వెల్లువలా ఉల్లి!

Onion Prices Down in Hyderabad Market - Sakshi

మలక్‌పేట్‌ మార్కెట్‌కు భారీగా దిగుమతులు

గత ఏడాది కంటే రెట్టింపు దిగుబడులు

రిటేల్‌గా కిలో రూ.15, హోల్‌సేల్‌గా రూ.10లోపే

మున్ముందు ధరలు మరింత తగ్గే అవకాశం   

సాక్షి, సిటీబ్యూరో: ప్రతి ఏటా వర్షాకాలం ప్రారంభంతో ఉల్లి ధరలు పెరుగుతాయి. కానీ.. ఈ ఏడాది కొత్త ఉల్లి పంట మార్కెట్లకు రావడంతో హోల్‌సేల్‌ ధరలు భారీగా తగ్గాయి. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది ఉల్లి ధరలు హోల్‌సేల్‌లో రూ.10 నుంచి రూ.15 దాటడంలేదని అధికారులు చెబుతున్నారు. తెలంగాణలోని వివిధ జిల్లాలతో పాటు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్రల నుంచి పెద్ద మొత్తంలో కొత్త ఉల్లి దిగుమతులు అవుతున్నాయి. గత ఏడాది ఇదే సీజన్‌లో కిలో ఉల్లి హోల్‌సేల్‌గా రూ.30 వరకు ఉండగా.. ఈ ఏడాది రూ.15లోపే పలుకుతున్నట్లు మార్కెట్‌ వర్గాలు పేర్కొన్నాయి.  

60 లారీల ఉల్లి..
గత ఏడాది ఇదే సీజన్‌లో మలక్‌పేట్‌ మార్కెట్‌కు 34 లారీల ఉల్లి వచ్చింది. ఈసారి 60 లారీ ఉల్లి వస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఉల్లి ధరలు హోల్‌సేల్‌లో రూ.30 వరకు ఉండగా, ఈ ఏడాది పదిహేను రూపాయల లోపే ఉన్నాయని తెలిపారు. ఉల్లి ఎక్కువ మొత్తంలో దిగుమతులు జరగడంతో రిటేల్‌ మార్కెట్‌లో ధరలు రూ.15 నుంచి రూ.20 వరకు ఉన్నాయి. అదే గత ఏడాది రిటేల్‌ ఉల్లి ధరలు రూ.30 నుంచి రూ.40 వరకు ఉండేవి.  

పెరిగిన స్థానిక దిగుమతులు.. 
నగర ప్రజల ఉల్లి అవసరాలు దాదాపు 80 శాతం మహారాష్ట్ర నుంచి దిగుమతి అయ్యే ఉల్లితోనే తీరుతాయి. తాజాగా తెలంగాణలోని మహబూబ్‌నగర్, మెదక్‌తో పాటు ఇతర జిల్లాలు, ఆంధ్రప్రదేశ్‌ కర్నూలు, కర్ణాటక నుంచి ఉల్లి ఎక్కువగా దిగుమతి అవుతోంది. దీంతో ధరలు పెరగడంలేదు. మున్ముందు ధరలు మరింత తగ్గే అవకాశం ఉందని వ్యాపారులు చెబుతున్నారు. ఉల్లి దిగుమతులు భారీగా అవుతుండటం.. మార్కెట్లలో స్టోరేజీ సౌకర్యం లేకపోవడంతో హోల్‌సేల్‌ వ్యాపారులు ఎక్కువగా నిల్వ చేసుకుంటున్నారు.  

ఈ ఏడాది ధరలు సాధారణమే..
గత ఏడాదితో పోలీస్తే ఈసారి లోకల్‌ ఉల్లి మార్కెట్‌కు ఎక్కువగానే దిగుమతి అవుతోంది. గత ఏడాది మహారాష్ట్ర ఉల్లిపై ఆధారపడ్డాం. ఈ ఏడాది మెదక్, మహబూబ్‌నగర్‌తో పాటు కర్నూలు తదితర ప్రాంతాల నుంచి ఉల్లి ఎక్కువగా దిగుమతి అవుతోంది. పెద్ద ఉల్లిగడ్డ కిలో రూ.15 వరకు ధర పలుకుతోంది. చిన్నగడ్డకు రూ. 8 వరకు ఉంది. ఈ ఏడాది ఉల్లి ధరలు ఏమంత పెరగవు. కొత్త పంట రావడంతో ధరలు అదుపులోకి వచ్చాయి. గత ఏడాది కంటే ఈసారి దిగుమతులు రెట్టింపు అయ్యాయి. అదేవిధంగా లాక్‌డౌన్‌తో పాటు ఫంక్షన్స్, హోటల్స్‌ పూర్తి స్థాయిలో తెరుచుకొకపోవడంతో కూడా ఉల్లి వినియోగం అంతగా లేకుండాపోయింది.      – దామోదర్, స్పెషల్‌ గ్రేడ్‌ సెక్రటరీ,మలక్‌పేట్‌ మార్కెట్‌

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top