బోథ్‌: హామీల దారి..అలాగే మిగిలింది

 Neglect Of Allocation Funds To The Forest Department - Sakshi

అడెల్లి దారిని పట్టించుకోని  పాలకులు   

నాలుగేళ్లుగా నాన్చిన  ప్రజాప్రతినిధులు       

ఫారెస్ట్‌ అనుమతులు  వచ్చినా అలసత్వం

అటవీశాఖకు నిధుల కేటాయింపులో నిర్లక్ష్యం

రోడ్డు నిర్మాణం పూర్తయితే 40 కిలోమీటర్ల మేర దూరం తగ్గే అవకాశం

సాక్షి, బోథ్‌: హామీల దారి..అలాగే మిగిలింది. బోథ్‌ మండలకేంద్రం నుంచి రఘునాథ్‌పూర్‌ మీదుగా అడెల్లి దేవస్థానానికి రోడ్డు నిర్మాణంపై నీలినీడలు కమ్ముకున్నాయి. ఇచ్చిన హామీలు కలలుగానే మిగిలాయి. నాలుగున్నరేళ్లు గడిచిపోయాయి. పూర్తవుతుందనుకున్న రోడ్డు పూర్తి కాలేదు. దీంతో రోడ్డు నిర్మాణ పనులు నిలిచిపోయాయి. అడెల్లి రోడ్డు నిర్మాణ పనులు చేయిస్తామని నాయకులు మళ్లీ ఎన్నికల్లో హామీలు గుప్పించాయి. గతంలో అటవీ అనుమతులు లభించినా ఆర్‌అండ్‌బీ అధికారులు, అప్పటి ప్రజాప్రతినిధుల అలసత్వం తో రోడ్డు నిర్మాణ పనులకు సంబంధించి అటవీ శాఖకు ఇవ్వాల్సిన నిధులు ఇవ్వడంలో విఫలయ్యారు. దీంతో రోడ్డు పనుల అనుమతులు ఆగి పోయాయి. కేంద్ర ప్రభుత్వం షరతులతో కూడిన  స్టేజ్‌ వన్‌ అటవీ అనుమతులు జారీ చేసింది. దీంతో రోడ్డు పనులకు అడ్డంకులు తొలగిపోయాయని అంతా భావించారు. కానీ ప్రభుత్వం ఆర్‌ అండ్‌బీశాఖ నుంచి నిధులు ఇవ్వడంలో విఫలమవడంతో కథ మళ్లీ మొదటికొచ్చింది. 

మొదటిదశ అనుమతులు మంజూరు. 
అడెల్లి రోడ్డు నిర్మాణానికి ఇక్కడి ప్రజలు ఏళ్లుగా ఎదురుచూస్తున్నారు. తెలంగాణ ఏర్పడక ముం దు ప్రజాప్రతినిధులు రోడ్డు విషయమై పట్టించుకోలేదు. తెలంగాణ ఏర్పడిన తరువాత బోథ్‌ అటవీ రేంజ్‌ అధికారులు రోడ్డు నిర్మాణానికి ఎటువంటి అభ్యంతరం లేదని నో అబ్జెక్షన్‌ పత్రాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా అనుమతి కోసం జూన్‌ ఒకటో తేదీ, 2017న కేంద్ర ప్రభుత్వానికి విన్నవించింది. కేంద్ర ప్రభుత్వం పర్యావరణ, అటవీ, వాతావరణశాఖ సాధ్యాసాధ్యాలను పరిశీలించి 2017, ఆగస్టు 4వ తేదీన రోడ్డు నిర్మాణానికి పలు షరతులతో కూ డిన అనుమతులు మొదటి దశలో జారీ చేసింది. రోడ్డు నిర్మాణం కోసం రోడ్డు భవనాలశాఖకు దాదాపు 4.67 హెక్టార్ల అటవీ భూమి అవసరమవుతోంది. అటవీశాఖ కోల్పోతున్న భూమి, చెట్లు ఆశాఖ వారు మరోచోట అభివృద్ధి చేసుకోవాల్సి ఉంటుంది. వీటి అభివద్ధికి కావాల్సిన నిధులను రోడ్డు భవనాల శాఖ ఇవ్వాల్సి ఉంది. ఈ షరతులతో కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. రెండోదశలో రోడ్డు భవనాలశాఖ అటవీ శాఖకు అవసరమగు నిధులు కేటాయిస్తే రెండోదశలో పూర్తి స్థాయి అనుమతులు లభిస్తాయి. కాగా రోడ్డు పనులకోసం ఇప్పటికే రూ.4 కోట్ల యాభై ఐదు లక్షలు మంజూరై ఉన్నాయి. దీంతో రోడ్డు పనులు త్వరలోనే ప్రారంభమయ్యే అవకాశం ఉన్నా అవసరమగు నిధులు మంజూరు చేయడంలో ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి ప్రదర్శించింది. 

రోడ్డు నిర్మాణం పూర్తయితే తగ్గనున్న భారం...
రోడ్డు నిర్మాణం పూర్తయితే రెండు మండలాల మధ్య దూరం తగ్గనుంది. గతంలో అడెల్లి, సారంగాపూర్‌కు వెళ్లాలంటే దాదాపు 60 కిలోమీటర్ల దూరం ప్రయాణించాల్సి వచ్చేది. రోడ్డు పూర్తయితే బోథ్‌ సారంగాపూర్‌కు వెళ్లాలంటే కేవలం 20 కిలోమీటర్లు మాత్రమే ప్రయాణం చేయాల్సి ఉంటుంది. దాదాపు 40 కిలోమీటర్ల దూరభారం తగ్గనుంది. గత ఇరవై ఏళ్లుగా రోడ్డు నిర్మాణం చేపట్టాలని ఇక్కడి ప్రజలే డిమాండ్‌ చేశారు. మూడేళ్లక్రితం బోథ్‌ మండలంలోని కుచులాపూర్‌ వేంకటేశ్వర ఆలయం నుంచి రఘునాథ్‌పూర్‌ వరకు బీటీ రోడ్డు నిర్మించారు. అటవీ అనుమతులు లేకపోవడంతో పనులు నిలిపివేశారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top