నేటి నుంచి సిటీ బస్సుల తగ్గింపు

Officials Planning To Reduce Number Of City Buses In City Within Three Days - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : నగరంలో సిటీ బస్సుల సంఖ్యను అధికారులు మూడు రోజుల్లో తగ్గించనున్నారు. గురువారం నుంచే కొద్దికొద్దిగా తగ్గిస్తూ శనివారం నాటికి వెయ్యి బస్సులు తొలగించాలని డిపోలకు ఆదేశాలు జారీ అయ్యాయి. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశాల మేరకు వెయ్యి బస్సులు తొలగించాలని అధికారులు ఇప్పటికే నిర్ణయించారు. డిపోల వారీగా తగ్గించే బస్సుల సంఖ్య తో జాబితా కూడా సిద్ధం చేశారు. హైదరాబాద్‌ రీజియన్‌లో 550, సికింద్రాబాద్‌ రీజియన్‌లో 450 బస్సులను ఈ జాబితాలో చేర్చారు.

కానీ దీనిపై అన్ని డిపోల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. చార్జీలు పెంపుతో ఆదాయం పెరుగుతున్నందున, అన్ని బస్సులు సరిగ్గా నడిపితే నష్టాలు చాలా వరకు తగ్గించొచ్చని, ఇప్పుడు ఒకేసారి వెయ్యి బస్సులను ఆపేస్తే ఆదాయం పడిపోతుందని, ప్రయాణికులకు ఇబ్బందులు ఎదురవుతాయని డిపో మేనేజర్లు అంటున్నారు. బస్సులను తగ్గించినా సిబ్బందిని తొలగించే పరిస్థితి లేనందున వారి వేతనాల రూపంలో ఖర్చు అలాగే ఉంటుందని, అందుకే ఈ నిర్ణయంపై పునరాలోచించుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. 

సరుకు రవాణాకు మళ్లింపు.. 
రద్దు చేయబోయే బస్సులను త్వరలో ప్రారంభించబోయే సరుకు రవాణా విభాగానికి బదిలీ చేయనున్నట్లు సమాచారం. ప్రయాణికులపై తీవ్ర ప్రభావం చూపే నిర్ణయమే అయినా.. దాన్ని కొనసాగించాలనే అధికారులు నిర్ణయానికి వచ్చారు. సీఎం సమావేశంలో తీసుకున్న నిర్ణయం కాబట్టి.. అమలు విషయంలో చకచకా ఏర్పాట్లు చేస్తున్నారు. కాగా, బస్సుల రద్దుతో ఆర్టీసీలో కొత్త గందరగోళం నెలకొననుంది. వెయ్యి బస్సు లు రద్దుచేస్తే దాదాపు 4 వేల మంది సిబ్బంది అదనంగా ఉంటారు.

ప్రస్తుతం ఆర్టీసీలో సగటు వేతనం 40 వేలు మించి ఉంది. ఈ 4 వేల మందికి పనిలేకపోగా వారికి ఊరికే వేతనం చెల్లించాల్సి వస్తుంది. ఇదో పెద్ద సమస్యగా పరిణమించనుంది. ఈ నేపథ్యంలో అదనంగా మారే సిబ్బందిని ఇతర విభాగాలకు తరలించేందుకు ఉన్న అవకాశాలను అధికారులు పరిశీలిస్తున్నారు. ప్రస్తుతం పోలీసు శాఖలో డ్రైవర్లకు కొరత ఉంది. దీంతో బస్సుల రద్దుతో అదనంగా మారే 2 వేల మందికి పైగా డ్రైవర్లను పోలీసు విభాగం, అగ్నిమాపక విభాగం.. ఇలా కొరత ఉన్న విభాగాలకు బదిలీ చేసే అవకాశాన్ని పరిశీలిస్తున్నారు. ఇక కండక్టర్లను ఏం చేయాలన్న విషయంలో స్పష్టత రాలేదు. అయితే ఆర్టీసీ ఆధ్వర్యంలో కొత్తగా ప్రారంభించే సరుకు రవాణా విభాగంలో కొందరిని, ఆర్టీసీ పెట్రోల్‌ బంకుల్లో కొంత మందిని వినియోగించుకోవాలని చూస్తున్నారు.  

సీఎం పర్యవేక్షణలో ఆర్టీసీ.. 
సమ్మె నేపథ్యంలో గందరగోళంలో పడి చివరకు మనుగడ దిశగా అడుగులేస్తున్న ఆర్టీసీ ఇక స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ పర్యవేక్షణలోనే ముందుకు సాగబోతోంది. ఇకపై క్ర మం తప్పకుండా సీఎం ఆర్టీసీని సమీక్షించబోతున్నారు. అ లాగే, ఇటీవల ప్రగతి భవన్‌లో కార్మికులతో నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో సీఎం పలు కీలక నిర్ణయాలు తీసుకో వడంతోపాటు ఆర్టీసీపై వరాల జల్లు కురిపించిన విషయం తెలిసిందే. ఈ హామీల అమలు ప్రధానంగా మారింది.

ఇందులో భాగంగా డిపోకు ఇద్దరు చొప్పున ఉద్యోగులతో(కార్మికులు) సంక్షేమ మండళ్లను ఏర్పాటు చేయాలని సీఎం ఆత్మీ య సమావేశంలో ఆదేశించిన నేపథ్యంలో వాటిని అధికారు లు సిద్ధం చేశారు. ఐదారు రోజుల క్రితమే డిపోల వారీగా సభ్యుల వివరాలను డీఎంలు అందజేశారు. అన్ని డిపోలు, వర్క్‌షాపులు కలిపి దాదాపు 200 మంది పేర్లను అధికారులకు పంపారు. కండక్టర్ల ఉద్యోగ భద్రతకు కూడా కొత్తగా చర్యల అమలును ప్రారంభించారు. 

చెర్రీ రంగు కాకుండా.. 
మహిళా కండక్టర్ల యూనిఫామ్‌పై త్వరలో తుది నిర్ణయం తీ సుకోబోతున్నారు. ఇప్పటికే తమకు చెర్రీ పండు ఎరుపు రంగులో ఆప్రాన్‌ కావాలని కండక్టర్లు కోరారు. ఆ రంగు బెదురు గా ఉండటంతో పాటు, వస్త్రం విస్తృతంగా లభించదన్న ఉద్దేశంతో ప్రత్యామ్నాయ రంగును అధికారులు సూచిస్తున్నారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top