హడావుడిగా ‘మున్సిపోల్స్‌’ ఎందుకు?  | Opposition Parties Comments On Municipal Elections In Telangana | Sakshi
Sakshi News home page

హడావుడిగా ‘మున్సిపోల్స్‌’ ఎందుకు? 

Jul 9 2019 12:50 AM | Updated on Jul 9 2019 12:50 AM

Opposition Parties Comments On Municipal Elections In Telangana - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ప్రస్తుతం పాలక మం డళ్ల గడువు ముగిసిన మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో ప్రత్యేకాధికారులను నియమించినందున ఓటర్ల జాబితా, రిజర్వేషన్ల ఖరారుకు పూర్తిస్థాయిలో చర్యలు తీసుకోకుండా హడావుడిగా మున్సిపల్‌ ఎన్నికలు నిర్వహించొద్దని రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ వి.నాగిరెడ్డికి కాంగ్రెస్, టీడీపీ, సీపీఐ, సీపీఎం, టీజేఎస్, లోక్‌సత్తా విజ్ఞప్తి చేశాయి. మున్సిపల్‌ ఎన్నికల నిర్వహణకు ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టును 119 రోజుల గడువు కోరి, మరోవైపు ఈ నెలాఖరులోగా ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ (ఎస్‌ఈసీ)పై ఒత్తిడిని తీసుకొస్తోందని విమర్శించాయి. సోమవారం ఎస్‌ఈసీ కార్యాలయంలో మున్సిపల్‌ ఎన్నికల నేపథ్యంలో రిజర్వేషన్లు, వార్డుల పునర్విభజన, ఓటర్ల తుది జాబితాపై రాజకీయ పార్టీల నేతలతో కమిషనర్‌ నాగిరెడ్డి సమావేశం నిర్వహించారు.  ఈ సమావేశంలో ఎమ్మెల్సీ శ్రీనివాసరెడ్డి, గట్టు రామచంద్రరావు (టీఆర్‌ఎస్‌) మర్రి శశిధర్‌రెడ్డి, జి.నిరంజన్‌ (టీపీసీసీ), మల్లారెడ్డి (బీజేపీ) రావుల చంద్రశేఖర్‌రెడ్డి (టీటీడీపీ), పల్లా వెంకటరెడ్డి (సీపీఐ), ఎన్‌.నర్సింహారెడ్డి (సీపీఎం), సయ్యద్‌ అమీనుల్‌ జాఫ్రీ (ఎంఐఎం), ఇతర పార్టీల నేతలు పాల్గొన్నారు.

ఓటర్ల డ్రాఫ్ట్‌ షెడ్యూల్‌ జారీ, రిజర్వేషన్ల ఖరారుకు సంబంధించిన తేదీలతో పాటు 15న నోటిఫికేషన్‌ ఇచ్చి ఈ నెలాఖరులోగా మున్సిపల్‌ ఎన్నికలు నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తున్నట్టు ఎస్‌ఈసీ వర్గాలు తెలిపాయని రాజకీయ పార్టీల ప్రతినిధులు సమావేశానంతరం వెల్లడించారు. కాగా, ఈనెల 10న ఓటర్ల జాబితా డ్రాఫ్ట్‌ నోటిఫికేషన్‌ సిద్ధమవుతుందని, ఏవైనా అభ్యంతరాలు, ఫిర్యాదులతోపాటు దీనికి సంబంధించి సలహాలు, సూచనలు 12వ తేదీలోపు మున్సిపల్‌ కమిషనర్‌కు తెలియజేయవచ్చునని కమిషనర్‌ వి.నాగిరెడ్డి తెలిపారు. 14న ఓటర్ల జాబితా విడుదల చేస్తామని, అదే రోజు రిజర్వేషన్ల జాబితాను కూడా ఇస్తామని మున్సిపల్‌ అధికారులు చెప్పారన్నారు. బ్యాలెట్‌ పేపర్‌తోనే ఎన్నికలు నిర్వహిస్తున్నట్టు చెప్పారు.  ఈనెల 19 వరకు పోలింగ్‌ కేంద్రాలను ప్రకటిస్తామన్నారు. ఈ మున్సిపల్‌ ఎన్నికలు, పోలింగ్‌ కేంద్రాలపై మున్సిపాలిటీల వారీగా ఈనెల 13న రాజకీయ పక్షాలతో సమావేశం ఉంటుందని నాగిరెడ్డి తెలిపారు.మున్సిపల్‌ ఎన్నికల్లో ప్రచార ఖర్చు పెంచుతూ రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది. అయితే దీన్ని ఇంకా ఖరారు చేయలేదని వివరించారు. ఎన్నికల నివేదికల్లో మాత్రం ఖర్చు పెంచుతున్నట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం ఉన్న ప్రచార ఖర్చును రెండింతలు చేశారు. మున్సిపాలిటీల్లో ఒక్కో వార్డుకు ఇప్పటివరకు రూ. 1 లక్ష ఉండగా... ఈ ఎన్నికల్లో రూ. 2 లక్షలకు పెంచుతున్నారు. కార్పొరేషన్‌ పరిధిలో గతంలో రూ. 1.50 లక్షలు ఉండగా, ఇప్పుడు రూ. 3 లక్షలకు పెంచుతున్నట్లు వెల్లడించారు.   
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement