ఒక్కొక్కరిదీ ఒక్కో దీనగాథ..!

Open Cost Company Blast Family Members Sad Story Peddapalli - Sakshi

పొట్టకూటి కోసం ఒకరు

పిల్లల భవిష్యత్‌కు మరొకరు

వ్యవసాయం వదిలి కార్మికుడిగా..

కుటుంబానికి తోడుగా ఇంకొకరు

రామగుండంక్రైం: పొట్టకూటికోసం ఒకరు.. పిల్లల పోషణకు మరొకరు..కూతుళ్ల పెళ్లిళ్లు ఘనంగా చేయాలని ఓ తండ్రి.. కుటుంబానికి సాయంగా ఉంటానని ఓబీ సంస్థలో కార్మికులు గా చేరారు. మంగళవారం జరిగిన బ్లాస్టింగ్‌లో మృతిచెందిన నలుగురు కుటుంబాల దీనగాథ ఇదీ..(ఓపెన్‌కాస్ట్‌ ప్రమాదం : వైఎస్‌ జగన్‌లా ఆదుకోవాలి)

పొట్టకూటి కోసం..
మహారాష్ట్ర గడ్చిరోలికి చెందిన రాకేశ్‌ తండ్రి రాజన్న మృతిచెందాడు. తల్లి సుశీల పొట్టకూటి కోసం ఇద్దరు కొడుకులు రవి ,రాకేశ్, కూతురు మౌనికను  తీసుకుని గోదావరిఖనికి వచ్చి భగత్‌సింగ్‌ నగర్‌ ఉంటున్నారు. మౌనిక పెళ్లి చేయగా, పెద్ద కొడుకు రవి కూలీ పని చేసుకుంటున్నాడు. రాకేశ్‌ ఏడాది క్రితమే ఓబీ సంస్థలో పనిలో చేరాడు. ఎదిగిన కొడుకు మృతితో సుశీల కన్నీరుమున్నీరుగా విలపిస్తోంది.

కూతుళ్ల పెళ్లి కోసం..  
బిళ్ల రాజేశం వ్యవసాయం చేసేవాడు. ఈయనకు భార్య ధనలక్ష్మి, కూతుళ్లు మధుప్రియ, మానస. కూతుళ్ల పెళ్లి కోసం వ్యవసాయం వదిలి ఓబీ సంస్థలో కార్మికునిగా  చేరాడు. పెద్ద కూతురు మధుప్రియకు వివాహం చేయగా, చిన్న కూతురు మానసకు కూడా మంచి సంబంధం తీసుకొచ్చి ఘనంగా పెళ్లి చేయాలనుకున్నాడు. ప్రమాదంలో మృతిచెందడంతో భార్య బిడ్డలు గుండెలు పగిలేలా రోదిస్తున్నారు.

పిల్లల భవిష్యత్‌ ఆగం
కమాన్‌పూర్‌కు చెందిన బండ అర్జయ్య(42) ఓబీ కార్మికుడిగా 15 సంవత్సరాలుగా పనిచేస్తున్నాడు. ఆయనకు భార్య ఊర్మిళ, కరీంనగర్‌లో బీఫార్మసీ చదువుతున్న కూతురు నవ్యశ్రీ, గర్రెపల్లి మహాత్మ జ్యోతిరావు పూలే పాఠశాలలో ఏడో తరగతి చదువుతున్న కొడుకు అభిరామ్‌ ఉన్నారు. పిల్లలకు మంచి భవిష్యత్‌ అందించాలని కలలుగన్న అర్జయ్య ప్రమాదంలో దుర్మరణం చెందడంతో పిల్లల భవిష్యత్తును తలచుకుంటూ ఊర్మిళ శోకసంద్రంలో మునిగిపోయింది.

భార్యా, పిల్లలకు దూరం..
బ్లాస్టింగ్‌ ప్రమాదంలో మృతి చెందిన బండారి ప్రవీణ్‌కుభార్య విలాసిని, ఐదేళ్ల కూతురు హానిక, ఏడాదిన్నర కొడుకు విహాన్‌ ఉన్నారు. ప్రవీణ్‌ తండ్రి సాల్మన్‌ సింగరేణి సంస్థలో పనిచేసి రిటైర్‌ అయి మృతిచెందాడు.  ప్రవీణ్‌ రెండేళ్లుగా ఓబీ సంస్థలో పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ప్రవీణ్‌ మృతితో భార్య, పిల్లలు ఒంటరయ్యారు. తాము ఎలా బతకాలని విలాసిని రోదించడం అందరినీ కంటతడి పెట్టించింది.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top