కొండా దంపతులకు అహంకారం ఎక్కువ

MP Pasunuri Dayakar Comments On Konda Surekha Warangal - Sakshi

హన్మకొండ/హన్మకొండ చౌరస్తా: సీఎం కేసీఆర్‌కు అహంకారం అని విమర్శిస్తున్న కొండా దంపతులకే అహంకారం ఎక్కువని, కాళ్లు మొక్కించుకునే సంస్కృతి వారిదేనని వరంగల్‌ లోక్‌సభ సభ్యుడు పసునూరి దయాకర్‌ అన్నారు. హన్మకొండలోని అశోకా హోటల్‌లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పసునూరి దయాకర్‌ మాట్లాడుతూ ఉద్యమకారుల ఇంటికి వెళ్లలేదని విమర్శించడంలో అర్థం లేదన్నారు. తనతోపాటు ఎంతో మంది ఉద్యమకారుల ఇంటికి కేసీఆర్‌ నేరుగా వచ్చారన్నారు. బీసీ మహిళ అని చేరదీసి పార్టీలోకి తీసుకుంటే ఏనాడు ఉద్యమకారులను, పార్టీ కార్యకర్తలను పట్టించుకోలేదని దుయ్యబట్టారు. కేసీఆర్‌ ఉద్య మం మొదలు పెడితే కీటీఆర్, కవిత భాగస్వాములయ్యారని, లాఠీ దెబ్బలు తిన్నారని, జైలుకు వెళ్లారని గుర్తు చేశారు. జయశంకర్‌ సార్‌కు ప్రభుత్వం ఎంతో గుర్తింపు ఇచ్చిందన్నారు.

రాజీనామా చేసి గెలిస్తే రాజకీయ సన్యాసం : తాజా మాజీ ఎమ్మెల్యే వినయ్‌భాస్కర్‌
కొండా మురళీధర్‌రావు ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి స్వతంత్రంగా పోటీ చేసి ఏకగ్రీవంగా గెలిస్తే తాను రాజకీయ సన్యాసం తీసుకుంటానని తాజా మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్‌భాస్కర్‌ సవాల్‌ విసిరారు. కొండా మురళి, కొండా సురేఖ దంపతులు తన అల్లుడు మర్రి జనార్దన్‌ పటేల్‌ను తన వద్దకు పంపి టీఆర్‌ఎస్‌లో చేరేందుకు మధ్యవర్తిత్వం నెరిపారన్నారు. తాను వారిని కేటీఆర్‌ మిత్రుడు శ్రీనివాస్‌ రెడ్డికి ఇంటికి తీసుకెళ్లి పార్టీలో చేరే అంశంపై కేటీఆర్, తాను చర్చించామన్నారు.

అనంతరం సీఎం కేసీఆర్‌ను తాను, కేటీఆర్‌ కలిసి పార్టీలో చేర్చుకునేలా ఒప్పించామని, ప్రవర్తన మార్చుకోవాలని కేసీఆర్‌ సూచించగా అంగీకరించారన్నారు. గతంలో ఉద్యమకారులపై చేసిన దౌర్జన్యాలను కేసీఆర్‌ పెద్ద మనస్సుతో తుడిచివేశారన్నారు. ఎమ్మెల్సీ కొండా మురళీ రాజీనామా చేసి స్వతంత్రంగానైనా లేదంటే తనను ఆహ్వానించారని చెబుతున్న 15 పార్టీల్లో దేని నుంచైనా పోటీ చేసి ఏకగ్రీవంగా గెలువాలని సవాల్‌ విసిరారు. కాంట్రాక్టర్లు, అధికారులను బెదిరించే డెన్‌ మీ ఇల్లు, గెస్ట్‌ హౌస్‌ అని ఆరోపించారు.  కేసీఆర్‌ కుటుంబాన్ని విమర్శిస్తే సహించేది లేదని హెచ్చరించారు.

కుడా చైర్మన్‌ మర్రి యాదవరెడ్డి మాట్లాడుతూ జయశంకర్‌ సార్‌కు గుర్తింపు ఇవ్వలేదని అనడంలో వాస్తవం లేదన్నారు. ఆయన పుట్టిన రోజను ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తుందన్నారు. భూపాలపల్లి జిల్లాకు, వ్యవసాయ విశ్వవిద్యాలయానికి ఆయన పేరు పెట్టారని గుర్తు చేశారు. టీఆర్‌ఎస్‌ సీనియర్‌ నాయకుడు నాగుర్ల వెంకటేశ్వర్లు మాట్లాడుతూ కొండా దంపతుల విమర్శలు హాస్యాస్పదంగా ఉన్నాయని ఎద్దేవా చేశారు. దమ్ము, ధైర్యం ఉంటే ముగ్గురు స్వతంత్రంగా పోటీ చేసి గెలువాలన్నారు. సమావేశంలో వరంగల్‌ అర్బన్‌ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ ఆజీజ్‌ఖాన్, జనగామ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ ఎడవెల్లి కృష్ణారెడ్డి పాల్గొన్నారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top