నిర్మాణంలోని ప్రాజెక్టుల గడువు... ఏడాది పొడిగింపు

One Year Extension For Under Construction Projects In Telangana - Sakshi

బిల్డర్లు, డెవలపర్లకు ఊరట!

2020 మార్చి 25 నుంచి 2021 మార్చి 31 వరకు గడువు తీరే ప్రాజెక్టులకు వర్తింపు

పొడిగింపునకు ప్రత్యేక ఫీజులు, అనుమతులు అవసరం లేదు

సాక్షి, హైదరాబాద్‌: బిల్డర్లు, డెవలపర్లకు శుభవార్త. కరోనా సృష్టించిన సంక్షోభంతో కుదేలైన స్థిరాస్తి రంగ వ్యాపారాన్ని ప్రోత్సహించడానికి రాష్ట్ర ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌తో ఇటీవల స్థిరాస్తి వ్యాపార సంఘాల ప్రతినిధులు సమావేశమై చేసిన పలు విజ్ఞప్తులను రాష్ట్ర ప్రభుత్వం పరిగణనలోకి తీసుకొని పలు వెసులుబాట్లను కల్పించింది. ఈ మేరకు రాష్ట్ర పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శి అరవింద్‌ కుమార్‌ వేర్వేరు ఉత్తర్వులు జారీ చేశారు. కరోనా కట్టడి కోసం లాక్‌డౌన్‌ అమలు చేయడంతో కూలీలు స్వస్థలాలకు వెళ్లిపోయారు. దీంతో స్థిరాస్తి ప్రాజెక్టుల పనులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి.  

కూలీలు లేక జాప్యం 
నిర్దేశిత గడువులోగా ఈ ప్రాజెక్టుల నిర్మాణం పూర్తి చేయాల్సి ఉండగా, కూలీలు లేకపోవడంతో పనులు పూర్తికాకున్నా గడువు ముగిసిపోయే పరిస్థితి ఏర్పడింది. దీన్ని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం నిర్మాణంలోని ప్రాజెక్టుల గడువును మరో ఏడాది పాటు పొడిగించింది. 2020 మార్చి 25 నుంచి 2021 మార్చి 31 మధ్యకాలంలో గడువు పూర్తి కానున్న ప్రాజెక్టుల గడువు ఆటోమేటిక్‌గా మరో ఏడాది పాటు పొడిగించిందని, ప్రత్యేకంగా ఎలాంటి ఫీజులు/ చార్జీలు చెల్లించాల్సిన అవసరం లేదని పురపాలక శాఖ స్పష్టం చేసింది. సంబంధిత యజమాని/ డెవలపర్‌ దీని కోసం దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం కూడా లేదని తెలిపింది. ఈ మేరకు అరవింద్‌కుమార్‌ ఈ నెల 8న ఉత్తర్వులు జారీ చేశారు.  

ఇంపాక్ట్‌ ఫీజు వాయిదాల పొడిగింపు...     
భవన నిర్మాణ అనుమతుల కోసం చెల్లించాల్సిన ‘సిటీ లెవల్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఇంపాక్ట్‌ ఫీజు’ను వాయిదాల్లో చెల్లించేందుకు గతంలో కల్పించిన వెసులుబాటు ఈ ఏడాది మార్చి 7 తో ముగిసిపోగా, తదుపరి ఆదేశాలు జారీ చేసేవరకు ఈ వెసులుబాటు అమల్లో ఉంటుందని అరవింద్‌ కుమార్‌ ఈ నెల 6న ఉత్తర్వులిచ్చారు. ఈ అవకాశాన్ని వినియోగిం చుకోవడానికి భవన అనుమతుల జారీ సమయంలో వాయిదాలకు సంబంధించిన పోస్ట్‌ డేటెడ్‌ చెక్కులు ఇవ్వాలని, గ్రౌండ్‌/ఫస్ట్‌/సెకండ్‌ ఫ్లోర్‌లో 5% అదనపు స్థలాన్ని తనఖా రిజిస్ట్రేషన్‌ చేయించాల్సి ఉంటుందన్నారు.

వాయిదాల్లో ఫీజులు చెల్లించవచ్చు.. 
కొత్త భవన, లేఅవుట్‌ నిర్మాణ ప్రాజెక్టులకు అన్ని రకాల అనుమతుల కోసం జీహెచ్‌ఎంసీ/హెచ్‌ఎండీఏకు చెల్లించాల్సిన బిల్డింగ్‌ పర్మిట్‌ ఫీజు, బెటర్మెంట్‌ చార్జీలు, డెవలప్‌మెంట్‌ చార్జీలు, క్యాపిటలైజేషన్‌ చార్జీలతో పాటు ఇతర అన్ని చార్జీలను నాలుగు సమాన అర్ధవార్షిక వాయిదాల్లో చెల్లించేందుకు వెసులుబాటు కల్పించింది. 2021 మార్చి 31 వరకు పొందే అన్ని అనుమతులకు ఈ వెసులుబాటును వినియోగించుకోవచ్చు. 2021 మార్చి 31 నాటికి పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులతో పాటు స్వీకరించిన కొత్త దరఖాస్తులకు ఈ ఉత్తర్వులు వర్తించనున్నాయి.

అనుమతులు పొందే సమయంలో తొలి వాయిదాను చెల్లించాల్సి ఉంటుంది. మిగిలిన మూడు వాయిదాలను నిర్దేశిత గడువులోగా చెల్లిస్తామని హామీ ఇచ్చేలా పోస్ట్‌ డేటెడ్‌ చెక్కులను సమర్పించాలి. చెల్లించాల్సిన ఫీజుల వివరాలను తెలియజేస్తూ లేఖ జారీ చేసిన 30 రోజుల్లోగా తొలి వాయిదా చెల్లించాలి. భవనం/ లే అవుట్‌ అనుమతులు పొందే సమయంలో బిల్డర్‌/ డెవలపర్‌ మొత్తం ఫీజులను ఒకేసారి చెల్లించాలని భావిస్తే ప్రోత్సాహకంగా మొత్తం చార్జీలపై 5 శాతం తగ్గింపును అమలు చేయనున్నారు. నిర్దేశిత గడువులోగా చెల్లించడంలో విఫలమైతే జాప్యం కాలానికి 12 శాతం వడ్డీతో కలిపి వాయిదాలను చెల్లించాల్సి ఉంటుంది.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top