జూరాలకు పాలమూరు నీళ్లు

Palumuru water to Jurala - Sakshi

కర్వెన నుంచి సంగంబండ మీదుగా జూరాలకు నీటి తరలింపు 

ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సీఎం ఆదేశాలు 

వేసవిలోనూ జూరాలలో నీటి లభ్యత పెంచేలా నిర్ణయం 

దీనిపై ఇంజనీర్లతో సమీక్షించిన మంత్రులు నిరంజన్‌రెడ్డి,శ్రీనివాస్‌గౌడ్‌

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలోని ప్రధాన ప్రాజెక్టుల కింద సాగునీటి అవసరాలకు నీటి లభ్యత పెంచే చర్యల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక ముందడుగు వేయనుంది. కృష్ణా జలాలపై ఆధారపడి చేపట్టిన ప్రాజెక్టులకు రెండు సీజన్లలోనూ సాగునీటిని అందించేలా చర్యలు చేపట్టింది. దీనిలో భాగంగా పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు నుంచి వచ్చే నీటితో కోయిల్‌సాగర్, సంగంబండ రిజర్వాయర్‌లను నింపుతూనే జూరాల వరకు నీటిని తరలించే ప్రణాళిక రచిస్తోంది. దీనిపై ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్న సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు ఇంజనీర్లు ఆ పనిలో పడ్డారు. ఈ ప్రతిపాదనపై జిల్లాకు చెందిన మంత్రులు నిరంజన్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్‌లు అధికారులతో సమీక్ష నిర్వహించారు.
 
ఏడాదంతా నీటి లభ్యత 
జూరాల ప్రాజెక్టు పూర్తిస్థాయి నిల్వ సామర్థ్యం 9.66 టీఎంసీలు కాగా, నికర నిల్వ సామర్థ్యం 6.80 టీఎంసీలు మాత్రమే. దీనికింద 1.02 లక్షల ఎకరాల మేర ఆయకట్టు ఉంది. ప్రాజెక్టుపై ఆధారపడి నెట్టెంపాడు (21.42 టీఎంసీ), భీమా (20 టీఎంసీ), కోయిల్‌ సాగర్‌ (3.9 టీఎంసీ) ఎత్తిపోతల పథకాలు చేపట్టారు. అన్ని ప్రాజెక్టుల కింద కలిపి 5.50 లక్షల ఎకరాల మేర ఆయకట్టుకు నీరందించాల్సి ఉంది. జూరాలకు వరద ఉండే రోజు ల్లోనే నీటిని ఎత్తిపోసే వీలుంది. దీనికి తోడు వరద నీటికి ఎగువ నుంచి వచ్చే నీటిపైనే ఆధారపడాల్సి ఉంటోంది. ఒక సీజన్‌లో మాత్రమే జూరాలలో నీటి లభ్యత ఉంటుండగా, రెండో సీజన్‌కి కనీసం తాగునీటి అవసరాలు తీర్చే పరిస్థితి లేదు. దీంతో జూరాలకు నీటి లభ్యతను పెంచేందుకు వీలుగా పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు ద్వారా కర్వెన రిజర్వాయర్‌కు తరలించే నీటిని జూరాలకు తరలించాలని సీఎం ఇటీవల ఇంజనీర్లను ఆదేశించారు.

కర్వెన రిజర్వాయర్‌ నుంచి ప్రత్యేక కెనాల్స్‌ను ఏర్పాటు చేసి నీటిని నారాయణపేట్‌ నియోజకవర్గానికి తరలించేందుకు ప్రణాళికలు  సిద్ధం చేయాలన్నారు. నారాయణపేట వరకు ఏర్పాటు చేసిన కెనాల్‌ ద్వారా కోయిలకొండ మండల సమీపంలో ఉన్న పెద్దవాగు నుంచి కోయిల్‌సాగర్‌ను నింపా లని ప్రతిపాదించారు. నారాయణపేట జాయమ్మ చెరువు నుంచి ఉట్కూర్‌ మీదుగా సంగంబండ రిజర్వాయర్‌ వరకు పాలమూరు ఎత్తిపోతల పథకం జలాలు తరలించి, అటు నుంచి జూరాలకు నీటిని తరలించాలన్నది ప్రస్తుత ప్రతిపాదనగా ఉంది. ఈ ప్రతిపాదనలపై ఇంజనీర్లు కసరత్తు మొదలు పెట్టారు. ఈ ప్రతిపాదన అమల్లోకి వస్తే జూరాలకు ఏడాదంతా నీటి లభ్యత ఉండనుంది.

అనుసంధానంపై మంత్రుల సమీక్ష 
పూర్వ పాలమూరు జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టుల పురోగతి, పాలమూరు–రంగారెడ్డి నీళ్లు జూరాలకు తరలింపు, కొత్త ఎత్తిపోతల పథకాలపై శనివారం మంత్రులు నిరంజన్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్‌లు హరితప్లాజాలో ఇంజనీర్లతో సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షకు ఎంపీలు రాములు, మన్నె శ్రీనివాస్‌ రెడ్డి, ఎమ్మెల్యేలు లక్ష్మారెడ్డి, గువ్వల బాలరాజు, మర్రి జనార్ధన్‌ రెడ్డి, అంజయ్య యాదవ్, బండ్ల కృష్ణమోహన్‌ రెడ్డి, జైపాల్‌ యాదవ్, ఆల వెంకటేశ్వర్‌ రెడ్డి, అబ్రహం, ఈఎన్సీ మురళీధర్, సీఈలు ఖగేందర్, రమేశ్‌ హాజరయ్యారు. ఈ సందర్భం గా గత వేసవిలో జూరాల కింద తాగునీటి అవసరాలకు కర్ణాటకలోని నారాయణపూర్‌ నుంచి నీటిని తీసుకో వాల్సి వచ్చిందని, భవిష్యత్తులో ఆ పరిస్థితి రాకుండా కర్వెన రిజర్వాయర్‌ నుండి సంగంబండ, సంగంబండ నుండి జూరాల రిజర్వాయర్‌కు నీటిని నింపేలా ప్రతిపాదనలు వీలైనంత త్వరగా సిద్ధం చేయాలని నిర్ణయించారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top