ఏప్రిల్‌ 1 నుంచి షోరూంల్లోనే నంబర్‌ ప్లేట్‌

Number plate in the showroom from April 1 - Sakshi

బిగిస్తేనే బండి బయటకు... 

తప్పించుకోవడం ఇక కుదరదు 

నాణ్యతలేని హైసెక్యూరిటీ ప్లేట్లు 

సులువుగానే విరిగిపోతున్న వైనం 

దృష్టిసారించని ఆర్టీఏ అధికారులు 

సాక్షి, హైదరాబాద్‌: హైసెక్యూరిటీ నంబర్‌ ప్లేట్ల విషయంలో రాష్ట్ర రవాణా శాఖ సరికొత్త నిర్ణయం తీసుకుంది. వాహనానికి హై సెక్యూరిటీ నంబర్‌ ప్లేట్‌ బిగించుకోవడం తప్పనిసరయినా.. కొందరు వీటిపై ఆసక్తి చూపించడం లేదు. దీంతో ఇలాంటి వారు సైతం విధిగా హై సెక్యూరిటీ నంబర్‌ ప్లేట్‌ బిగించుకోవాలన్న ఆలోచనతో షోరూంల్లోనే వీటిని బిగించేలా రవాణా శాఖ ఇటీవల ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే ప్రతీ వాహనానికి సంబంధించిన సాంకేతిక వివరాలతోపాటు, వాహన యజమాని వ్యక్తిగత వివరాలు పొందుపరిచేలా.. బయోమెట్రిక్‌ యంత్రాలు సమకూర్చుకోవాలని షోరూంలకు ఆదేశాలు జారీ చేసింది. హైసెక్యూరిటీ ప్లేట్ల విషయంలోనూ ఇదే విధానం పాటించనుంది. ఇకపై షోరూంల్లో రిజిస్ట్రేషనయ్యే బైకులు, కార్లు, తదితర నాన్‌ట్రాన్స్‌పోర్టు వాహనాలకు హైసెక్యూరిటీ ప్లేట్లు అక్కడే బిగించి బయటకు పంపుతారు. 

హైసెక్యూరిటీ తప్పనిసరి ఎందుకు? 
వాహనాల విషయంలో పలువురు అవకతవకలకు పాల్పడటం, ఒకే నంబర్‌పై అనేక వాహనాలు నడపటం, పేలుళ్లకు చోరీ చేసిన వాహనాలు వినియోగించడం తదితర ఘటనలు పెరుగుతున్న దరిమిలా.. 2012లోనే హైసెక్యూరిటీ ప్లేట్ల బిగింపును ప్రభుత్వం తప్పనిసరి చేసింది. 2015, డిసెంబర్‌ నాటికి పాత, కొత్త వాహనాలకు వీటిని తప్పనిసరి చేసింది. అయితే, అప్పటి నుంచి కొత్త వాహనాలకు మాత్రమే వీటిని బిగిస్తున్నారు. బైక్‌కు రూ.245, ఆటోకు రూ.400, కారుకు రూ.619 వసూలు చేస్తున్నారు. షోరూంలో వాహనం కొనుగోలు సమయంలోనే ఈ రుసుము చెల్లించాలి. నంబర్‌ప్లేట్‌ సిద్ధం కాగానే వాహనదారుడికి ఎస్‌ఎమ్‌ఎస్‌ వస్తుంది. అపుడు వెళ్లి దాన్ని బిగించుకోవాలి. అసలు ఇలాంటి వాహనాలకు ఆర్‌సీలు పంపడం వల్లే వాహనదారులు కొందరు హైసెక్యూరిటీ నంబర్‌ ప్లేట్లపై ఆసక్తి చూపడం లేదని తెలంగాణ ఆటోమోటార్స్‌ యూనియన్‌ ప్రధాన కార్యదర్శి దయానంద్‌ ఆరోపించారు. వాస్తవానికి ఇలాంటి వాహనాలకు చలానాలకు బదులు సీజ్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. 

అమలులో అనేక లోపాలు.. 
వాస్తవానికి ఈ హైసెక్యూరిటీ నంబర్‌ ప్లేట్లు చాలా పలుచగా ఉన్నాయని విమర్శలున్నాయి. వీటిని పిల్లలు సైతం వంచడం లేదా పీకేయడం సులువుగా చేస్తున్నారు. దీంతో ఈ ప్లేట్లు అమర్చాక పట్టుమని 10 నెలలు కూడా ఉండటం లేదని వాహనదారులు వాపోతున్నారు. మరోవైపు ఇవి ఆకర్షణీయంగా లేవన్న కారణంతో యువకులు చాలామంది బిగించుకోవడానికి ముందుకు రావడం లేదు. దీంతో చాలా వరకు హైసెక్యూరిటీ నంబర్‌ప్లేట్లు ఆర్టీఏ కార్యాలయాల్లో మూలకు పడుతున్నాయి. ట్రాఫిక్‌ చలాన్ల నుంచి తప్పించుకోవడానికి కొందరు నంబర్‌ప్లేట్లను వంచడం, విరగ్గొట్టడం చేస్తున్నారు.  ఈ నంబర్‌ ప్లేట్‌ రెండోసారి బిగించుకోవాలంటే ఎఫ్‌ఐఆర్‌ తప్పనిసరి. ఈ తతంగమంతా ఎందుకులే అని వాహనదారులు వారే కొత్త ప్లేట్‌ వేయించుకుంటున్నారు. హైసెక్యూరిటీ నంబర్‌ప్లేట్‌ లేకుండా తిరిగినప్పుడు ట్రాఫిక్, ఆర్టీఏ అధికారులు చలానా రాస్తారు. అయినా.. వాహనదారులు చలానాలు కడుతున్నారు తప్ప.. వీటిని బిగించుకోవడంపై ఆసక్తి చూపడం లేదు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top