ఏప్రిల్‌ నుంచి కొత్త పెన్షన్లు మంజూరు: సీఎస్‌

New pensions are granted from April - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: వచ్చే ఏడాది ఏప్రిల్‌ నుంచి అర్హులైన ప్రతి ఒక్కరికి కొత్తగా ఆసరా పెన్షన్‌ అందించడానికి ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. దీనిపై కార్యాచరణ ప్రణాళిక రూపొందించి, అమలు చేసేందుకు చర్యలు తీసుకోవాలని సీఎం కేసీఆర్‌ ఆదేశించారని బుధవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌కే జోషి తెలిపారు. గ్రామాల్లో వార్షిక ఆదాయం లక్ష యాభై వేలు, పట్టణాలలో రెండు లక్షల ఆదాయ పరిమితి పెన్షన్‌కు అర్హతగా నిర్ణయించారు. మూడు ఎకరాల తడి, 7.5 ఎకరాల మెట్ట భూములు ఉన్నవారు అర్హులన్నారు. ప్రతి కుటుంబంలో ఒకరికే అర్హత ఉంటుందని తెలిపారు. నేడు జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించి తగు సూచనలు జారీ చేయనున్నట్లు సీఎస్‌ తెలిపారు. ఆసరా పెన్షన్‌లను రూ.1,000 నుంచి రూ.2,016లకు, వికలాంగుల పెన్షన్‌లను రూ.1,500 నుండి రూ.3,016లకు పెంచే విషయంపై తగు చర్యలు తీసుకోవాలన్నారు.

కొత్త పెన్షన్ల గుర్తింపునకు నవంబర్‌ 2018లో ప్రచురించిన ఓటరు లిస్టులను వినియోగించుకోవాలని, ఓటరు జాబితాలో 57 నుండి 64 వరకు వయసు ఉన్న వారి వివరాలు తీసుకొని ఎస్‌కేఎఫ్‌ డేటాలో సరిచూసుకోవాలన్నారు. జిల్లా కలెక్టర్లు ఈ లిస్టులను గ్రామీణ ప్రాంతాల్లో పంచాయతీ సెక్రటరీలకు, పట్టణ ప్రాంతాల్లో బిల్‌ కలెక్టర్లకు ధ్రువీకరణకోసం అందిస్తారని తెలిపారు. అర్హులైన వారి లిస్టులో సంబంధిత లబ్ధిదారుని యూఐడీ నంబర్, బ్యాంక్‌ అకౌంట్‌ నంబర్, ఫొటోసహా సేకరించి, గ్రామస్థాయిలో ఎంపీడీవోలు, పట్టణ ప్రాంతాల్లో మునిసిపల్‌ కమిషనర్లు పరిపాలన అనుమతి నిమిత్తం జిల్లా కలెక్టర్లకు అందచేస్తారన్నారు. మార్గదర్శకాలకు అనుగుణంగా చర్యలు తీసుకొన్న తదుపరి అర్హుల జాబితాను సంబంధిత వెబ్‌సైట్‌లో ఉంచుతారని సీఎస్‌ తెలిపారు.   

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top