ఏడు జిల్లాల్లో ఎస్‌జీటీ పోస్టులు సున్నా!

No SGT Posts in seven districts in Telangana state

మరో 8 జిల్లాల్లో 11లోపే..     మరో 3 జిల్లాల్లో 50 లోపే..  

స్కూల్‌ అసిస్టెంట్‌ పోస్టులూ

ఆరు జిల్లాల్లో 10లోపే 15 జిల్లాల్లో 50 కన్నా తక్కువ

తెలుగు మీడియం పోస్టుల పరిస్థితిది  

పోస్టుల్లేని జిల్లాలకు అదనపు పోస్టులు ఇవ్వాలని అభ్యర్థుల విజ్ఞప్తి

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో ఉపాధ్యాయ నియామకాల నోటిఫికేషన్‌లో పేర్కొన్న పోస్టులపై అభ్యర్థులు అంచనాల్లో పడ్డారు. తమ జిల్లాల్లో పోస్టుల పరిస్థితిని చూసి పెదవి విరుస్తున్నారు. కొన్ని జిల్లాల్లో పోస్టులే లేకపోగా.. చాలా జిల్లాల్లో తక్కువ పోస్టులు ఉండటంపై ఆవేదన చెందుతున్నారు. సెకండరీ గ్రేడ్‌ టీచర్‌ పోస్టుల కోసం 1.5 లక్షల మంది అభ్యర్థులు ఎదురుచూస్తుండగా, స్కూల్‌ అసిస్టెంట్‌ పోస్టుల కోసం దరఖాస్తు చేసేవారు 2.5 లక్షల మందికి పైగా ఉన్నారు.  నోటిఫికేషన్‌లో స్కూల్‌ అసిస్టెంట్‌ పోస్టుల సంఖ్య దారుణంగా ఉండటంతో అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. పోస్టులు లేని జిల్లాల్లో సప్లిమెంటరీ నోటిఫికేషన్‌ ద్వారా అదనంగా పోస్టులు ఇచ్చి న్యాయం చేయాలని కోరుతున్నారు.ఇలాగైతే చదివేదెలా?: అభ్యర్థుల్లో దాదాపు 95% మంది తెలుగు మీడియం పోస్టుల కోసమే ఎదురుచూస్తున్నారు.

ఇప్పుడు తెలుగు మీడియంలో.. అదీ ఏజెన్సీ ప్రాంత పోస్టులను తీసేస్తే (వీటికి మైదాన ప్రాంత అభ్యర్థులు అనర్హులు) ఇక మైదాన, పట్టణ ప్రాంతాల్లో పోస్టులే ఉండవని చెబుతున్నారు. రాష్ట్రంలోని 7 జిల్లాల్లో తెలుగు మీడియం ఎస్‌జీటీ పోస్టు ఒక్కటీ లేదు. మరో 8 జిల్లాల్లో ఏజెన్సీ పోస్టులను మినహాయిస్తే ఎస్‌జీటీ పోస్టులు 11లోపే ఉన్నాయి. ఇలా సాధారణ అభ్యర్థుల విషయంలో 15 జిల్లాల్లో పోస్టులు దాదాపుగా లేనట్టే లెక్క. మరో 3 జిల్లాల్లో 50లోపే పోస్టులు ఉండటంతో అభ్యర్థులు ఏం చేయాలో అర్థంకాని పరిస్థితిలో పడ్డారు. ఇక తెలుగు మీడియం స్కూల్‌ అసిస్టెంట్‌ పోస్టులదీ అదే పరిస్థితి. ఇవి ఆరు జిల్లాల్లో 10లోపు పోస్టులే ఉన్నాయి. మరో 15 జిల్లాల్లో స్కూల్‌ అసిస్టెంట్‌ పోస్టుల సంఖ్య 50లోపే ఉంది.

సామర్థ్యాల్లో తేడాతో నష్టం!
జిల్లా ఎంపిక కమిటీల (డీఎస్సీ) ద్వారా కాకుండా పబ్లిక్‌ సర్వీసు కమిషన్‌ ద్వారా ఈ పోస్టులు భర్తీ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ప్రతి జిల్లాలోని 20 శాతం ఓపెన్‌ కోటా పోస్టుల్లో అన్ని జిల్లాలకు చెందిన అభ్యర్థులు అర్హులే. అభ్యర్థులు ఇచ్చుకున్న ఆప్షన్‌ ప్రకారం.. మెరిట్‌ ఉన్న వారికి ఏదో ఒక జిల్లాలో ఆ పోస్టుల్లో ఎంపిక అవుతారు. రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం ఇది కరెక్టే. అయినా సామాజిక అంతరాలు, ప్రాంతాల వారీగా అభ్యర్థుల సామర్థ్యాల అంచనాకు వచ్చేసరికి ఇది నష్టం చేస్తుందని వెనుకబడిన జిల్లాలకు చెందిన అభ్యర్థులు వాపోతున్నారు. ఉదాహరణకు ఆసిఫాబాద్‌ జిల్లాకు చెందిన అభ్యర్థుల సామర్థ్యాలకు నల్లగొండ జిల్లాకు చెందిన అభ్యర్థుల సామర్థ్యాలకు మధ్య వ్యత్యాసం భారీగా ఉంటుందని చెబుతున్నారు. అలాంటపుడు నల్లగొండ జిల్లాకు చెందిన అభ్యర్థులు ఓపెన్‌ కోటాలో తమకు వచ్చే మెరిట్‌ ప్రకారం ఆసిఫాబాద్‌ జిల్లాలో ఎంపిక కాగలుగుతారు తప్ప ఆసిఫాబాద్‌ జిల్లాకు చెందిన అభ్యర్థులు నల్లగొండ జిల్లాలోని ఓపెన్‌ కోటాలో మెరిట్‌ ప్రకారం ఎంపిక కావడం అసాధ్యమని పేర్కొంటున్నారు. దీనివల్ల ఆసిఫాబాద్‌ జిల్లా అభ్యర్థులు ఓపెన్‌ కోటాలోని పలు పోస్టులను నష్టపోవాల్సి వస్తుందని వివరిస్తున్నారు.

అదనపు పోస్టులు ఇస్తేనే మేలు
ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో పోస్టులు లేని జిల్లాల్లో అదనపు పోస్టులు ఇవ్వాలని అభ్యర్థులు కోరుతున్నారు. లేదంటే ఏళ్ల తరబడి ఈ పోస్టుల కోసమే ప్రిపేర్‌ అవుతున్న తాము తీవ్రంగా నష్ట్రపోవాల్సి వస్తుందంటున్నారు. ప్రస్తుతం ప్రకటించిన పోస్టులు 2016 సెప్టెంబర్‌ నాటికి ఖాళీ అయినవే. ఆ తర్వాత నుంచి ఇప్పటివరకు ఖాళీ అయిన పోస్టులను, వచ్చే ఏడాది మార్చి వరకు ఖాళీ కాబోయే పోస్టులను కూడా భర్తీ చేయాలని కోరుతున్నారు.

కోర్టుకు వెళ్లేందుకు సిద్ధం?
కొన్ని జిల్లాల్లో పోస్టులు లేకపోవడం.. మరికొన్ని జిల్లాల్లో పోస్టులు తక్కువగా ఉండటమే కాకుండా కొత్త జిల్లాల ప్రకారం నోటిఫికేషన్‌ జారీ చేయడంపై కోర్టును ఆశ్రయించేందుకు రాష్ట్ర డీఎడ్, బీఎడ్‌ అభ్యర్థుల సంఘాలు సిద్ధమవుతున్నట్లు తెలిసింది. రాష్ట్రపతి ఉత్తర్వుల్లోని జోన్లలో 10 జిల్లాలనే పేర్కొన్నారు. అందులో 31 జిల్లాలు లేవు. ఈ నేపథ్యంలో రాష్ట్రపతి ఉత్తర్వుల్లో లేని కొత్త జిల్లాల ప్రకారం ఎలా నోటిఫికేషన్‌ ఇస్తారని కోర్టును ఆశ్రయించనున్నట్లు తెలిసింది.

పోస్టుల పరిస్థితి ఇదీ..
తెలుగు మీడియం ఎస్‌జీటీ పోస్టులు లేని జిల్లాలు: వరంగల్‌ అర్బన్, వరంగల్‌ రూరల్, జనగాం, నల్లగొండ, సూర్యాపేట, యాదాద్రి, ఖమ్మం.
మైదాన ప్రాంతంలో పది లోపే పోస్టులు ఉన్న జిల్లాలు: జగిత్యాల, పెద్దపల్లి, సిరిసిల్ల, జయశంకర్‌ భూపాలపల్లి, మహబూబాబాద్, భద్రాద్రి, సిద్దిపేట.
50లోపు పోస్టులు ఉన్న జిల్లాలు: ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్‌
మైదాన ప్రాంతంలో స్కూల్‌ అసిస్టెంట్‌ పోస్టులు 10లోపే ఉన్న జిల్లాలు: ఆదిలాబాద్, మంచిర్యాల, కరీంనగర్, నిర్మల్, నిజామాబాద్, భద్రాద్రి, వరంగల్‌ అర్బన్‌.50లోపు పోస్టులు ఉన్నవి: నిర్మల్, ఆసిఫాబాద్, పెద్దపల్లి, సిరిసిల్ల, కామరెడ్డి, భూపాలపల్లి, మహబూబాబాద్, సంగారెడ్డి, వనపర్తి, నాగర్‌ కర్నూల్‌; మేడ్చెల్, హైదరాబాద్‌; వరంగల్‌ రూరల్, జనగాం, ఖమ్మం.


 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top