సంక్రాంతికి ‘టోల్‌’ గుబులు!

NHAI Members Discussed About To Control Traffic At Toll Gate - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: టోల్‌ రుసుము చెల్లింపులో జరుగుతున్న జాప్యాన్ని నివారించటంతోపాటు నగదు రహిత చెల్లింపులను ప్రోత్సహించేందుకు ప్రారంభించిన ఎలక్ట్రానిక్‌ టోల్‌ చెల్లింపు విధానం ఇప్పుడు ప్రయాణికులకు చుక్కలు చూపిస్తోంది. ఫాస్టాగ్‌ ఉన్న వాహనాలు టోల్‌ గేట్ల వద్ద ఇబ్బంది లేకుండా దూసుకుపోతుండగా, ట్యాగ్‌ లేని వాహనాలు కిలోమీటర్ల మేర క్యూలో ఇరుక్కుపోవాల్సి వస్తోంది. ఇప్పుడే ఇలాఉంటే సంక్రాంతి సమయంలో పరిస్థితి ఏమిటని అధికారులు బెంబేలెత్తుతున్నారు. ఈ మేరకు ఎన్‌హెచ్‌ఏఐ అధికారులు మంగళవారం సమావేశమై దీనిపైనే చర్చించారు. సంక్రాంతిలోపు వీలైనన్ని ఫాస్టాగ్‌లు అమ్మేలా ప్రచారం చేయాలని  నిర్ణయించారు. రద్దీ నుంచి తప్పించుకోవాలంటే ఫాస్టాగ్‌ కొనాల్సిందేనంటూ వివరించే కరపత్రాలు పెద్ద సంఖ్యలో ముద్రించి   పంపిణీ చేయాలని భావిస్తున్నారు. ప్రస్తుతం నగదు చెల్లింపు వాహనాలు క్యూలలో చిక్కుకుపోవటం, ఫాస్టాగ్‌ వాహనాలు ఇబ్బంది లేకుండా వెళ్లిపోతున్న తీరుకు సంబంధించిన వీడియో  లను ప్రజల్లోకి తీసుకెళ్లాలని అనుకుంటున్నారు. ఇక రద్దీ ఎక్కువుంటే ఫాస్టాగ్‌ వాహనాల గేట్ల నుంచి సాధారణ వాహనాలు కూడా వెళ్లేందుకు అనుమతించాలని నిర్ణయించారు. కాగా, మంగళవారం జాతీయ రహదారులపై ఉన్న టోల్‌ ప్లాజాల మీదుగా వెళ్లిన వాహనాల్లో 53.59 శాతం ఫాస్టాగ్‌తో వెళ్లినట్టు ఎన్‌హెచ్‌ఏఐ ప్రాంతీయ అధికారి కృష్ణప్రసాద్‌ చెప్పారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top