్ని ప్రక్షాళన చేసేందుకు అడుగులు వేస్తున్న టీఆర్‌ఎస్ పార్టీ సమర్థులై న కొత్తవారికి పదవులు కట్టబెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఉపాధ్యక్ష స్థానం దక్కించుకున్న వారి పనితీరుపై సమీక్ష చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. వీరి పనితీరు బాగోలే ని పక్షంలో మూడు లేదా నాలులు నెలలు వేచి చూసి మార్చే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఈ పర్యవేక్షణ అంతా కవిత నేతృత్వంలో సాగనున్నట్లు సమాచారం.

 

 ప్రస్తుతం కొనసాగుతున్న డివిజన్ల అధ్యక్షులు

 శ్రీరాంపూర్-బంటు సారయ్య, మందమర్రి-జె.రవీందర్, బెల్లంపల్లి- శ్రీనివాసరావు, ఆర్జీ 1-గండ్ర దామోదర్, ఆర్జీ 2-అయిలి శ్రీనివాస్, ఆర్జీ 3- పెర్కారి నాగేశ్వరరావు, భూపాలపల్లి- అప్పని శ్రీనివాస్, కొత్తగూడెం-సంగం చంద్రయ్య, కార్పొరేట్-నరేంద్రబాబు, ఇల్లందు-వెంకటేశ్వర్లు, మణుగూరు-ఆకమయ్య.

 

కొత్త ఉపాధ్యక్షులుగా ఖరారు చేసే అవకాశం ఉన్న పేర్లు..

మందమర్రి-సంపత్, బెల్లంపల్లి-సదాశివ్, ఆర్జీ 1-ఆరెల్లి పోషం, ఆర్జీ 2- రాఘవరెడ్డి లేదా సురేశ్, ఆర్జీ 3- రఘువీర్‌రెడ్డి, కొత్తగూడెం-కాపు కృష్ణ, ఇల్లందు- జగన్నాథం, కొత్తగూడెం కార్పొరేట్-కొమురయ్య, మణుగూరు-శ్రీనివాస్‌రెడ్డి, శ్రీరాంపూర్, భూపాలపల్లి-పేర్ల ఖరారు కసరత్తు సాగుతోంది. డివిజన్ ఉపాధ్యక్షులు సంబంధిత కమిటీల సభ్యుల కసరత్తు పూర్తిచేసిన అనంతరం ఆ పేర్లను సూచిస్తూ మేనేజ్‌మెంట్ కు లేఖ అందజేస్తారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top