నగరంలో ఒప్పో రీసెర్చ్‌ కేంద్రం!

Oppo Research Center in the City! - Sakshi

      500 మందికి ప్రత్యక్ష ఉపాధి అవకాశాలు

      మంత్రి కేటీఆర్‌తో ఒప్పో ప్రతినిధి బృందం చర్చలు  

      తైవాన్‌ కంపెనీల కోసం ప్రత్యేక క్లస్టర్‌

 సాక్షి, హైదరాబాద్‌: ప్రముఖ మొబైల్‌ ఫోన్ల తయారీ సంస్థ ఒప్పో హైదరాబాద్‌ నగరంలో కార్యకలాపాలను ప్రారంభించనుంది. ఒప్పో రీసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ (ఆర్‌అండ్‌డీ) సెంటర్‌ను హైదరాబాద్‌లో ఏర్పాటుచేసే అంశంపై కంపెనీ ప్రతినిధి బృందం బుధవారం రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి కె.తారకరామారావును క్యాంపు కార్యాలయంలో కలిసి చర్చలు జరిపింది. అత్యుత్తమ టాలెంట్‌ పూల్‌ (మానవ వనరులు) లభ్యత, ప్రభుత్వ పారదర్శక విధానాలతో ఆకర్షితులై నగరంలో తమ పరిశోధనా కేంద్రాన్ని ప్రారంభించాలని నిర్ణయం తీసుకున్నట్లు ఒప్పో సంస్థ రీసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ విభాగాధిపతి తస్లీమ్‌ ఆరిఫ్‌ పేర్కొన్నారు.

ఆర్‌అండ్‌డీ కేంద్రం ఏర్పాటుతో 200 మంది ఇంజనీర్లతోపాటు పరోక్షంగా మరో 300 మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. సాధ్యమైనంత త్వరగా ఈ పరిశోధన కేంద్రాన్ని ప్రారంభించనున్నామన్నారు. ఒప్పో లాంటి ప్రముఖ మొబైల్‌ సంస్థ హైదరాబాద్‌లో పరిశోధన కేంద్రం స్థాపించడానికి ముందుకు రావడం పట్ల మంత్రి కేటీఆర్‌ హర్షం వ్యక్తం చేశారు. ఎలక్ట్రానిక్స్, అనుబంధ రంగాల్లో పెట్టుబడులకు ప్రభుత్వం అందించే ప్రోత్సాహకాలను వివరించారు. దేశానికి అన్ని వైపులా రవాణా సౌకర్యాలు ఉన్న సరైన కేంద్రం హైదరాబాద్‌ అని, ఇక్కడ ఉత్పత్తి ప్లాంట్‌ ఏర్పాటు చేస్తే కంపెనీకి ఎంతో ఉపయుక్తంగా ఉంటుందన్నారు. ఒప్పో మొబైల్‌ ఫోన్ల తయారీ ప్లాంట్‌ను నగరంలో ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలిస్తామని తస్లీమ్‌ ఆరీఫ్‌ చెప్పారు. 

తైవాన్‌ పరిశ్రమలకు ప్రత్యేక క్లస్టర్‌  
తైవాన్‌ కంపెనీల కోసం ప్రత్యేకంగా ఒక క్లస్టర్‌ ఏర్పాటు చేసేందుకు సిద్ధంగా ఉన్నామని మంత్రి కేటీఆర్‌ తెలిపారు. తైవాన్‌ విదేశీ వాణిజ్య అభివృద్ధి సంస్థ చైర్మన్‌ జేమ్స్‌ హువంగ్‌ నేతృత్వంలోని ప్రతినిధి బృందంతో బుధవారం బేగంపేట క్యాంపు కార్యాలయంలో ఆయన సమావేశమై తైవాన్, తెలంగాణ మధ్య వాణిజ్య సంబంధాలపై చర్చించారు. హైదరాబాద్‌ చుట్టూ అందుబాటులో ఉన్న ప్రభుత్వ భూములు, నిరంతర విద్యుత్‌ సరఫరా, అత్యుత్తమ ప్రభుత్వ పాలసీలు, ప్రోత్సాహకాలు తైవాన్‌ పెట్టుబడులకు అనుకూలంగా ఉన్నాయన్నారు.

తమ రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధి బృందం కూడా తైవాన్లో విస్తృతంగా పర్యటించి అక్కడి కంపెనీలను తెలంగాణలో పెట్టుబడులు పెట్టాల్సిందిగా ఆహ్వానించింద న్నారు. రాష్ట్ర ప్రభుత్వ విధానాలు, ఇక్కడ అందుబాటులో ఉన్న మౌలిక వసతుల పట్ల సానుకూల దృక్పథంతో ఉన్నామని తైవాన్‌ వాణిజ్య బృందం తెలిపింది. తైవాన్‌ కంపెనీలకు ప్రత్యేకంగా రెండు వందల ఎకరాల్లో పార్కును ఏర్పాటు చేస్తే, అక్కడికి పెట్టుబడులు వచ్చేలా కృషి చేస్తామని హామీ ఇచ్చింది. హైదరాబాద్‌లో తైవాన్‌ విదేశీ వాణిజ్య అభివృద్ధి సంస్థ కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలన్న మంత్రి విజ్ఞప్తి పట్ల సానుకూలంగా స్పందించింది.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top