తొలగిన అడ్డంకులు

Obstacles Has Been Gone To Recuit Contract Employees - Sakshi

విద్యుత్‌ ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల క్రమబద్ధీకరణకు హైకోర్టు ఓకే

క్రమబద్ధీకరణను సవాల్‌ చేస్తూ దాఖలైన వ్యాజ్యాల కొట్టివేత

ఔట్‌సోర్సింగ్‌ సిబ్బందిని ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా చూడలేం..

ఉమాదేవి కేసులో సుప్రీం తీర్పు ఇక్కడ వర్తించదు

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ విద్యుత్‌ సంస్థల్లో పనిచేస్తున్న 23,667 మంది ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల సర్వీసులను క్రమబద్ధీకరించాలన్న ప్రభుత్వ నిర్ణయానికి అడ్డంకులు తొలగిపోయాయి. ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల క్రమబద్ధీకరణను సవాల్‌ చేస్తూ దాఖలైన వ్యాజ్యాలను ఉమ్మడి హైకోర్టు కొట్టేసింది. ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల సర్వీసు క్రమబద్ధీకరణ వల్ల తమకు అన్యాయం జరుగుతోందని, ఇది రాజ్యాంగం తమకు కల్పించిన హక్కులను హరించడమేనంటూ పలువురు నిరుద్యోగులు చేసిన వాదనను ఉన్నత న్యాయస్థానం తోసిపుచ్చింది. విద్యుత్‌ సంస్థలు పరిశ్రమ నిర్వచన పరిధిలోకి వస్తాయని, కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ వ్యవహారం పారిశ్రామిక వివాదాల చట్ట పరిధిలోకి వస్తుందని తెలిపింది.

తెలంగాణ విద్యుత్‌ సంస్థలకు, కార్మిక సంఘాలకు మధ్య పారిశ్రామిక వివాదాల చట్టం ప్రకారం ఓ ఒప్పందం కుదిరిందని, ఈ ఒప్పందం నుంచి ఇప్పుడు వెనక్కి వెళ్లమని చెప్పడం సాధ్యం కాదని స్పష్టం చేసింది. పిటిషనర్లు ఈ ఒప్పందాన్ని సవాల్‌ చేయలేదని, అందువల్ల క్రమబద్ధీకరణ విషయంలో ఏ రకంగానూ జోక్యం చేసుకోలేమని తేల్చిచెప్పింది. దొడ్డిదారిలో నియామకాలు జరపరాదంటూ ఉమాదేవి కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఇక్కడ వర్తించదని, అది కేవలం ఉద్యోగుల నియామకాలకు సంబంధించిందని తెలిపింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్‌ తొట్టతిల్‌ బి.రాధాకృష్ణన్, న్యాయమూర్తి జస్టిస్‌ వి. రామసుబ్రమణియన్‌లతో కూడిన ధర్మాసనం మంగళవారం తీర్పు వెలువరించింది.

ఇప్పటికే తమ సంస్థల్లో పనిచేస్తున్న సుమారు 21 వేల మంది ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులను విలీనం చేసుకోవాలన్న విద్యుత్‌ సంస్థల నిర్ణయాన్ని సవాల్‌ చేస్తూ హైదరాబాద్‌కు చెందిన శ్రావణ్‌కుమార్‌ అనే నిరుద్యోగి హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్‌) దాఖలు చేశారు. ఇదే అభ్యర్థనతో మరికొందరు నిరుద్యోగులూ పిటిషన్లు వేశారు. ఈ వ్యాజ్యాలపై విచారణ జరిపి తీర్పు వాయిదా వేసిన ధర్మాసనం మంగళవారం తీర్పు వెలువరించింది.

ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా పరిగణించలేం...
‘తెలంగాణ విద్యుత్‌ సంస్థల్లో నియామకం, కాంట్రాక్ట్‌ ఉద్యోగుల క్రమబద్ధీకరణ రాజ్యాంగం ప్రకారం ప్రభుత్వ ఉద్యోగంతో సమానంగా పరిగణించాలన్న పిటిషనర్ల వాదనను ధర్మాసనం తోసిపుచ్చింది. రాజ్యాంగంలోని అధికరణ 16 క్లాజ్‌ 1, 2 ప్రకారం విద్యుత్‌ సంస్థల్లో పనిచేసే కార్మికుల సేవల క్రమబద్ధీకరణను ప్రభుత్వ ఉద్యోగంతో సమానంగా పరిగణించలేమని తేల్చిచెప్పింది. పారిశ్రామిక వివాదాల చట్టం ప్రకారం తెలంగాణ విద్యుత్‌ సంస్థలు పరిశ్రమ పరిధిలోకి వస్తాయి. కాబట్టి అటు విద్యుత్‌ సంస్థల యాజమాన్యాలకు, అందులో పనిచేసే కార్మికులకు పారిశ్రామిక వివాదాల చట్ట నిబంధనలు వర్తిస్తాయి. వారికి చట్ట నిబంధనల రక్షణ ఉంది’అని ధర్మాసనం తెలిపింది.

ఓటు బ్యాంకే ప్రభావితం చేస్తుంది.. అందుకే వారి వైపు మొగ్గు చూపారు...
‘విద్యుత్‌ సంస్థల్లో పనిచేస్తున్న వేల మంది కార్మికులు ఒక్కమాట మీద నిలబడి, సర్వీసుల క్రమబద్ధీకరణ కోసం డిమాండ్‌ చేస్తున్నారు. ఈ వేల మంది ఓటు బ్యాంకు, విధాన నిర్ణయకర్తల విధానాలను తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. గుర్తింపులేని నిరుద్యోగులతో పోలిస్తే గుర్తింపు ఉన్న కార్మిక శక్తి వైపే రాజకీయ కార్యనిర్వాహకులు మొగ్గుచూపుతారు. ఈ రెండు వర్గాలకు సంబంధించి హక్కులు, ప్రయోజనాల విషయంలో సమతౌల్యత పాటించడం న్యాయస్థానాలకు అంత సులభం కాదు.

తెలంగాణ విద్యుత్‌ సంస్థల్లో పనిచేస్తున్న కార్మికులు, ఔట్‌సోర్స్‌ ఉద్యోగులు ప్రభుత్వ ఉద్యోగులతో సమానమన్న పిటిషనర్ల వాదనను మేం సమర్థిస్తే ఇప్పటికే విద్యుత్‌ సంస్థల్లో పనిచేస్తున్న వేల మంది ఉద్యోగులను బయటకు పంపాల్సి ఉంటుంది. అలా చేస్తే ఈ వేల మంది ఉద్యోగుల రాజ్యాంగ హక్కులను హరించినట్లవుతుంది. దొడ్డిదారిన నియామకాలు చేపట్టరాదని స్టేట్‌ ఆఫ్‌ కర్ణాటక వర్సెస్‌ ఉమాదేవి కేసులో సుప్రీంకోర్టు చెప్పిన తీర్పును పిటిషనర్లు ప్రస్తావిస్తున్నారు. ఈ తీర్పు ప్రభుత్వ ఉద్యోగుల నియామకాలకు వర్తిస్తుందే తప్ప పారిశ్రామిక చట్టం కింద చేసే నియామకాలకు వర్తించదు’అని ధర్మాసనం తీర్పులో స్పష్టం చేసింది.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top