ఔట్ సోర్సింగ్ ఉద్యోగులపై వేటు | Out sourcing employees | Sakshi
Sakshi News home page

ఔట్ సోర్సింగ్ ఉద్యోగులపై వేటు

Jun 27 2014 11:53 PM | Updated on Oct 17 2018 5:04 PM

కొత్త రాష్ట్రంలో కొలువులు పర్మనెంట్ అవుతాయని ఆశిస్తున్న తరుణంలో ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులపై వేటు పడింది. రెండు శాఖల్లో ఔట్ సోర్సింగ్‌గా పనిచేస్తున్న సుమారు 648 మంది ఉద్యోగులకు ఉద్వాసన పలుకుతున్నారు.

మెదక్:  కొత్త రాష్ట్రంలో కొలువులు పర్మనెంట్ అవుతాయని ఆశిస్తున్న తరుణంలో ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులపై వేటు పడింది. రెండు శాఖల్లో ఔట్ సోర్సింగ్‌గా పనిచేస్తున్న సుమారు 648 మంది ఉద్యోగులకు ఉద్వాసన పలుకుతున్నారు. ఔట్‌సోర్సింగ్ కార్మికులుగా పనిచేస్తున్న ఆర్వీఎం, మెప్మా ఉద్యోగుల సేవలను తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు నిలుపుదల చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఉన్న ఉద్యోగాన్ని కోల్పోయిన వ్యక్తులు తీవ్ర ఆందోళనకు లోనవుతున్నారు. విద్యాశాఖలో విద్యాహక్కు చట్టం కింద నైపుణ్యం గల విద్యను అందించేందుకు ఫిజికల్ ఎడ్యుకేషన్, డ్రాయింగ్, క్రాఫ్ట్, వర్క్ ఎడ్యుకేషన్ కింద నిపుణులను నియమించుకోవడానికి రెండేళ్ల క్రితం ఉత్తర్వులు జారీ అయ్యాయి.
 
 6, 7,8వ తరగతుల్లో వందకు పైగా విద్యార్థులుంటే ఆ పాఠశాలలకు నిపుణుల పోస్టులను మంజూరు చేశారు. ఈ మేరకు జిల్లా వ్యాప్తంగా 271 డ్రాయింగ్, 269 డ్రాప్ట్, 79ఫిజికల్ ఎడ్యుకేషన్ పోస్టులు మంజూరయ్యాయి. అలాగే మెప్మా, ఐకేపీ పరిధిలో జిల్లాలో 12 కమ్యూనిటీ ఆర్గనైజర్ పోస్టులు, 3 ప్రాజెక్ట్ రిసోర్స్ పర్సన్ పోస్టులు, 8డాటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులు, 6 జిల్లా స్పెషలిస్టు పోస్టులు కలిసి మొత్తం 29 పోస్టులు మంజూరయ్యాయి. ఈ మేరకు నిరుద్యోగులైన నిపుణులు ఉద్యోగాల్లో చేరి తమ సేవలందిస్తున్నారు. విద్యాశాఖలో వీరికి నెలకు సుమారు రూ.4500ల పై చిలుకు జీతం అందుతోంది.
 
 ఇటీవలే ఈ జీతం రూ.6వేలకు ప్రతిపాదనలు పంపినట్లు తెలిసింది. అయితే గత విద్యా సంవత్సరం చివరి రోజున వారి పోస్టులను ఆపేసినా కొన్ని రోజుల తర్వాత వారిని తిరిగి తీసుకున్నారు. అయితే గతంలో శిక్షణ పొందిన నిపుణులు లేకపోవడంతో కొన్ని పోస్టులు ఖాళీగా మిగిలిపోయాయి. వీటిని భర్తీ చేయడానికి రాష్ట్రీయ విద్యా మిషన్(ఆర్వీఎం) ఇటీవలే నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ మేరకు మిగిలిన పోస్టులను భర్తీ చేసేందుకు మండల విద్యాశాఖ అధికారులు దరఖాస్తులను స్వీకరిస్తున్నారు.
 
 అదే సమయంలో ఇటీవల అవుట్‌సోర్సింగ్ పోస్టులను తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు నిలిపివేస్తున్నట్లు ఉత్తర్వులు వెలువడ్డాయని ఆర్వీఎం పీఓ యాస్మిన్‌బాష తెలిపారు. దీంతో ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు ఖంగుతిన్నారు. ఇక తమ పరిస్థితి ఏంటని ఆలోచనలో పడ్డారు. మెప్మా ఎంప్లాయిస్ అధ్యక్షులు సాయికృష్ణ మాట్లాడుతూ ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల సేవలను నిలుపుదల చేయడం అన్యాయమన్నారు. వెంటనే ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. లేకుంటే ఆందోళన నిర్వహిస్తామని హెచ్చరించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement