గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతిభావంతులైన క్రీడాకారులను గుర్తించి వారిని మరింత ప్రోత్సహించాలనే లక్ష్యంతో 2010 - 11లో ప్రవేశపెట్టిన ‘పైకా’ పథకం అనుకున్న ఫలితాలివ్వడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.
ఖమ్మం అర్బన్, న్యూస్‌లైన్: గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతిభావంతులైన క్రీడాకారులను గుర్తించి వారిని మరింత ప్రోత్సహించాలనే లక్ష్యంతో 2010 - 11లో ప్రవేశపెట్టిన ‘పైకా’ పథకం అనుకున్న ఫలితాలివ్వడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. అందుకు కారణం ఈ పథకం కింద గ్రామాల్లో భవనాల నిర్మాణానికి కేటాయించిన నిధులు పూర్తిస్తాయిలో వినియోగించుకోవడంలో అధికారులు, పాలకులు విఫలమవడమేనని తెలుస్తోంది. ఖమ్మం అర్బన్ మండలంగా ఉన్నప్పుడు దాని పరిధిలోని 24 పంచాయతీలను పైకా పథకం కింద ఎంపిక చేశారు.
ఈ పథకం కింద మంజూరైన నిధుల ద్వారా ఆయా గ్రామాల్లో క్రీడల నిర్వహణకు శాశ్వత భవనాలు నిర్మించుకోవాలి. ఇందుకోసం 2011-12 సంవత్సరంలో సుమారు రూ.14.25వేల రూపాయలను విడుదల చేశారు. ఈ 24 గ్రామ పంచాయతీల్లో భవనాలు నిర్మించాలని నిర్ణయించారు. కానీ నేటి వరకు తొమ్మిది భవనాలు మాత్రమే పూర్తి చేశారు. మిగిలిన గ్రామాల్లో భవన నిర్మాణాల ఆనవాళ్లే లేవు. రెండు గ్రామాల్లో మాత్రం పునాదుల దశలోనే భవనాలు ఉన్నాయి.
ముందుకు రాని కాంట్రాక్టర్లు...
ఒక్కో భవన నిర్మాణానికి ప్రభుత్వం లక్షరూపాయలు మాత్రమే కేటాయించడంతో పనులు చేపట్టేందుకు కాంట్రాక్టర్లు ముందుకు రాలేదు. మరోపక్క గత రెండు సంవత్సరాలుగా పంచాయతీల్లో ప్రత్యేక అధికారుల పాలన కొనసాగడం వల్ల ఈ నిర్మాణాలపై ఎవరూ దృష్టిసారించడం లేదనే తెలుస్తోంది. పంచాయతీ ఎన్నికల తర్వాత నూతన సర్పంచ్‌ల ఆధ్వర్యంలో మండల ఏఈ తెనాలి సుబ్బారావు ఈ భవన నిర్మాణాలపై దృష్టి సారించారు.
స్థలం కరువు...
మండలంలోని అనేక పాఠశాలలకు సరైన క్రీడా స్థలమే కాక కనీసం తరగతి గదులకే సరిపడా స్థలం కరువైంది. దీంతో ఆయా పాఠశాలల్లో పైకా క్రీడల నిర్వహణ, శిక్షణ కష్టసాధ్యంగా మారింది. దీనిని దృష్టిలో ఉంచుకుని పీఈటీలు ఉన్న దగ్గర అవకాశం ఉన్న మరో పాఠశాలలో క్రీడలు నిర్వహిస్తున్నారు.
తొమ్మిది పంచాయతీల్లో భవనాలు పూర్తి...
ప్రస్తుతం రఘునాధపాలెం మండలంలోని 17 పంచాయతీల్లో కేవలం చిమ్మపుడి, కోటపాడు, కోయచెలక, శివాయిగూడెం, వీవీపాలెం, వేపకుంట్ల, గణేశ్వరం, ఈర్లపుడి, చింతగుర్తి పంచాయతీల్లో మాత్రమే భవనాల నిర్మాణాలు పూర్తయ్యాయి.
మండల స్థాయి భవనం పునాదుల్లోనే....
మండల కేంద్రమైన రఘునాధపాలెంలో రూ. 5లక్షలతో నిర్మించ తలపెట్టిన మండల స్థాయి పైకా భవనం కూడా పునాదుల దశలోనే ఉంది. ఒక్కో భవన నిర్మాణానికి కేవలం లక్షరూపాయలు మాత్రమే కేటాయించడంతో అవి సరిపోవనే ఉద్దేశంతో కాంట్రాక్టర్లు ముందుకు రావడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.
మొక్కుబడిగా క్రీడలు..
ఈ పథకం ప్రారంభమైనప్పటి నుంచి గత ఏడాది వరకు కేవలం మండలస్థాయి, జోనల్ స్థాయి క్రీడా పోటీలు నిర్వహించి మొక్కుబడిగా విద్యార్థులకు బహుమతులు అందజేసి చేతులు దులుపుకుంటున్నారు. గ్రామాల్లో ప్రతిభ ఉండి పాఠశాలకు రాని వారు ఎవరైనా ఉంటే వారిని గుర్తించి వెలుగులోకి తీసుకురావాలనే లక్ష్యం ఈ పథకానికి ఉన్నా అధికారులు నిర్లక్ష్యంగా వ్యహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. గ్రామీణ క్రీడాకారుల కోసం ఏర్పాటు చేసిన పైకా పథకం కేవలం పాఠశాల విద్యార్థులకే పరిమితం అవుతోందని పలువురు ఆరోపిస్తున్నారు.
ప్రోత్సాహం కరువు..
పీఈటీలు లేని పంచాయతీల్లో ప్రభుత్వ ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల ఉపాధ్యాయులను ‘క్రీడాశ్రీ’లుగా నియమించారు. వారికి గౌరవ వేతనం కింద రూ. 500 చెల్లిస్తున్నారు. కానీ మొత్తం సకాలంలో రాకపోవడంతో వారు గ్రామాల్లోని యువతీ యువకులను క్రీడల కోసం ప్రోత్సహించడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. సాయంత్రం 4.30 నిమిషాల నుంచి 6 గంటల వరకు బడిబయట పిల్లలకు క్రీడల్లో శిక్షణ ఇవ్వాలి. కానీ క్రీడాశ్రీలు ఇవేవీ పట్టించుకోవడం లేదు.
మూలుగుతున్న నిధులు..
ఇప్పటికే మండలంలో పైకా నిధులు రూ.14.34లక్షలు ఉన్నట్లు సంబంధిత అధికారులు చెబుతున్నారు. ఇన్ని నిధులు ఉన్నా అధికారులు వాటిపై దృష్టి సారించకపోవడంతో పైకా పథకం నిరుపయోగంగా మారుతోందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి పైకా భవనాల నిర్మాణం పూర్తయ్యేలా చూడాలని, ఈ పథకం లక్ష్యం నెరవేరేలా చూడాలని పలువురు క్రీడాకారులు కోరుతున్నారు.