
తనిఖీలు నిర్వహిస్తున్న అధికారులు
సిద్దిపేటజోన్ : పట్టణంలోని అక్షయ హోటల్‌లో విక్రయించిన బిర్యానిలో బ్యాండేజ్‌లు వచ్చాయంటూ ఆదివారం సోషల్ మీడియాలో కొన్ని ఫొటోలు చక్కర్లు కొట్టాయి. వార్త వైరల్ కావడంతో స్పందించిన మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్‌రెడ్డి ఆదేశాల మేరకు సానిటరీ ఇన్‌స్పెక్టర్ నగేష్, ఫుడ్ ఇన్‌స్పెక్టర్ రవీందర్‌రావుతో కలిసి హోటల్‌కు వెళ్లి తనిఖీలు చేశారు. ఒక దశలో హోటల్‌లో పని చేసే సిబ్బందిలో ఎవరికైనా గాయాలు అయ్యాయా అన్న కోణంలో సైతం వివరాలు సేకరించారు. వైరల్ అయిన వార్తలో వాస్తవం ఉందా లేదా అన్న అంశంపై దర్యాప్తు చేస్తామన్నారు.
పలు రెస్టారెంట్లలో తనిఖీలు..
అనంతరం పలు రెస్టారెంట్‌లు, హోటలలో తనిఖీలు చేశారు. హైదరాబాద్‌లోని అతిథి హోటల్‌లో నాణ్యత ప్రమాణాలు పాటించడం లేదని రూ. 3000 జరిమానాగా విధించారు. మెదక్ రోడ్డులోని చంద్రలోక్ హోటల్‌లో నాణ్యతా రహితంగా ఉన్న మాంసంను స్వాధీనం చేసుకున్నారు. రూ. 2000 జరిమానా విధించారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ.. మటన్, చికెన్‌లను ఫ్రీజ్‌లో నిల్వ పెట్టి తిరిగి వాటిని ప్రజలకు వినియోగించడం తగదన్నారు. ప్రజల ఆరోగ్యంతో చలగాటం ఆడితే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. వారి వెంట ఎన్విరాల్ మెంటల్ ఇంజనీర్ చందన్, ఉమేష్ తదితరులు ఉన్నారు.