మూడెకరాలు ముందుకు

Officials Are Trying to Buy Land for Distribution to SCs in Warangal District - Sakshi

జిల్లాలో ఎస్సీ కార్పొరేషన్‌ ద్వారా 487.37 ఎకరాల పంపిణీ

180 మంది దళితులకు లబ్ధి 

భూమి లేని నిరుపేదలకు చేయూత

వరంగల్‌ రూరల్‌: నిరుపేద దళితులు అభివృద్ధి చెందాలనేది రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం. వారి అభ్యున్నతి కోసం భూములు లేని కుటుంబాలకు ఎస్సీ కార్పొరేషన్‌ ద్వారా ప్రభుత్వం మూడెకరాల భూమి అందిస్తున్న విషయం విధితమే. అయితే ఈ పథకం అమలులో ఉమ్మడి జిల్లాలో రూరల్‌ జిల్లా ముందంజలో ఉంది. ఇప్పటికే 180 మందికి ఒకరికి మూడెకరాల చొప్పున పంపిణీ చేశారు. భూ పథకం కింద రైతులకు 487.37 ఎకరాలు జిల్లా ఎస్సీ కార్పొరేషన్‌ ద్వారా అందజేశారు. మరో 80 ఎకరాల భూమిని కొనుగోలు చేయడానికి అధికారులు మంతనాలు జరుపుతున్నారు. 

భూమి కొనుగోలుపై చర్చ
ఇటీవల కలెక్టరేట్‌లోని కాన్ఫరెన్స్‌ హాల్‌లో తెలంగాణ రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమీషన్‌ చైర్మన్‌ ఎర్రోళ్ల శ్రీనివాస్‌ ఎస్సీ కార్పొరేషన్‌ ద్వారా భూమి కొనుగోలుపై అధికారులు, ప్రజాప్రతినిధులతో చర్చించారు. జిల్లాలో భూ కొనుగోలు పథకం ముందంజలో ఉందని తెలిపారు. నర్సంపేట నియోజకవర్గంలో 350 ఎకరాల భూమిని ఇప్పటికే కొనుగోలు చేశామని, మరో 80 ఎకరాల భూమిని కొనుగోలుకు రైతులతో చర్చలు కొనసాగుతున్నాయని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి తెలిపారు. 

భూముల ధరలకు రెక్కలు
రైతు సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం రైతు బంధు పథకం అమలు, సాగు నీటిని రైతులకు సాగుకు అందించడానికి చర్యలు తీసుకోవడం మూలంగా భూముల ధరలు అమాంతం పెరిగిపోయాయి. దీంతో ఒక్కప్పుడు 3 నుంచి రూ.4 లక్షలకే ఎకరం భూమి లభించేది. ఇప్పుడు గ్రామాల్లో ఎకరానికి రూ.6 నుంచి 7 లక్షలకు ఎకరం ధర పెరిగింది. దీంతో మిగతా జిల్లాల్లో భూములు దొరకని పరిస్థితి ఉంది. 

భూ పంపిణీ వివరాలు ఇలా.
నర్సంపేట రెవెన్యూ డివిజన్‌లో 2014–15 నర్సంపేట మండలం బాంజీపేటలో ఏడుగురు దళితులకు 21 ఎకరా>ల ప్రభుత్వ భూమిని పంపిణీ చేశారు. 2015–16 నుంచి 2018 –19 వరకు 21 ఎకరాల ప్రభుత్వ భూమిని, 485.37 ఎకరాల ప్రైవేట్‌ భూములను 26.21 కోట్లు వెచ్చించి ప్రభుత్వం ఎస్సీ కార్పొరేషన్‌ ద్వారా భూమిలేని నిరుపేద దళిత కుటుంబాలకు అందజేసింది. ఇంకా నర్సంపేట రెవెన్యూ డివిజన్‌ లో మరో 80 ఎకరాల భూమిని కొనుగోలు చేయడానికి ఇటీవల నెక్కొండ మండలం చంద్రుగొండలో జాయింట్‌కలెక్టర్‌ రావుల మహేందర్‌రెడ్డి, నర్సంపేట ఆర్డీఓ ఎన్‌.రవి, జిల్లా ఎస్సీ కార్పొరేషన్‌ ఈడీ డి.సురేష్, ఫీల్డ్‌ లెవల్‌ సర్వే నిర్వహించి 50 ఎకరాల భూమిని సర్వే చేశారు.

ధరలు పెరిగినా కొనుగోలు చేస్తున్నాం 
జిల్లాలో భూమి లేని నిరుపేద దళితులకు మూడెకరాల భూమి కొనుగోలు పథకంలో భూముల సేకరణకు ప్రయత్నాలు చేస్తున్నాం. ఎకరం భూమి ధర ప్రస్తుతం రూ.8 నుంచి 10 లక్షలకు పెరిగింది. రైతు బంధు, సాగునీటి సౌకర్యం, ఉచిత విద్యుత్‌ కారణంగా భూములను అమ్మడానికి రైతులు సుముఖత వ్యక్తం చేయడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం ఎకరం భూమికి రూ.6 లక్షలకు మించి ఇవ్వడం లేదు. డబ్బులు పెంచాల్సిన అవసరం ఉంది.   – రావుల మహేందర్‌రెడ్డి, జాయింట్‌ కలెక్టర్‌ 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top