అంగన్‌వాడి.. ‘పోషకం’ ఏదీ?

Nutrition Food Unavailable In Anganwadi - Sakshi

లక్ష్యానికి తూట్లు

పేరుకు సన్నబియ్యం.. ముద్దగా అన్నం

గర్భిణులు, బాలింతలకు అందని పౌష్టికం

మెదక్‌ జిల్లాలో 3 నెలలుగా పాలు నిల్‌

సంగారెడ్డి, సిద్దిపేటలో జాడలేని మెనూ

పిట్టగుడ్లను తలపిస్తున్న కోడిగుడ్లు

అంగన్‌వాడి కేంద్రాల తీరుతెన్నులు

సాక్షి, మెదక్‌: అంగన్‌వాడి కేంద్రాల్లో పిల్లలు, గర్భిణులు, బాలింతలకు సరైన పౌష్టికాహారం అందటం లేదు. చాలాచోట్ల పిల్లలు, గర్భిణులకు మధ్యాహ్న భోజనంలో దొడ్డు బియ్యం, నీళ్లచారునే  వడ్డిస్తున్నారు. అంగన్‌వాడీలకు సన్నబియ్యం సరఫరా చేస్తామని ప్రభుత్వం ప్రకటించినా.. ఉమ్మడి మెదక్‌ జిల్లాలో ఎక్కడా సరఫరా అవుతున్న దాఖలాలు లేవు. కొన్నిచోట్ల సన్నబియ్యం పేరుతో సరఫరా చేస్తున్న బియ్యం వండిన తరువాత ముద్దగా మారుతోంది.  పలుచోట్ల పాలు సరఫరా కావంలేదు. దీనికితోడు పిల్లలు, బాలింతలు, గర్భిణులకు చిన్నసైజులో ఉన్న కోడిగుడ్డు అందజేస్తున్నారు. మరోవైపు కొన్ని అంగన్‌వాడీ కేంద్రాల్లో సిబ్బంది సరుకులను పక్కదారి పట్టించి సొమ్ము చేసుకుంటుంటే.. ఇంకొన్ని చోట్ల తక్కువ పరిమాణంలో సరుకులు అందచేసి లెక్కలు మాత్రం సరిగా రాయాలని అధికారులు ఒత్తిడికి గురిచేస్తున్న దాఖ లాలు బయటపడ్డాయి. ‘సాక్షి’ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పలు అంగన్‌వాడి కేంద్రాలను సందర్శించినపుడు పలు విషయాలు వెలుగుచూశాయి.

లో‘పాల’ కాంట్రాక్టర్లు
ఉమ్మడి మెదక్‌ జిల్లాలో 3,730 అంగన్‌వాడి కేంద్రాలు ఉన్నాయి. ఆయా కేంద్రాల్లో 1,99,213 మంది పిల్లలు ఉన్నారు. వీరితోపాటు 47,696 మంది గర్భిణులు, బాలింతలు ఉన్నారు. వీరందరికీ అంగన్‌వాడి కేంద్రాల ద్వారా పౌష్టికాహారం అందజేయాలి. ఆరు నెలల నుంచి మూడేళ్లలోపు పిల్లలకు బాలామృతం, 16 గుడ్లు అందజేస్తున్నారు. 3 నుంచి ఆరేళ్లలోపు పిల్లలకు మధ్యాహ్న భోజనంతోపాటు గుడ్లు అందజేస్తున్నారు. ఆరోగ్యలక్ష్మి పథకంలో భాగంగా బాలింతలు, గర్భి ణులకు మధ్యాహ్న భోజనం వడ్డిస్తున్నారు. అలాగే ఒక్కొక్కరికి రోజూ ఒక గుడ్డు, 200 మిల్లీలీటర్ల పాలు ఇస్తున్నారు. మెనూ ప్రకారం అన్నిరకాల కూరగాయలతో పిల్లలు, గర్భిణులు, బాలింతలకు పౌష్టికాహారం అందజేయాల్సి ఉంటుంది. అయితే ఉమ్మడి మెదక్‌ జిల్లాలోని అంగన్‌వాడి కేంద్రాల్లో ఎక్కడా మెనూ పూర్తి స్థాయిలో అమ లు కావటం లేదు. దీంతో పిల్లలు, గర్భిణులకు సరైన పౌష్టికాహారం అందటంలేదు. చిన్నారుల హాజరు శాతాన్ని ఎక్కువ సంఖ్యలో చూపి అంగన్‌వాడి సిబ్బంది వారి పేరిట సరుకులను తీసుకుని అ మ్ముకుంటున్నట్లు ఆరోపణలున్నాయి. గర్భిణి, బాలింతలకు ప్రతి ఒక్కరికి 200 మిల్లీలీటర్ల మేరకు పాలు ఇవ్వాలి. అసలు పాలు పూర్తి స్థాయిలో చాలా తక్కువ కేంద్రాలకు సరఫరా అవుతున్నాయి. మెదక్‌ మండలం అవుసలపల్లిలో మూడు మాసాలుగా గర్భిణీలు, బాలింతలకు పాలు ఇవ్వటంలేదు. దీనిని బట్టి పాల పంపిణీ ఎలా ఉందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు.

మెదక్‌ జిల్లాలో ఇలా...
మెదక్‌ జిల్లాలో మొత్తం 1076 అంగన్‌వాడీ కేంద్రాలు ఉన్నాయి. ఆయా అంగన్‌వాడీ కేంద్రాల్లో 39,525 మంది పిల్లలు, 10,624 మంది బాలింతలు, గర్భిణులు ఉన్నారు. ‘సాక్షి’ టేక్మాల్‌ మండలం ఎల్లంపల్లి అంగన్‌వాడి కేంద్రాన్ని పరిశీలించింది. ఇక్కడ  దొడ్డు బియ్యాన్నే వండి వార్చారు. పప్పునీళ్లతోనే పిల్లలు కడుపు నింపుకున్నారు. గుడ్లు అందచేయలేదు. అల్గాదుర్గం మండలం గొల్లకుంట అంగన్‌వాడి కేంద్రంలో 19 పిల్లలకు 8 మంది మాత్రమే ఉన్నారు. ఇక్కడ విధులు నిర్వహించాల్సి ఆయా కొద్దిరోజులుగా స్థానికంగా ఉండడం లేదు. దీంతో పిల్లల ఆలనాపాలనా కరువవుతోంది. పాపన్నపేట మండలంలోని లక్ష్మాపూర్‌ అంగన్‌వాడి కేంద్రంలో ఉదయం 11 దాటినా అంగన్‌వాడి టీచర్‌ జాడలేదు.సెంటర్‌లో 14 మంది విద్యార్థులకు ఒక్కరే హాజరై ఆడుకుంటున్నాడు. నలుగురు గర్భిణులు ఇక్కడ పేర్లు నమోదు చేసుకోగా ఇద్దరు, నలుగురు బాలింతలకు ఇద్దరే వస్తున్నట్లు అంగన్‌వాడి టీచర్‌ స్వరాజ్యలక్ష్మి తెలిపారు. నర్సాపూర్‌ నియోజకవర్గంలోని కౌడిపల్లి, కొల్చా రం, కౌడిపల్లి, శివ్వంపేట, చిలప్‌చెడ్‌ మండలాల్లోని 60 శాతం అంగన్‌వాడి కేంద్రాలు అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయి. వీటిలో మూత్రశాలలు, మరుగుదొడ్లు, నీటి సౌకర్యం లేకపోవడంతో పిల్లలు, బాలింతలు, గర్భిణులు ఇబ్బందులు పడుతున్నారు.

ఆ రెండు జిల్లాల్లో దొడ్డు బియ్యం.. నీళ్ల చారు
సంగారెడ్డి, సిద్దిపేట జిల్లాల్లోని అంగన్‌వాడి కేంద్రాల్లో చాలాచోట్ల పిల్లలు, గర్భిణులకు సరైన పౌష్టికాహారం అందజేయటం లేదు. కేంద్రాలకు వచ్చే మూడు నుంచి ఆరేళ్లలోపు పిల్లలకు మధ్యాహ్న భోజనం వడ్డించాలి. అయితే దొడ్డు బియ్యంతో వండిన అన్నం పెడుతుండటంతో తినేందుకు పిల్లలు ఇష్టపడటం లేదు. మధ్యాహ్న భోజనంలో కూరగాయలు లేదా పప్పు వడ్డించాలి. అయితే అంగన్‌వాడి సిబ్బంది నీళ్లచారుతోనే సరిపెడుతున్నారు. దానిని తినలేక పిల్లలు, గర్భిణులు ఇబ్బందులు పడుతున్నారు. కాంట్రాక్టర్లు నాసిరకమైన, నాణ్యతలేని సరుకులు సరఫరా చేస్తున్నట్లు ఆరోపణలున్నాయి. దీంతో అంగన్‌వాడిల్లో పిల్లలు, గర్భిణులకు పోషకాహారం గగనమవుతోంది. ముఖ్యంగా మెనూ ప్రకారం రోజూ వివిధ రకాల పౌష్టికాహారాన్ని అందజేయాలి. ఎక్కడా మెనూ సరిగా అమలవుతున్న దాఖలాల్లేవు. పిల్లలు, గర్భిణి, బాలింతలకు రోజూ గుడ్డు ఇవ్వాలి. గుడ్డు 50 గ్రాములు ఉండాలి. కాంట్రాక్టర్లు చిన్న సైజు గుడ్డును సరఫరా చేస్తున్నారు. పౌల్ట్రీల్లో తక్కువ ధరకు వచ్చే చిన్నసైజు కోడిగుడ్లను కొని వాటినే అం గన్‌వాడీలకు సరఫరా చేస్తున్నట్లు ఆరోపణలున్నాయి. ఈ రెండు జిల్లాల్లోని కేంద్రాలకు పా లు సక్రమంగా ఇవ్వటంలేదు. కాంట్రాక్టర్లు పా ల సరఫరాలో నిర్లక్ష్యం చేస్తున్నట్టు తేలింది.

అరకొర వసతుల నడుమ..
జిల్లాలోని చిన్నశంకరంపేట మండలంలో అంగన్‌వాడీ కేంద్రాల నిర్వహణ సక్రమంగా సాగడం లేదు. అంగన్‌వాడీలకు సొంత భవనాలకు లేకపోవడంతో చిన్న పిల్లలు, గర్బిణులు, బాలింతలకు ఇబ్బందులు తప్పడం లేదు. దీంతో వీరికి సక్రమంగా పౌష్టిక ఆహారం కూడా అందడం లేదు. అంగన్‌వాడీల నిర్వహణ తీరును పరిశీలించేందుకు బుధవారం ‘సాక్షి’ చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని మూడో అంగన్‌వాడీ కేంద్రాన్ని సందర్శించింది. ఈ కేంద్రం అద్దె భవనంలో  కొనసాగుతుంది.  చిన్నారుల హాజరు శాతం కూడా అంతంత మాత్రమే. హాజరు పట్టికలో ఉన్న సంఖ్యకు కేంద్రంలో ఉన్న చిన్నారుల సంఖ్యకు పొంతనేలేదు. 15 మంది విద్యార్థులకు గాను 8 మంది విద్యార్థులు మాత్రమే అక్కడ ఉన్నారు. ఇంకా ఇక్కడ చిన్నారులకు, గర్భిణులకు దొడ్డు బియ్యం అన్నం వడ్డిస్తున్నారు. బియ్యం నాణ్యత బాగాలేకపోవటంతో అన్నం తినేందుకు చిన్నారులు, గర్భిణులు, బాలింతలు సైతం దొడ్డు బియ్యం అన్నం తినేందుకు ఇబ్బంది పడుతున్నారు. దీనికితోడు మెనూ ప్రకారం కూరగాయలు, పప్పులు వడ్డించటంలేదు.  రెండు మాసాలుగా పాలు ఇవ్వడంలోనూ ఇబ్బంది ఉండగా ప్రస్తుతం మాత్రం గర్భిణులకు, బాలింతలకు అందజేస్తున్నారు. అయితే కోడిగుడ్లు సరిగ్గా ఇవ్వడం లేదు.  చిన్నసైజు కోడిగుడ్లనే ఇస్తున్నారని లబ్ధిదారులు వాపోతున్నారు. అలాగే ఆహారం రుచిరకరంగా ఉండడం లేదని పిల్లలు, గర్భిణులు, బాలింతలు చెబుతున్నారు. ఈ విషయమై అంగన్‌వాడీ ఐసీడీఎస్‌ సూపర్‌వైజర్‌ శారదను వివరణ కోరగా అంగన్‌వాడీ కేంద్రాల్లో మెనూ ప్రకారం పిల్లలు, గర్భిణులకు, బాలింతలకు పౌష్టిక ఆహారం అందేలా చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top