‘సీతారామ’పై కొత్త ప్రశ్నలు

New questions on Seetharama Lift Irrigation Project - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సీతారామ ఎత్తిపోతల పథకంపై గోదావరి బోర్డు మళ్లీ కొత్త ప్రశ్నలు లేవనెత్తింది. ప్రాజెక్టు పాతదేనని తెలంగాణ స్పష్టం చేసినా, దాన్ని పరిగణనలోకి తీసుకోని బోర్డు మళ్లీ ప్రశ్నలు సంధించింది. నిర్మాణ ప్రాంతం, ఆయకట్టు, నీటి పరిమాణం, వ్యయం మారాయంటూ దానిపై సమాధానాలు కోరింది. ఈ మేరకు శుక్రవారం ఓ లేఖ ద్వారా రాష్ట్రాన్ని ఆదేశించింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో గోదావరి జలాలను తీసుకుంటూ రాజీవ్‌సాగర్, ఇందిరాసాగర్‌ దుమ్ముగూడెం ప్రాజెక్టులను చేపట్టిన విషయం తెలిసిందే.

రాష్ట్ర విభజన నేపథ్యంలో ఇందిరాసాగర్‌ ఇన్‌టేక్‌కు చెందిన పనులు ఏపీలోకి వెళ్లడం, రాజీవ్‌సాగర్‌ పనులన్నీ వన్యప్రాణి క్షేత్రంలో ఉండటంతో వీటిని సమీకృతం చేసి కొత్తగా సీతారామ ఎత్తిపోతలను చేపట్టిన విషయం తెలిసిందే. రాష్ట్ర పునర్విభజన చట్టం ప్రకారం ఏదేని కొత్త ప్రాజెక్టు చేపడితే దానికి బోర్డు, అపెక్స్‌ కౌన్సిల్‌ అనుమతి తప్పనిసరని, గ్రూప్‌ ఆఫ్‌ మినిస్టర్స్‌ (జీఓఎం)కు సమర్పించిన నివేదికలో ఈ ప్రాజెక్టు లేనందున దీన్ని కొత్త ప్రాజెక్టుగా గుర్తిస్తామని గోదావరి బోర్డు గతంలోనే తెలిపింది. దీనిపై వివరణ ఇచ్చిన తెలంగాణ కాళేశ్వరం మాదిరే దీన్ని రీ–డిజైన్‌ చేశామని అందుకే పాత ప్రాజెక్టుగా గుర్తించాలని కోరింది. దీనిపై బోర్డు  ప్రశ్నలు లేవనెత్తింది.

గతంలో రాజీవ్, ఇందిరా సాగర్‌ ప్రాజెక్టులకు కలిపి మొత్తంగా 33 టీఎంసీల నీటినే తీసుకోవాలని ఉందని, ప్రస్తుత రీ–డిజైన్‌లో దాన్ని 70 టీఎంసీలకు పెంచారని, ఇక గతంలో ఆయకట్టు 3.24లక్షలుండగా, దాన్ని  6.74లక్షల ఎకరాలకు పెంచారని, వ్యయం రెండు ప్రాజెక్టులకు కలిపి రూ.3,505 కోటుండగా, అది 13,384.80కోట్లకు పెరిగిందని, ఈ దృష్ట్యా దీన్ని కొత్త ప్రాజెక్టుగా ఎందుకు పరిగణించరాదని ప్రశ్నించింది.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top