ఎంవీఐ లంచం..​ వయా గూగుల్‌ పే | Sakshi
Sakshi News home page

ఎంవీఐ లంచం..​ వయా గూగుల్‌ పే

Published Wed, Aug 14 2019 8:57 AM

MVI Gouse Pasha Demand Bribe By GooglePay In Karimnagar RTA - Sakshi

సాక్షి, కరీంనగర్‌ : రవాణాశాఖ కరీంనగర్‌ జిల్లా పరిధిలో ఆయనే సుప్రీం. పేరుకు మోటార్‌ వెహికల్‌ ఇన్‌స్పెక్టర్‌ (ఎంవీఐ) అయినా... రవాణా శాఖ జిల్లా అధికారికి తగ్గని స్థాయి ఆయనది. జిల్లాల పునర్విభజన తరువాత నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాలకు పరిమితమైన కరీంనగర్‌కు ఆయనొక్కడే ఎంవీఐ. ఐదేళ్లుగా రెగ్యులర్‌ డిప్యూటీ ట్రాన్స్‌పోర్టు కమిషనర్‌ లేరు. ప్రస్తుతం ఆదిలాబాద్‌ డీటీసీ శ్రీనివాస్‌ ఇక్కడ ఇన్‌చార్జిగా వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎంవీఐదే ఇష్టారాజ్యం. మూడేళ్లలో పదవీ విరమణ చేయాల్సిన ఆయన వాహనాల తనిఖీ పేరిట సాగించే అవినీతి దందాకు సరికొత్త విధానాన్ని ఎన్నుకున్నారు. కేంద్ర ప్రభుత్వం చెబుతున్న నగదు రహిత లావాదేవీల విధానాన్ని లంచం వసూళ్లకు కూడా వాడుకున్నారు.

నిబంధనలు ఉల్లంఘించిన వాహనాల నుంచి వసూలు చేసే అపరాధ రుసుమును ‘గూగుల్‌ పే’ ద్వారా చెల్లించాలని డ్రైవర్లకు ఆదేశాలిచ్చారు. అయితే అది వెళ్లేది మాత్రం రవాణా శాఖకు కాకుండా సొంతానికి. ఇందుకోసం ప్రైవేటు సైన్యాన్ని కూడా నియమించుకున్నట్లు సమాచారం. ఇటీవల తిమ్మాపూర్‌ మండలం  మొగిలిపాలెం ఎంపీటీసీ భర్త అశోక్‌రెడ్డి నుంచి రూ.5 వేలు గూగుల్‌పే యాప్‌ ద్వారా ఎంవీఐ లంచం తీసుకున్నాడు. అలాగే వాహన తనిఖీ పేరిట పెద్ద ఎత్తున డబ్బులు పలు ఖాతాల్లో జమ చేయించుకున్నట్లు విచారణలో వెల్లడైంది. ఈ మేరకు అశోక్‌రెడ్డి డీటీసీకి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేయగా, మీడియాలో రవాణా శాఖలో జరుగుతున్న దందాపై కథనాలు రావడంతో కరీంనగర్‌ ఇన్‌చార్జి డీటీసీ శ్రీనివాస్‌ సదరు ఎంవీఐని రవాణాశాఖ కమిషనర్‌కు సరెండర్‌ చేశారు.

ఎంవీఐ గౌస్‌పాషా సరెండర్‌
కరీంనగర్‌ జిల్లా రవాణా శాఖ మోటార్‌ వెహికల్‌ ఇన్‌స్పెక్టర్‌ గౌస్‌పాషాపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో ఆయనను రవాణాశాఖ కమిషనర్‌కు సరెండర్‌ చేస్తున్నట్లు జిల్లా ఇన్‌చార్జి డీటీసీ శ్రీనివాస్‌ తెలిపారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇటీవల చోటు చేసుకున్న పలు సంఘటనలు, ఇతర ఫిర్యాదుల మేరకు జరిపిన ప్రాథమిక విచారణలో నిర్ధారణ అయిన అంశాల ఆధారంగా గౌస్‌పాషాను సరెండర్‌ చేసినట్లు తెలిపారు. ఈ మేరకు గుర్తించిన అంశాలపై పూర్తిస్థాయిలో రవాణాశాఖ కమిషనర్‌ విచారణ జరిపి చర్యలు తీసుకుంటారని పేర్కొన్నారు. కాగా, గౌస్‌పాషా సరెండర్‌తో ప్రస్తుతం జిల్లాలో రెగ్యులర్‌ ఎంవీఐ లేకుండా పోయినట్లయింది. 

మూడేళ్ల సర్వీస్‌.. పర్సనల్‌ గార్డుల నియామకం
సరెండర్‌ అయిన వీఎంఐకి ఇంకా మూడేళ్ల సర్వీస్‌ ఉంది. ఈ క్రమంలో విధుల్లో ఉన్న కాలంలో అందిన కాడికి దండుకోవాలనే ఆలోచనతో నిత్యం వాహనాల తనిఖీ పేరిట వసూళ్ల దందా సాగిస్తున్నట్లు సిబ్బంది చెబుతున్నారు. డీటీసీకి సైతం సమాచారం ఇవ్వకుండా తనే వాహనంలో వెళ్లి తనిఖీల దందా సాగిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రైవేటు వ్యక్తులను గార్డులుగా నియమించుకొని మరీ వాహనాలను నిలిపివేయించి, నిబంధనలు పాటించని వాహనదారుల నుంచి డబ్బులు తీసుకుని వదిలేస్తున్నట్లు ఆరోపణలున్నాయి. ఎవరైనా మీరెవరు..? మీ గుర్తింపు కార్డేది? అని ప్రశ్నిస్తే వెంటనే ఎంవీఐకి ఫోన్‌చేసి మాట్లాడిస్తారు. అధికారి స్వయంగా మాట్లాడి తానే వారిని నియమించానని, మీ పత్రాలు చూపించి వెళ్లాలని చెప్పి... వారికి డబ్బులు ఇచ్చి వెళ్లాని ఆదేశించేవారని తెలిసింది. ఇటీవల కూడా తిమ్మాపూర్‌ మండలం రామకృష్ణకాలనీలో సదరు పర్సనల్‌ హోంగార్డులు వాహనాలు ఆపి డబ్బులు వసూలు చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ విషయమై గతంలో కూడా ఉన్నతాధికారులకు  ఫిర్యాదులు వెళ్లాయి. కొత్తగూడెంలో పనిచేసిన సమయంలోనూ ఇదేరీతిన వ్యవహరించినట్లు సమాచారం. 

గూగుల్‌ పేతో పలు నెంబర్లకు మనీ ట్రాన్స్‌ఫర్‌
రవాణా అధికారులు జరిపిన ప్రాథమిక విచారణలో ఎంవీఐ లంచం తీసుకున్నాడని నిర్ధారణ అయినట్లు తెలిసింది. తన చేతికి కరెన్సీ నోట్లు అంటని విధంగా... నేరుగా డబ్బులు తీసుకోకుండా ‘గూగుల్‌ పే’ ద్వారా పలు బినామీ నంబర్లకు మనీ ట్రాన్స్‌ఫర్‌ చేయించుకున్నట్లు తేలింది. ఈ మేరకు రవాణాశాఖ అధికారులు శాఖాపరమైన చర్యలకు శ్రీకారం చుట్టారు. వాహనాల తనిఖీలో నిబంధనలు పాటించని వాహనాలపై వేసే అపరాధ రుసుము ప్రభుత్వ ఖజానాకు జమ కావాల్సి ఉండగా... తన సొంత ఖాతాలోకి మళ్లించుకున్నట్లు తేలింది. 

గతమంతా అవినీతిమయమే..
కరీంనగర్‌లో బాధ్యతలు నిర్వర్తిస్తున్న ఎంవీఐ గత చరిత్ర కూడా అవినీతిమయమే అని తెలుస్తోంది. గతంలో కొత్తగూడెం రవాణా శాఖ కార్యాలయంలో విధులు నిర్వహించిన సమయంలో వాహనదారుడి నుంచి లంచం తీసుకుంటూ నేరుగా ఏసీబీకి పట్టుపడ్డట్టు సమాచారం. దీంతో రవాణా అధికారులు ఈయనతోపాటు మరో ముగ్గురిని సస్పెండ్‌ చేశారు. దీంతో ఆయన ఉన్నతాధికారులు, రాజకీయ పలుకుబడి ఉపయోగించుకుని తిరిగి విధుల్లో చేరారు. అతడిని విధుల్లోకి తీసుకున్న అధికారులు కరీంనగర్‌ రవాణా కార్యాలయానికి బదిలీ చేశారు. 

Advertisement
 
Advertisement
 
Advertisement