ఏయే గ్రామాలకు బస్సుల్లేవు..? 

Officials collecting field level details of RTC Buses - Sakshi

క్షేత్రస్థాయి వివరాలు సేకరిస్తున్న అధికారులు 

మంత్రి ప్రశాంత్‌రెడ్డి ఆదేశంతో పురమాయించిన ఎండీ 

త్వరలో ఉన్నతస్థాయి సమీక్ష.. వీలైనంత త్వరగా పలు గ్రామాలకు బస్సులు 

‘సాక్షి’కథనానికి స్పందించిన మంత్రి 

సాక్షి, హైదరాబాద్‌: ‘వెయ్యి ఊళ్లకు బస్సుల్లేవ్‌’ అనే శీర్షికన ‘సాక్షి’లో ప్రచురితమైన కథనానికి రవాణా శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి స్పందించారు. రాష్ట్రంలో బస్సు సౌకర్యం లేని గ్రామాల గురించి మంత్రి వాకబు చేయటంతో ఉన్నతాధికారులు ఆగ మేఘాల మీద వివరాల సేకరణకు పూనుకున్నారు. డిపోలవారీగా ఆర్టీసీ బస్సు వసతిలేని గ్రామాల వివరాలు పంపాలంటూ రీజినల్, డిపో మేనేజర్లను ఆదేశించారు. యాదాద్రి జిల్లా హాజీపూర్‌ గ్రామానికి బస్సు సౌకర్యంలేక విద్యార్థినులు లిఫ్ట్‌ అడిగి పాఠశాలకు వెళ్లే క్రమం లో కొందరు అత్యాచారాలు, హత్యలకు గురైన నేపథ్యంలో రవాణాశాఖ స్పందించింది.

రాష్ట్రవ్యాప్తంగా బస్సు సౌకర్యంలేని గ్రామాల గోడును కళ్ల ముందు నిలుపుతూ మూడురోజుల క్రితం ‘వెయ్యి ఊళ్లకు బస్సుల్లేవ్‌’శీర్షికన ‘సాక్షి’లో కథనం ప్రచురితమైన విషయం తెలిసిందే. ఎంపీటీసీ ఎన్నికల బిజీలో ఉన్న మంత్రి ఆర్టీసీ ఇన్‌చార్జి ఎండీ సునీల్‌శర్మతో ఫోన్‌లో మాట్లాడారు. సంబంధిత వివరాల గురించి వాకబు చేశారు. యుద్ధప్రాతిపదికన సాధ్యమైనన్ని గ్రామాలకు బస్సు వసతి కల్పించాలని, ఇందుకు కార్యాచరణ సిద్ధం చేయాలని ఆదేశించారు. త్వరలో దీనికి సంబంధించిన ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించనున్నట్టు మంత్రి పేర్కొన్నారు. అయితే, 844 గ్రామాలకు బస్సు సౌకర్యం లేదని ఆర్టీసీ గుర్తించింది. ఆ సంఖ్య అంతేనా, మరిన్ని గ్రామాలున్నాయా, అనుబంధ గ్రామాల పరిస్థితి ఏంటి, రహదారులు లేని గ్రామాలు, ప్రధాన రోడ్డుకు చేరువగా ఉన్న గ్రామాలు... తదితర వివరాలను అధికారులు సేకరిస్తున్నారు.  

ఏడాదిలో 58 గ్రామాలకు... 
గత ఆర్థిక సంవత్సరంలో తెలంగాణ వ్యాప్తంగా కొత్తగా 58 గ్రామాలను ఆర్టీసీ బస్సులతో అనుసంధానించినట్టు ఆర్టీసీ ఆపరేషన్‌ ఈడీ ఒక ప్రకటనలో తెలిపారు. గత సంవత్సరం మార్చి నాటికి రాష్ట్రంలో బస్స సౌకర్యం లేని గ్రామాల సంఖ్య 902 ఉండేదని, 2019 మార్చి నాటికి ఆ సంఖ్యను 844 కు తగ్గించినట్టు పేర్కొన్నారు. వీటిల్లో 416 గ్రామాలకు రోడ్డు వసతి లేనందున వాటిని పక్కన పెట్టి, రహదారి వసతి ఉన్న 428 గ్రామాలకు సాధ్యమైనంత తొందరలో బస్సు వసతి కల్పించేందుకు చర్యలు తీసుకోవాల్సిందిగా సంబంధిత అధికారులను ఆదేశించినట్టు పేర్కొన్నారు. హాజీపూర్‌ గ్రామానికి కుషాయిగూడ డిపో నుంచి ఇప్పటికే బస్సులు ఆరు ట్రిప్పుల మేర నడుస్తుండగా అదనంగా మరో ట్రిప్పు పెంచామని, యాదగిరిగుట్ట నుంచి రెండు ట్రిప్పులు నడుస్తున్నాయని పేర్కొన్నారు.   

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top