‘ఆసరా’ కానరాక ఆగిన గుండె

old man sucide  - Sakshi

62 ఏళ్ల దివ్యాంగుడి బలవన్మరణం

సాక్షి, హైదరాబాద్‌: ఆసరా పింఛన్‌ ఏడాది కాలంగా ఆగిపోయింది.. ఆహార భద్రత కార్డులోనూ పేరు తీసేశారు.. దివ్యాంగ ధ్రువీకరణ పత్రం కోసం పలుమార్లు దరఖాస్తు చేసుకున్నా అధికారులు కనికరించలేదు.. ప్రభుత్వ సాయం కనుచూపు మేరలో కనిపించలేదు.. దీంతో బతుకుపై భరోసా దొరక్క ఆ వృద్ధుడు తనువు చాలించాడు. రంగారెడ్డి జిల్లా యాచారం మండలం పరిధిలోని కొత్తపల్లి గ్రామానికి చెందిన మహబూబ్‌ అలీ (62) గురువారం సాయంత్రం గ్రామ సమీపంలోని పొలంలో చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

శుక్రవారం ఉదయం గమనించిన గ్రామస్తులు కుటుంబ సభ్యులకు, పోలీసులకు సమాచారం అందించారు. వారు చెప్పిన వివరాల ప్రకారం.. కూలీ పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించే అలీకి సర్కారు ఇచ్చే పింఛన్‌ ఏడాది కాలంగా నిలిచిపోయింది. రేషన్‌ కార్డులో అతని పేరునూ తొలగించారు. మళ్లీ చేరుస్తారో లేదో కూడా తెలియదు. పుట్టకతోనే ఒక కన్ను కనబడని తనకు దివ్యాంగ ధ్రువీకరణ పత్రం ఇవ్వాలని ఆయన కాళ్లరిగేలా తిరిగినా ఫలితం కానరాలేదు. దీంతో అతనికి కుటుంబ పోషణ భారమైంది.

ఈ నేపథ్యంలో తీవ్ర మనస్తాపానికి గురై జీవితంపై విరక్తితో తనువు చాలించాడు. ఇటీవలే అప్పు చేసి పెద్ద కూతురు వివాహం చేసిన అలీకి పెళ్లీడుకొచ్చిన మరో కూతురు ఉంది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ చంద్రకుమార్‌ తెలిపారు. కాగా పింఛన్‌ రావడంలేదన్న విషయాన్ని అలీ ఎప్పుడూ తన దృష్టికి తీసుకురాలేదని పంచాయతీ కార్యదర్శి తాండ్ర అశోక్‌ పేర్కొన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top