లేటెస్ట్‌ పొల్యూషన్‌ టెస్ట్‌ | New Pollution Check Equipments In Hyderabad | Sakshi
Sakshi News home page

లేటెస్ట్‌ పొల్యూషన్‌ టెస్ట్‌

Jun 23 2018 8:55 AM | Updated on Sep 4 2018 5:44 PM

New Pollution Check Equipments In Hyderabad - Sakshi

సాక్షి, సిటీబ్యూరో: వాహన కాలుష్యాన్ని కచ్చితంగా నిర్థారించి ధృవీకరణ పత్రాలు అందజేసేందుకు రవాణాశాఖ అధునాతన కాలుష్య తనిఖీ స్టేషన్ల ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. వాహనాల నుంచి వెలువడే పొగలో ఏ రకమైన కాలుష్య కారకాలు.. ఏ స్థాయిలో ఉన్నాయో శాస్త్రీయంగా నిర్థారించే సాంకేతిక పరిజ్ఞానం ఈ స్టేషన్లలో ఉంటుంది. మొదట రవాణాశాఖ ప్రధాన కార్యాలయం ఖైరతాబాద్‌లోను, బండ్లగూడ ప్రాంతీయ రవాణా కార్యాలయంలోను ప్రయోగాత్మకంగా ఏర్పాటు చేయనున్నారు. వాహనాలకు అక్కడే పరీక్షలు చేసి ధ్రువ పత్రాలను అందజేస్తారు. ఒకవేళ కాలుష్య కారకాలు అతిగా వెలువడితే వాహనానికి మరమ్మతులు సూచిస్తారు. అప్పటికే దాని జీవితం కాలం ముగిస్తే సదరు వాహనాన్ని పక్కన పెట్టేస్తారు.

ఆ వాహనదారులు కూడా వాటిని వినియోగించకుండా చర్యలు తీసుకుంటారు. ప్రస్తుతం నగరంలో ఏర్పాటు చేసిన అధునాతన సిటీ బస్టాప్‌ల తరహాలోనే కాలుష్య తనిఖీ కేంద్రాలను (పొల్యూషన్‌ టెస్టింగ్‌ స్టేషన్స్‌)ను కూడా పబ్లిక్‌ ప్రైవేట్‌ భాగస్వామ్యలో పెట్రోల్‌ బంకులు, ఇతర కేంద్రా లకు విస్తరించి నిర్వహించాలని యోచిస్తున్నట్టు హైదరాబాద్‌ సంయుక్త రవాణా కమిషనర్‌ పాండురంగ్‌ నాయక్‌ ‘సాక్షి’తో చెప్పారు. ఖైరతాబాద్, బండ్లగూడ స్టేషన్ల ఫలితాలను పరిశీలించి ఆ తరువాత అన్ని చోట్లకు వీటిని విస్తరిస్తామన్నా రు. ఇలా ఏర్పడిన స్టేషన్లకు, మొబైల్‌ పొల్యూషన్‌ టెస్టింగ్‌ కేంద్రాలను ఆన్‌లైన్‌తో అనుసంధానం చేసి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కాలుష్య నియంత్రణ చర్యలు చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. నగరంలో ఏర్పాటు కానున్న వాహన కాలుష్య నియంత్రణ వ్యవస్థ మొత్తంగా రవాణా కమిషనర్‌ కార్యాలయంలోని ప్రధాన సర్వర్‌తో అనుసంధానమై ఉంటుంది. వాహనాల కాలుష్య కారకాల మోతాదులను ఇక్కడి నుంచే నిర్దేశించి ధృవీకరణ పత్రాలను అందజేస్తారు.

నియంత్రణ లేని కాలుష్యం నుంచి ఊరట..
ప్రస్తుతం నగరంలో సుమారు 350 వరకు మొబైల్‌ పొల్యూషన్‌ టెస్టింగ్‌ కేంద్రాలు, పొల్యూషన్‌ టెస్టింగ్‌ స్టేషన్లు ఉన్నాయి. కానీ వీటి ద్వారా నిర్వహించే తనిఖీల్లో ఎలాంటి ప్రామాణికత, శాస్త్రీయత లేదు. వాహనాల నుంచి వెలువడే పొగలోని కాలుష్య కారక పదార్థాలను అంచనా వేసి సర్టిఫికెట్లను అందజేసే కాలుష్య తనిఖీ కేంద్రాలు ఉత్తుత్తి పరీక్షలతో కాసులు పండించుకుంటున్నాయి. దీంతో ప్రజారోగ్యానికి ప్రమాదకరంగా పరిణమించిన వాహన కాలుష్యాన్ని నియత్రించాలనే ఉన్నతమైన లక్ష్యం పక్కదారి పడుతోంది.

రోడ్డుపైన అక్కడక్కడా దర్శనమిచ్చే ఈ మొబైల్‌ పొల్యూషన్‌ టెస్టింగ్‌ స్టేషన్లు వాహనదారులను నిలిపి పరీక్షలు చేస్తాయి. కాలుష్య నియంత్రణలో ఆ వాహనం ఎలాంటి ప్రమాణాలను అనుసరించేదీ ధృవీకరిస్తారు. ఈ టెస్టింగ్‌ స్టేషన్లు అందజేసే ధృవీకరణ పత్రాలనే రవాణాశాఖ ప్రాతిపదికగా భావిస్తుంది. ఇలాంటి కీలకమైన అంశంలో టెస్టింగ్‌ స్టేషన్లలో సింహభాగం ఎలాంటి పరీక్షలు లేకుండానే వాహనదారులకు ధృవీకరణ పత్రాలను అందజేస్తున్నాయి. అతి ప్రమాదకరమైన కార్బన్‌ మోనాక్సైడ్, హైడ్రోకార్బన్‌ వంటి పదార్థాలను వెలువరించే వాహనాలకు సైతం ఈ స్టేషన్లు పచ్చ జెండా ఊపుతున్నాయి. ఆధునిక మొబైల్‌ పొల్యూషన్‌ టెస్టింగ్‌ స్టేషన్ల వల్ల ఇలాంటి తప్పుడు పరీక్షలకు అవకాశం ఉండదు. ప్రజలకు వాహన కాలుష్యం నుంచి ఊరట లభిస్తుంది. 

నిర్థారణ ఇలా చేయాలి..
ప్రస్తుతం ఉన్న మొబైల్‌ టెస్టింగ్‌ స్టేషన్లలో గ్యాస్‌ అనలైజర్లు, స్మోక్‌ మీటర్ల సహాయంతో వాహనం నుంచి వెలువడే పొగ సాంధ్రత, దానిలోని కార్బన్‌ మోనాక్సైడ్, హైడ్రో కార్బన్, మీథెన్‌ స్థాయిని అనలైజర్ల సహాయంతో నిర్థారిస్తారు.
స్మోక్‌ మీటర్‌ సహాయంతో పొగ సాంధ్రతను నిర్థారిస్తారు. ఇది వాహనం సాధారణంగా ఉన్నప్పుడు 65 హార్ర్‌టిజింగ్‌ యూనిట్స్, రైజింగ్‌లో ఉన్నప్పుడు 75 హార్ర్‌టిజింగ్‌ యూనిట్స్‌ ఉంటుంది. ఈ ప్రమాణాలను అధిగమించి తిరిగే వాహనాలన్నీ ప్రమాదకరమైన కాలుష్యాన్ని వెదజల్లుతున్నట్లే.
కార్బన్‌ మోనాక్సైడ్‌ 0.5 శాతం, హైడ్రోకార్బన్‌ 750 పీపీఎం (పార్ట్స్‌ ఫర్‌ మిలియన్‌) చొప్పున ఉండాలి. ఈ ప్రమాణాల కంటే ఎక్కువ ఉండే వాహనాలన్నీ కాలుష్య కారక వాహనాల కిందే లెక్క.
కానీ ఆటో మొబైల్‌ రీసెర్చ్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఏఆర్‌ఏఐ) నిర్దేశించిన ఈ ప్రమాణాలను నగరంలోని మొబైల్‌ పొల్యూషన్‌ టెస్టింగ్‌ స్టేషన్లు పాటించడం లేదు.  
రవాణాశాఖ ఈ పత్రాలనే ప్రాణికంగా పాటిస్తోంది. దీంతో చట్టాల దారి చట్టాలది. కాలుష్యం దారి కాలుష్యానికి అన్నట్లుగా మారింది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement