టీఆర్‌ఎస్‌ అభ్యర్థుల ఖరారు!

Municipal Elections TRS Candidates Ready To Finalize - Sakshi

మున్సిపోల్స్‌లో వేగంగా పావులు కదుపుతున్న అధికార పార్టీ

నేడు టీఆర్‌ఎస్‌భవన్‌లో పార్టీ శాసనసభ్యులు, ఇన్‌చార్జుల సమావేశం

ముందురోజే హైదరాబాద్‌కుచేరుకోవాలని ఆదేశాలు జారీ..

బీ ఫారాల జారీ, గెలుపు వ్యూహాలపై సీఎం కేసీఆర్‌ దిశానిర్దేశం

సాక్షి, హైదరాబాద్‌: మున్సిపల్‌ ఎన్నికల నామినేషన్ల గడువుకు కేవలం రెండ్రోజుల వ్యవధి మాత్రమే మిగిలి ఉండ టంతో అధికార టీఆర్‌ఎస్‌ పార్టీ శరవేగంగా పావులు కదుపుతోంది. రిజర్వేషన్ల జాబితా వెలువడిన మరుక్షణం నుంచే అభ్యర్థుల ఎంపికపై దృష్టి సారించిన టీఆర్‌ఎస్, బుధవారం రాత్రికే అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను దాదాపు పూర్తి చేసింది. అభ్యర్థుల ఖరారు బాధ్యతను పార్టీ ఎమ్మెల్యేలకు పూర్తి స్థాయిలో అప్పగించడంతో వార్డులు, డివిజన్ల వారీగా రిజర్వేషన్‌ కేటగిరీలను దృష్టిలో పెట్టుకుని అభ్యర్థుల ఎంపిక కసరత్తు ముగింపు దశకు చేరుకుంది. పార్టీ టికెట్ల కోసం తీవ్ర స్థాయిలో పోటీ ఉండటంతో సర్వే లను ప్రామాణికంగా తీసుకుని ఎంపిక చేస్తున్నట్లు ఆశావహులకు ఎమ్మెల్యేలు సర్దిచెప్తున్నారు. టికెట్లు దక్కని నేత లు ఇతర పార్టీలోకి వెళ్లడమో, స్వతంత్రులుగా బరిలో నిలవడమో జరగకుండా ఎమ్మెల్యేలు బుజ్జగిస్తున్నారు. టికెట్‌ ఆశించి భంగపడిన ఔత్సాహికులు తమ నిర్ణయాన్ని ధిక్కరించకుండా అధికారిక అభ్యర్థి గెలుపు కోసం పనిచేసేలా నయానో భయానో ఒప్పిస్తున్నారు. మరోవైపు పార్టీ నియమించిన మున్సిపల్‌ ఎన్నికల ఇన్‌చార్జులు కూడా ఎప్పటికప్పుడు క్షేత్ర స్థాయి పరిస్థితిని పార్టీ అధిష్టానానికి నివేదిస్తున్నారు.  

నేడు తెలంగాణ భవన్‌లో కీలక భేటీ 
మున్సిపల్‌ ఎన్నికలకు సంబంధించి గురువారం టీఆర్‌ ఎస్‌ పార్టీ రాష్ట్ర కార్యాలయం తెలంగాణభవన్‌లో కీలక భేటీ జరగనుంది. ఉదయం 10 గంటలకు జరిగే సమావే శంలో పార్టీ అధినేత, సీఎం కె.చంద్రశేఖర్‌రావు పాల్గొం టారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఢిల్లీలో గురువారం కేంద్ర పౌర విమానయాన శాఖ ఆధ్వర్యంలో జరిగే వింగ్స్‌ ఇండియా 2020 సన్నాహక సమావేశంలో పాల్గొనేందుకు వెళ్తున్నందున పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్, మున్సిపల్‌ శాఖ మంత్రి కేటీ రామారావు తెలంగాణ భవ న్‌లో జరిగే సమావేశంలో పాల్గొనే అవకాశం కనిపించడం లేదు. కాగా గురువారం తెలంగాణభవన్‌లో జరిగే సమావేశానికి మున్సిపల్‌ ఎన్నికలు జరిగే అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలను ఆహ్వానించారు. పార్టీ ఎమ్మెల్యేల ప్రాతినిధ్యం లేని నియోజకవర్గాలకు సంబంధించి నియోజకవర్గ ఇన్‌చార్జులకు ఆహ్వానం పంపారు. నామినేషన్ల దాఖలుకు తక్కువ సమయం ఉండటంతో బుధవారం రాత్రికే హైదరాబాద్‌కు చేరుకోవాల్సిందిగా పార్టీ ఎమ్మెల్యేలు, పార్టీ ఇన్‌చార్జులకు పార్టీ కార్యాలయం టీఆర్‌ఎస్‌భవన్‌ నుంచి స్పష్టమైన సందేశం పంపారు. 

‘తాండూరు’లో నేతల రాజీ.. 
తాండూరు మున్సిపాలిటీ పరిధిలో మాజీ మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డికి నడుమ టికెట్ల పంపిణీపై నెలకొన్న వివాదాలకు ఫుల్‌స్టాప్‌ పడింది. గురువారం తెలంగాణభవన్‌లో కేసీఆర్‌తో జరిగే సమావే శానికి ఎమ్మెల్యే హోదాలో రోహిత్‌రెడ్డికి ఆహ్వానం అందిన నేపథ్యంలో, ఆలోపే ఇద్దరి మధ్య సయోధ్య కుదర్చాలని పార్టీ అధిష్టానం మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌కు బాధ్యతలు అప్పగించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే టికెట్ల పంపిణీపై వీరిద్దరి నడుమ బుధవారం రాజీ కుదరడంతో, తలసాని ఇద్దరిని వెంట బెట్టుకుని తెలంగాణభవన్‌కు వచ్చారు. తమ ఇద్దరి నడుమ విభేదాల్లేవని, కలసికట్టుగా పనిచేస్తామని వారితో ప్రకటన ఇప్పించారు.  

ఎమ్మెల్యేల చేతికి
బీ ఫారాలు మున్సిపోల్స్‌లో పార్టీ అభ్యర్థులను ఎంపిక చేసే బాధ్యతను ఇప్పటికే స్థానిక ఎమ్మెల్యేలకు అప్పగించినందున, బీ ఫారాలనూ వారి చేతికే అందజేయాలని పార్టీ నిర్ణయించింది. అభ్యర్థుల ఎంపికలో విపక్ష పార్టీలు అనుసరిస్తున్న తీరు, ప్రచార వ్యూహంపై ఇప్పటికే వివిధ వర్గాల నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా, టీఆర్‌ఎస్‌ అనుసరించాల్సిన ప్రచార వ్యూహంపై పార్టీ అధినేత, సీఎం కేసీఆర్‌ సమావేశంలో ఎమ్మెల్యేలు, ఇన్‌చార్జులకు దిశానిర్దేశం చేస్తారు. అభ్యర్థుల ఎంపికలో టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు అనుసరిస్తున్న తీరునూ రాష్ట్రస్థాయిలో పార్టీ అధిష్టానం నిశితంగా పరిశీలిస్తోంది. ఈ నేపథ్యంలో అభ్యర్థుల ఎంపికలో తడబడుతున్న కొందరు ఎమ్మెల్యేలకు సీఎం కేసీఆర్‌ సూచనలు చేసే అవకాశం ఉందని పార్టీ వర్గాలు తెలిపాయి. కాగా పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్‌రెడ్డి ఎమ్మెల్యేలు, ఇన్‌చార్జులకు ‘ఏ’ఫారాలు, ‘బీ’ఫారాలు అందజేస్తారు.

 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top