భూ యజమానులకు 60% వాటా!

New Guidelines For HMDA Land Pooling Scheme - Sakshi

హెచ్‌ఎండీఏ ల్యాండ్‌ పూలింగ్‌ పథకానికి కొత్త మార్గదర్శకాలు

10 శాతం పెరిగిన స్థల యజమానుల వాటా..

హెచ్‌ఎండీఏ వాటా 50 నుంచి 40 శాతానికి తగ్గింపు

తమ వాటా స్థలాలను అమ్మకం లేదా లీజుకు ఇచ్చుకోవచ్చు.. నాలా చార్జీలు, రిజిస్ట్రేషన్‌ ఫీజులు హెచ్‌ఎండీఏనే భరిస్తుంది..

ఉత్తర్వులు జారీ చేసిన పురపాలక శాఖ..  

సాక్షి, హైదరాబాద్‌: హైదరాబాద్‌ మహానగర అభివృద్ధి సంస్థ (హెచ్‌ఎండీఏ) చేపట్టే ల్యాండ్‌ పూలింగ్‌ ప్రాజెక్టులకు ఊతమిచ్చేలా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ల్యాండ్‌ పూలింగ్‌ కింద భూమిలిచ్చేందుకు ముందుకొచ్చే భూ యజమానులను ప్రోత్సహిం చేందుకు కొత్త మార్గదర్శకాలు జారీ చేస్తూ రాష్ట్ర పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శి అరవింద్‌కుమార్‌ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. పేద, మధ్య తరగతి కుటుంబాలకు సొంతింటి కల సాకారం చేసే లక్ష్యంగా హెచ్‌ఎండీఏ చేస్తున్న ప్రయత్నాలకు రాష్ట్ర ప్రభుత్వం మరింత వెసులుబాటు కలిగించే విధంగా విధానపరమైన నిర్ణయం తీసుకుంది.

► ల్యాండ్‌పూలింగ్‌ పథకం కింద సేకరించిన స్థలాల్లో ఇప్పటివరకు భూయజమానులు, హెచ్‌ఎండీఏల వాటా 50:50 శాతముండగా, తాజాగా భూయజమానుల వాటాను ప్రభుత్వం 60 శాతానికి పెంచి, హెచ్‌ఎండీఏ వాటాను 40 శాతానికి తగ్గించింది. దీంతో హెచ్‌ఎండీఏకు ల్యాండ్‌ పూలింగ్‌ పథకం కింద భూములిచ్చేందుకు వచ్చే వారికి పూర్తి స్థాయి భద్రతతో పాటు ప్రయోజనాలూ పెరగనున్నాయి.
► హెచ్‌ఎండీఏ వాటాలో 5 శాతాన్ని ఆర్థికంగా బలహీన వర్గాలు (ఈడబ్ల్యూ ఎస్‌), 10 శాతాన్ని దిగువ స్థాయి ఆదాయ వర్గాలు (ఎల్‌ఐజీ), 10 శాతం స్థలాన్ని మధ్య స్థాయి ఆదాయ వర్గాల (ఎంఐఈ) గృహ నిర్మాణ ప్రాజెక్టుల కోసం కేటాయిస్తారు.
► హెచ్‌ఎండీఏతో పాటు స్థలాలు పొందిన ఇతర యజమానులు జోన్ల నిబంధనలు పాటిస్తూ తమ వాటాలను రెసిడెన్షియల్‌/రెసిడెన్షియల్‌ కమ్‌ కమర్షి యల్‌/ఇన్‌స్టిట్యూషనల్‌/ఐటీ/కార్యాలయాలు/ఇతర అవసరాలకు వాడుకు నేలా కేటాయింపులు/ అమ్మకాలు/ వేలం/లీజుకు ఇచ్చుకోవచ్చు. 
► నాలా చార్జీలను హెచ్‌ఎండీఏనే భరించ నుంది. అలాగే హెచ్‌ఎండీఏకు కేటాయించిన స్థలాలకు సంబంధించిన రిజిస్ట్రేషన్, స్టాంపు డ్యూటీ ఫీజులనూ భరిస్తుంది.
► ఇటు భూవినియోగ మార్పిడి చార్జీలను సైతం హెచ్‌ఎండీఏ భరించనుంది.
► రిజర్వు స్థలాలు/ఓపెన్‌ స్థలాలకు ప్రహరీ గోడలు, ఫెన్సింగ్‌ ఏర్పాటు ఖర్చులను హెచ్‌ఎండీఏ భరిస్తుంది.
► హెచ్‌ఎండీఏ లేఔట్‌ డ్రాఫ్ట్‌ అప్రూవల్‌ అయిన నాటి నుంచి మూడు నెలల్లోపు ల్యాండ్‌ ఓనర్లకు ప్లాట్లు కేటాయిస్తారు. 
► ప్రస్తుతం హెచ్‌ఎండీఏ పరిధిలో 500 ఎకరాల్లో ల్యాండ్‌ పూలింగ్‌ ప్రాజెక్టులు పురోగతిలో ఉన్నాయి.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top